ఖాళీస్థలం.. కారుచౌకగా..
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:00 AM
రూ.కోట్ల విలువైన విజయవాడ కార్పొరేషన్ స్థలాన్ని కారుచౌకగా రాఘవేంద్ర మఠానికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతటి స్థలాన్ని రిజిసే్ట్రషన్ విలువకే తక్కువకు అప్పగించే ఫైల్ శరవేగంగా కదులుతుండగా, టీడీపీ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఫైల్‌ను అడ్డుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యేల వద్ద పంచాయితీ పెట్టారు.
బృందావన కాలనీలోని కార్పొరేషన్ స్థలం రాఘవేంద్ర మఠానికి ఇచ్చే ప్రయత్నాలు
విలువ రూ.60 కోట్లపైనే.. రిజిసే్ట్రషన్ ధరకే కట్టబెట్టే యత్నాలు
2018 నాటి ప్రతిపాదన మళ్లీ తెరపైకి..
1,502 గజాలు మఠానికి కేటాయించే ప్లాన్
కార్పొరేషన్‌లో శరవేగంగా కదులుతున్న ఫైల్
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ కార్పొరేటర్లు
అడ్డుకోవాలని ఎమ్మెల్యేలు, ఎంపీ వద్ద పంచాయితీ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలోని బృందావన కాలనీలో కార్పొరేషన్‌కు ఉన్న 2 వేల చదరపు గజాల్లో 1,502 చదరపు గజాలను కారుచౌకగా రాఘవేంద్ర మఠానికి కట్టబెట్టేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పావులు కదులుతున్నాయి. ఇక్కడ గజం మార్కెట్ విలువ రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంది. వీటి విలువ రూ.60 కోట్లు. ఇంతటి విలువైన స్థలాన్ని ఆగమేఘాలపై కారుచౌకగా రాఘవేంద్ర మఠానికి కట్టబెట్టేందుకు కార్పొరేషన్ అధికారులు ఫైల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ అంశాన్ని అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. ఈ తంతును వెంటనే ఆపాలంటూ టీడీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు, ఎంపీ వద్ద పంచాయితీ పెట్టారు.
నాడు టీడీపీ కౌన్సిల్ తిరస్కరణ
వాస్తవానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించిన సమయంలో మొదటిసారిగా రాఘవేంద్ర మఠం నిర్వాహకులు స్థలం కావాల్సిందిగా ప్రతిపాదించారు. దీనిపై అప్పట్లో ప్రభుత్వం బృందావన కాలనీలోని కార్పొరేషన్ స్థలాన్ని కేటాయించాలని నిర్దేశించింది. మున్సిపల్ కమిషనర్.. కౌన్సిల్ ఆమోదానికి పెట్టారు. నాడు కార్పొరేషన్ పాలకపక్షంగా టీడీపీ ఉండగా, ఖరీదైన స్థలాన్ని కట్టబెట్టడానికి కౌన్సిల్ అంగీకరించలేదు. ఈ ప్రతిపాదనను కౌన్సిల్ తిరస్కరించి ప్రభుత్వానికి పంపింది. కౌన్సిల్ తిరస్కరిస్తూ పంపిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు 2018, జూలై 30న జీవో నెంబర్ 707ను విడుదల చేసింది. నిర్దేశించిన స్థలంలో మఠం నిర్మించుకునేందుకు వీలుగా తదుపరి చర్యలు తీసుకోవాలని నాటి టీడీపీ ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించింది. అప్పటి కౌన్సిల్ పాలకపక్షం మాత్రం దీనిని గట్టిగా అడ్డుకుంటూ ముందుకు కదలనివ్వలేదు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి.
వైసీపీ హయాంలో దోబూచులాట
వైసీపీ ప్రభుత్వం వచ్చాక చాలాకాలం ఈ ప్రతిపాదన ముందుకు రాలేదు. వైసీపీ ప్రభుత్వం ఉండగా చివరి సమయంలో ఈ ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చారు. రాఘవేంద్ర మఠం ప్రతిపాదనకు అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే సమయానికి ఎన్నికలు వచ్చాయి. దీంతో కేటాయింపులు జరగలేదు.
మళ్లీ తెరపైకి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రాఘవేంద్ర మఠానికి భూముల కేటాయింపుపై మళ్లీ కదలిక వచ్చింది. రిజిస్ర్టేషన్ విలువకే కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతుండటంతో టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పీపీపీ విధానానికి స్వస్తి
పూర్వం ఈ స్థలంలో కార్పొరేషన్ అధికారుల క్వార్టర్లు ఉండేవి. భవనాలు శిథిలావస్థకు చేరటంతో వాటిని పడగొట్టి ఫ్లాట్‌గా అభివృద్ధి చేశారు. మొత్తం 2 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని కార్పొరేషన్ గతంలో భావించింది. రాఘవేంద్ర మఠానికి ఈ భూముల కేటాయింపుల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను మరుగున పడేశారు.