నిర్లక్ష్యపు సేవలపై సీరియస్
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:08 AM
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ ప్రక్షాళన మొదలైంది. భక్తులకు సరైన సేవలు అందకపోవడంపై ఆగ్రహించిన సీఎం చంద్రబాబు.. ఈవో కిశోర్‌కుమార్‌పై వేటు వేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ కమిషనర్ క్యాడర్ కలిగిన మహేశ్వరరెడ్డిని నియమించారు. బుధవార ం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీజీఎస్ ద్వారా నిర్వహించిన సమీక్షలో పెనుగంచిప్రోలు దేవస్థానానికి వచ్చే భక్తులకు సరైన సేవలు అందట్లేదనే విషయం బయటపడటంతో ముఖ్యమంత్రి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ ఈవోపై వేటు
భక్తులకు అందించే సేవలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
రాష్ట్రస్థాయి సమీక్షలో ఆగ్రహం.. వెంటనే చర్యలు
నూతన ఈవోగా మహేశ్వరరెడ్డి బాధ్యతల స్వీకరణ
రెండు తెలుగు రాషా్ట్రలకు ప్రధానమైన ఆలయం
భక్తుల సేవలకు మకిలీ పట్టించిన అధికారులు
ఆంధ్రజ్యోతి, పెనుగంచిప్రోలు రూరల్ : పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానంలో భక్తులకు జరుగుతున్న అసౌకర్యంపై ‘ఆంధ్రజ్యోతి’ ఇటీవల కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వం నిర్వహించిన ఆర్టీజీఎస్ ఫీడ్‌బ్యాక్ కూడా భక్తులను ఇబ్బంది పెడుతున్నట్టుగా రావడంతో ఈవో కిశోర్‌కుమార్‌ను సెలవులపై పంపి.. మహేశ్వరరెడ్డిని కొత్త ఈవోగా నియమించారు. రెండేళ్ల కిందటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన తిరుపతమ్మ ఆలయం ఆర్‌జేసీ (రీజనల్ జాయింట్ కమిషనర్) కేడర్‌లో కొనసాగింది. ఆదాయం పడిపోతుందనే సాకుతో గత ప్రభుత్వం డీసీ (డిప్యూటీ కమిషనర్) కేడర్‌కు కుదించినప్పటి నుంచి ఆలయ నిర్వహణ, భక్తుల సేవలు, వసతుల విషయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
దర్శనాలు, తాగునీరు, మౌలిక వసతుల్లో అసంతృప్తి
భక్తులకు దర్శనాలు, తాగునీరు, మౌలిక వసతుల విషయంలో దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో దర్శనాలు 44.4 శాతం, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనలో 45.5 శాతం, పారిశుధ్య నిర్వహణలో 42.9 శాతం సంతృప్తి వ్యక్తమైంది. పై మూడు అంశాలు కనీసం 50 శాతానికి మించకపోవటంపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆలయంలో భక్తుల సంతృప్తిస్థాయి 90 శాతానికి పెంచేలా పదిరోజుల్లో కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
సంతృప్తికరంగా సాగని దర్శనాలు
ఆలయంలోకి ప్రవేశించే భక్తులు బయట కౌంటర్‌లో సెల్‌ఫోన్లు భద్రపరుచుకోవాలి. ఈ విషయం తెలియని కొందరు భక్తులు నేరుగా వెళ్తుండగా, అక్కడ ఉండే సిబ్బంది భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పలుమార్లు సిబ్బందికి, భక్తులకు తీవ్రస్థాయి వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే శుక్ర, ఆదివారాల్లో క్యూలైన్లను సరిగ్గా నడపటంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
తాగునీటికి ఇబ్బందులు
మూడు నెలలుగా భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఆలయం పక్కనే ఉన్న మునేరులోని బోర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుండగా, మూడు నెలల క్రితం పైపులైన్ కొట్టుకుపోవటంలో స్థానికంగా ఉన్న బావి నీటిని ఆర్వో ప్లాంట్ల ద్వారా శుద్ధిచేసి సరఫరా చేస్తున్నారు. ఆ నీటి నాణ్యత విషయంలో భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
మౌలిక వసతులను సద్వినియోగం చేసుకోరు
గతంతో పోలిస్తే మౌలిక వసతుల కల్పన కొంత మెరుగుపడినా ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు సుమారు రూ.కోటి వ్యయంతో భక్తుల కోసం విశ్రాంతి మందిరం నిర్మిస్తే దానిని పూర్తిస్థాయిలో వినియోగించని దుస్థితి నెలకొంది. ప్రారంభించి ఏడాది అవుతున్నా ఈ మందిరం భక్తులకు ఉచితమనే బోర్డు ఏర్పాటు చేయకపోవటంతో నిరుపయోగంగా మారింది. నాలుగు రోజుల క్రితమే చిన్నపాటి బోర్డు రాశారు. గ్యాస్‌తో కూడిన పొంగళ్ల షెడ్లు ఉన్నా ధరల నియంత్రణ లేకపోవటంతో చాలామంది భక్తులు మునేరులో ప్రైవేట్ గ్యాస్ స్టౌలను ఆశ్రయిస్తున్నారు.
అధ్వానంగా పారిశుధ్యం
దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక సిబ్బందితో పారిశుధ్య సేవలు చేయిస్తున్నా పలుచోట్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఆలయం చుట్టూ, మునేరు పరిసరాలు, సత్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మునేరు వైపు నుంచి గుంపులుగా ఆలయం వైపునకు వస్తున్న పందులు, కుక్కలు భక్తులపై దాడి చేస్తున్నాయి.