Share News

ఈ-దసరా.. పూర్తి టెక్నాలజీతో..

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:52 AM

శరన్నవరాత్రుల 11 రోజులూ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి ఎంతమంది భక్తులు వస్తారు? మూలానక్షత్రం, విజయదశమి రోజున రద్దీ ఎలా ఉంటుంది? ఏ ప్రాంతం వైపు నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ టెక్నాలజీ ద్వారా సమాధానం చెప్పాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఏడాది జరగబోయే ఉత్సవాలకు టెక్నాలజీని విరివిగా ఉపయోగించి సాఫ్ట్‌గా బందోబస్తును నిర్వహించాలని యోచిస్తున్నారు.

ఈ-దసరా.. పూర్తి టెక్నాలజీతో..

రంగంలోకి 42 డ్రోన్లు.. భక్తుల లెక్కింపు

రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లో హెడ్‌కౌంట్‌ కెమెరాలు

మోడల్‌ గెస్ట్‌హౌస్‌లో సీసీసీకి అనుసంధానం

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : గత ఏడాది సెప్టెంబరులో వచ్చిన వరదల సమయంలో పోలీసులు డ్రోన్లను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దసరా ఉత్సవాల్లో వాటి వినియోగాన్ని కొనసాగించారు. ముఖ్యంగా మూలానక్షత్రం, విజయదశమి రోజున భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఆ సమయంలో రద్దీని డ్రోన్ల ద్వారా తెలుసుకుని అప్పటికప్పుడు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలీసు కమిషనరేట్‌కు మొత్తం ఆరు డ్రోన్లు ఉన్నాయి. ఇవికాకుండా ప్రభుత్వం కొద్దినెలల క్రితం అత్యాధునిక టీథర్డ్‌ డ్రోన్‌ను కేటాయించింది. వాటితో పాటు మరో 42 డ్రోన్లను రంగంలోకి దించాలని అధికారులు నిర్ణయించారు. వీటన్నింటినీ క్యూలైన్ల ప్రారంభం పాయింట్‌ నుంచి ఎగరేస్తారు. భక్తుల తలలను లెక్కించేలా డ్రోన్లలోని కెమెరాలకు సాఫ్ట్‌వేర్‌ను జత చేయాలని భావిస్తున్నారు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ నుంచి బయటకొచ్చేవారిని, స్నానపు ఘాట్ల వద్ద ఉన్నవారి లెక్కలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఇందుకోసం దుర్గాఘాట్‌ పక్కన ఉన్న మోడల్‌ గెస్ట్‌హౌస్‌లో అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)ను ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లు చిత్రీకరించిన దృశ్యాలను సీసీసీలో ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్లపై అధికారులు వీక్షిస్తారు. పరిస్థితిని బట్టి బందోబస్తులో మార్పులు చేస్తారు.

హెడ్‌కౌంట్‌ సీసీ కెమెరాలు

దుర్గమ్మను రోజుకు ఎంతమంది దర్శించుకున్నారన్న లెక్కలు తెలియడానికి ప్రధానాలయం నుంచి బయటకొచ్చే ప్రదేశంలో హెడ్‌కౌంట్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎంతమంది భక్తులు దర్శనం క్యూల్లోకి వెళ్తారన్న లెక్కలను ముందే తెలుసుకోవడానికి రైల్వేస్టేషన్‌లో 10, బస్టాండ్‌లో 10 ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే రైళ్లు, బస్సుల సమాచారాన్ని మొత్తం సీసీసీకి అనుసంధానం చేశారు. ఈ హెడ్‌కౌంట్‌ సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు లింక్‌ చేస్తున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని టోల్‌ప్లాజాల నుంచి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాటినీ సీసీసీలో భాగం చేస్తున్నారు.

హోల్డింగ్‌ పాయింట్లలో మార్పులు

మూలానక్షత్రం ముందురోజు రాత్రి నుంచి మొదలయ్యే హోల్డింగ్‌ పాయింట్లలో అధికారులు మార్పులు చేశారు. ఇప్పటి వరకు భక్తులను రోప్‌లతో పోలీసులు నియంత్రిస్తూ క్యూలోకి పంపేవారు. వీఎంసీ వద్ద ఉన్న క్యూ నుంచి వినాయకుడి ఆలయం వద్ద ఉన్న క్యూలోకి ప్రవేశించి దర్శనానికి వెళ్లేవారు. ఈ ఏడాది హోల్డింగ్‌ పాయింట్లను పెంచడంతో పాటు తిరుమల మాదిరిగా తాత్కాలికంగా కంపార్టుమెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒకరి వెనుక ఒకరు నడిచేలా కాకుండా నలుగురైదుగురు నడిచేలా వెడల్పు చేశారు. ఒక కంపార్టుమెంట్‌లో భక్తులను వినాయకుడి గుడి వద్ద క్యూలోకి పంపిన తర్వాత మరో కంపార్టుమెంట్‌ను వదిలేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

Updated Date - Sep 20 , 2025 | 12:52 AM