Share News

‘విజయ’ం ఎవరిది?

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:42 AM

విజయ డెయిరీలో ఎన్నికల సందడి మొదలైంది. కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి (విజయ డెయిరీ) పాలకవర్గంలో ఖాళీ అయిన మూడు డైరెక్టర్ల పోస్టులకు (జనరల్‌-2, మహిళా కేటగిరీ-1) సోమవారం పాలఫ్యాక్టరీలోని క్షీరదర్శన్‌ హాల్లో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు.

‘విజయ’ం ఎవరిది?
నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారికి అందిస్తున్న వెంకట నగేశ్‌, వాణిశ్రీ. పక్కనే పలువురు డైరెక్టర్లు

విజయ డెయిరీలో ఎన్నికల కోలాహలం

మూడు డైరెక్టర్ల పోస్టులకు 5 నామినేషన్లు

పరిశీలన అనంతరం మిగిలినవి 4

మహిళా కేటగిరీ ఏకగ్రీవం అయినట్టే..

జనరల్‌ కేటగిరీ డైరెక్టర్ల ఎన్నికపై ఉత్కంఠ

నామినేషన్ల ఉపసంహరణకు గడువు నేడు

చిట్టినగర్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : విజయ డెయిరీలో ఎన్నికల సందడి మొదలైంది. కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి (విజయ డెయిరీ) పాలకవర్గంలో ఖాళీ అయిన మూడు డైరెక్టర్ల పోస్టులకు (జనరల్‌-2, మహిళా కేటగిరీ-1) సోమవారం పాలఫ్యాక్టరీలోని క్షీరదర్శన్‌ హాల్లో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఎల్‌.గురునాథం 5 నామినేషన్లను పరిశీలించి, ఒక నామినేషన్‌ను వివిధ కారణాలతో తిరస్కరించారు. 4 నామినేషన్లు మిగిలాయి. పెడనలోని పెనుమల్లికి చెందిన అర్జా వెంకట నగేశ్‌, వత్సవాయిలోని భీమవరానికి చెందిన ఇంజం రామారావు, తిరువూరులోని ముష్టికుంటకు చెందిన గద్దె రంగారావు, విస్సన్నపేటకు చెందిన నెక్కళపు వాణిశ్రీ, తిరువూరులోని చిట్టేలకు చెందిన బోయపాటి సుశీల నామినేషన్లు ఇవి. బోయపాటి సుశీల నామినేషన్‌ వివిధ కారణాలతో తిరస్కరణకు గురైంది. దీంతో మహిళా కేటగిరీకి సంబంధించి ఒకే నామినేషన్‌ మిగలడంతో దాదాపు ఏకగ్రీవం అయినట్టే.

ఏకగ్రీవమా? ఎన్నికా?

జనరల్‌ కేటగిరీలో రెండు డైరెక్టర్ల పోస్టులకు మూడు నామినేషన్లు మిగిలాయి. మంగళవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ముగ్గురిలో ఒకరు నామినేషన్‌ ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. జనరల్‌ కేటగిరీలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉంటే సాయంత్రం 5 గంటల తరువాత ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. సెప్టెంబరు 2న ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లాకు చెందిన 375 సొసైటీ అధ్యక్షులు ఓటుహక్కు వినియోగించుకుని డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఏదిఏమైనా మంగళవారం సాయంత్రానికి ఏకగ్రీవమా, ఎన్నికా అనేది తేలిపోతుంది. నామినేషన్ల కార్యక్రమంలో డైరెక్టర్లు డాక్టర్‌ దాసరి వెంకట బాలవర్థనరావు, వేమూరి సాయి వెంకటరమణ, చలసాని చక్రపాణి, ఎన్‌.నాగేశ్వరరావు, శనగల శివజ్యోతి, ఎం.వెంకటలక్ష్మి, పాలడుగు వెంకటరామ వరప్రాద్‌, పల్లగాని కొండలరావు, బొట్టు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం వరకు గడువు ఉందని, ఆ తరువాత జనరల్‌ కేటగిరీకి ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉంటే సెప్టెంబరు 2న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి, అసిస్టెంట్‌ రిజిసా్ట్రర్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ (రిటైర్డ్‌) ఎల్‌.గురునాథం చెప్పారు.

Updated Date - Aug 26 , 2025 | 12:42 AM