పర్యాటకం ప్రైవేట్‌కు..
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:01 AM
రూ.10 కోట్ల వార్షికాదాయం వచ్చే పర్యాటక యూనిట్లను రూ.4.50 కోట్లకు 33 ఏళ్ల పాటు ఎవరైనా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడతారా? ఘనత వహించిన టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) అధికారులు ఇప్పుడదే చేస్తున్నారు. అతి తక్కువకు పర్యాటక యూనిట్లను కట్టబెట్టడంతో పాటు కేవలం 4 శాతం కడితే నెలరోజుల్లో అప్పగించేస్తామన్న బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. పర్యాటక శాఖ ఎండీ, చైర్మన్లు కాదంటున్నా.. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా.. పట్టించుకోకుండా పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి.
విజయవాడ డివిజన్ యూనిట్లన్నీ కట్టబెట్టే ప్రయత్నాలు
రూ.10 కోట్ల ఆదాయమిచ్చేవి రూ.4.50 కోట్లకే..
బరంపార్కు, భవానీద్వీపం, సూర్యలంక బీచ్ రిసార్ట్స్, సాగర్, విజయపురి సౌత హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు..
ప్రైవేట్‌కు అప్పగించేందుకు ఆర్‌ఎఫ్‌పీ విడుదల చేసిన ఏపీటీడీసీ
పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్‌జైన్ అత్యుత్సాహం
ఎండీ, చైర్మన్లు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా నిర్ణయం
(ఆంధ్ర జ్యోతి, విజయవాడ) : విజయవాడ డివిజన్ పరిధిలోని మూడు జిల్లాల్లోని ఆరు పర్యాటక యూనిట్లను గంపగుత్తగా ప్రైవేట్ సంస్థ చేతుల్లో పెట్టేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ)ను విడుదల చేసింది. వస్తున్న ఆదాయానికి భిన్నంగా కారుచౌకగా ప్రైవేట్ సంస్థకు లీజుకిచ్చేలా నోటిఫికేషన్ ఇవ్వటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ జిల్లాలో హరిత బెర్మ్‌పార్క్, భవానీ ద్వీపం, బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ రిసార్ట్స్, పల్నాడు జిల్లా పరిధిలోని ఎత్తిపోతల హరిత హోటల్, నాగార్జున సాగర్, విజయపురి సౌత హరిత హోటల్, ధ్యానబుద్ధ ప్రాజెక్టులను రూ.4.50 కోట్ల అతి తక్కువ రెవెన్యూ షేర్‌తో ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది. వీటన్నింటినీ వేర్వేరుగా కాకుండా గంపగుత్తగా ప్రైవేటుకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటుచేసే వాటిని పీపీపీ కింద చేపట్టాలని, నష్టాల్లో ఉన్న యూనిట్లను మాత్రమే అవకాశాన్ని బట్టి పీపీపీ వైపు తీసుకెళ్లాలన్నారు. మధ్యతరగతి వర్గాలకు భారంగా ఉండకూడదన్న ఉద్దేశంతో లాభాల్లో ఉన్న యూనిట్ల జోలికి వెళ్లొద్దని చెప్పారు. కానీ, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్‌జైన్ మాత్రం రిటైర్‌మెంట్ దగ్గరపడటంతో ఏపీటీడీసీ ఎండీ, చైర్మన్లు కాదంటున్నా వినకుండా ఏకపక్షంగా ప్రైవేటుకు కట్టబెట్టేందుకు ఆదేశించారు.
రూ.60 కోట్ల బకాయిల మాటేంటి..?
ప్రైవేటీకరణ పేరుతో గతంలో విచ్చలవిడిగా ఇచ్చిన లీజుల కారణంగా పర్యాటకాభివృద్ధి సంస్థకు ఇప్పటికీ రూ.60 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఏపీటీడీసీ అధికారులు ఇందులో ఒక్కపైసా కూడా రాబట్టలేకపోయారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
4 శాతం డబ్బు కడితే చాలట..!
ప్రైవేట్ సంస్థకు మంచి ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు. ఏడాది లీజు మొత్తం రూ.4.50 కోట్లలో 4 శాతం డబ్బు కడితే చాలని బంపర్ ఆఫర్ ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని త్రైమాసిక విధానంలో కట్టుకునే అవకాశం కల్పించటం గమనార్హం. లీజు కాలాన్ని మాత్రం నిర్దేశించలేదు. 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నా.. దానిని పేపర్‌లో ఎక్కడా పేర్కొనలేదు. వ్యతిరేకత వస్తుందేమోనన్న ఉద్దేశంతో ఆ పని చేయలేదని తెలుస్తోంది.
లాభాల్లో ఉన్నప్పటికీ..
విజయవాడలోని హరిత బరం పార్కు ద్వారా ఏడాదికి రూ.4 కోట్ల ఆదాయం వస్తోంది. భవానీ ద్వీపం ద్వారా రూ.2 కోట్ల ఆదాయం వస్తోంది. సూర్యలంక బీచ్ రిసార్ట్స్ ద్వారా రూ.3 కోట్ల ఆదాయం వస్తోంది. మిగిలిన ప్రాజెక్టుల ద్వారా రూ.కోటి ఆదాయం వస్తోంది. ఇక్కడే రూ.10 కోట్ల లెక్క తేలుతుండగా, రూ.4.50 కోట్లకు ప్రైవేట్ సంస్థకు ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్నది ఉన్నతాధికారులకే తెలియాలి.
ఉద్యోగుల మెడపై కత్తి
ఏపీటీడీసీలో పనిచేసే ఉద్యోగుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా చేశారు. పాతికేళ్ల కిందట ఉద్యోగులకు అనేక పరీక్షలు పెట్టి, ఇంటర్వ్యూలు నిర్వహించి తీసుకోగా, వారికి పర్యాటకంపై శిక్షణ కల్పించాలని, తరచూ పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. ఈ పేరుతో పరీక్షల్లో పాస్ కాలేదని ప్రైవేట్ సంస్థ వారిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం కల్పించారు.
బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆస్తిని లీజుకిస్తారా?
హరిత బరం పార్కును రూ.150 కోట్లకు రామవరప్పాడులోని ఎస్‌బీఐలో తాకట్టు పెట్టారు. వచ్చిన డబ్బుతో కాటేజీల రెన్నోవేషన్ పనులకు టెండర్లు పిలిచారు. రూ.90 కోట్ల వరకు రెన్నోవేషన్ పనులు చేపట్టి పనులను మధ్యలోనే రద్దు చేశారు. మరో రూ.60 కోట్ల పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులో తనఖా ఉన్న ఆస్తిని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టే అధికారం ఏపీటీడీసీకి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.