బదిలీల బంతాట..!
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:57 AM
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్ డీఏ)లో జరిగిన బదిలీల్లో గంద రగోళం ఏర్పడింది. కౌన్సెలింగ్ పద్ధతిలో బదిలీలు నిర్వహించినా, ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఉద్యోగులు కోరుకున్న మండలాలకు పోస్టింగ్ ఇవ్వకపోవడం, ఇంతవరకు జాబితాలను విడుదల చేయకపోవడంతో గందరగోళం ఏర్పడింది.

డీఆర్‌డీఏలో బదిలీలు జరిగినా జాబితాలు బయటపెట్టరు
ఉత్తర్వులు ఉద్యోగుల వాట్సాప్‌కు పంపుతామంటూ గందరగోళం
చక్రం తిప్పుతున్న ఓ అధికారి.. ఆందోళనలో ఉద్యోగులు
ఆ నాలుగు మండలాల్లో ఏపీఎం పోస్టులు ఖాళీ
మచిలీపట్నం మండల ఏపీఎం పోస్టుపై అనుమానాలు
అధికారుల అక్రమాలను బయట పెడతానంటూ ఓ సీసీ హడావిడి
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో ముగ్గురు జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు మిగులుబాటుగా ఉండటంతో ఇటీవల వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఒక అధికారి బదిలీల అంశాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకుని తెరవెనుక కథ నడిపారని ఉద్యోగులు చెబుతున్నారు. కార్యాలయంలో ఈ అధికారి బాధ్యతలు వేరే ఉండగా, ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) దగ్గరే ఉంటూ అన్ని కార్యాలు చక్కబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో ఏయే మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయో కూడా పూర్తి వివరాలు ఉద్యోగులకు తెలియజేయకుండా గోప్యత పాటించారనే విమర్శలు వస్తున్నాయి. కౌన్సెలింగ్ సమయంలో సెర్ఫ్ కార్యాలయం నుంచి ప్రత్యేక అఽఽధికారి వచ్చారని, ఆయన సమక్షంలోనే బదిలీలకు సంబంధించిన మండలాలను కోరుకున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. అప్పట్లో తాము కోరుకున్న మండలాలకే బదిలీ చేస్తామని ప్రకటించారని, జాబితా మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేమని అడిగితే బదిలీ ఉత్తర్వులు వాట్సాప్‌కు వస్తాయని, దాని ప్రకారం విధుల్లో చేరాలని చెబుతున్నారని అంటున్నారు. మచిలీపట్నం మండలం ఉంది. ఈ మండల సమాఖ్యలో రూ.2.10 కోట్ల మేర నగదు ఉంది. ఈ నగదును ఎలాగైనా పక్కదారి పట్టించేందుకు కొంతకాలంగా కొందరు.. ఒక సీసీ ద్వారా తెరవెనుక వ్యూహం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ పనిచేసే సీసీకి విద్యార్హతలు లేకున్నా ఇన్‌చార్జి ఏపీఎంగా నియమిస్తూ ఐదారు నెలల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు డీఆర్‌డీఏ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ సీసీని ఇన్‌చార్జి ఏపీఎం విఽధుల నుంచి పక్కనపెట్టారు. నగదు పక్కదారి పట్టకుండా అధికారులు ముకుతాడు వేస్తూ వస్తున్నారు. మచిలీపట్నం మండల సమాఖ్యలో వివాదాస్పదంగా ఉన్న సీసీని ప్రస్తుతం జరిగిన బదిలీల్లో పెడన మండలానికి బదిలీ చేశారు. మచిలీపట్నం మండల కార్యాలయంలో ఐదుగురు సీసీలు, ఒక ఏపీఎం ఉండాలి. చిన్న మండలాల్లో పూర్తిస్థాయిలో సిబ్బందిని ఉంచి, మచిలీపట్నం మండలంలో మాత్రం ఒక్క సీసీనే ఉంచి, మిగిలిన వారిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఇక్కడ ఏపీఎంతో పాటు సీసీలు లేరనే కారణం చూపి పెడనకు బదిలీ చేసిన సీసీని మళ్లీ మచిలీపట్నానికి తెచ్చేందుకు ఎత్తుగడ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులను సీసీ బెదిరిస్తున్నారా?
మచిలీపట్నం మండల ఏపీఎం పోస్టు కోసం ఒక సీసీ ప్రయత్నాలు చేయడం, ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో నగదు చేతులు మారడం వివాదాస్పదమవుతోంది. డీఆర్‌డీఏ కార్యాలయ అధికారులు తనకు ఏపీఎం పోస్టు ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా వేరే మండలానికి బదిలీ చేయడంతో ఆగ్రహంతో ఉన్న సదరు సీసీ.. అధికారులు చేసిన అక్రమాలు, ఇతరత్రా వ్యవహారాలు తన గుప్పెట్లో ఉన్నాయని, వాటిని బయట పెడతానని హెచ్చరిస్తుండటంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రజాప్రతినిధి పీఏ అండదండలున్న ఈ సీసీ అధికారుల వ్యవహారాలన్నీ వెల్లడిస్తానని చెబుతుండటంతో డీఆర్‌డీఏ కార్యాలయంలో ఏం జరుగుతుందనే సందిగ్ధం నెలకొంది.
బదిలీలు పారదర్శకంగానే జరిగాయి
ఉమ్మడి జిల్లా పరిధిలో డీఆర్‌డీఏ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగానే జరిగాయి. మచిలీపట్నం మండలంతో పాటు మరో మూడు మండలాల్లో ఏపీఎంలుగా వచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. - హరిహరనాథ్, డీఆర్‌డీఏ పీడీ