Share News

ప్రతిష్టాత్మకంగా దసరా ఉత్సవాలు

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:42 AM

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 వరకు జరిగే దసరా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వన్‌టౌన్‌ బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డిలో బుధవారం దసరా ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నివేదికను మంత్రి పరిశీలించారు.

ప్రతిష్టాత్మకంగా దసరా ఉత్సవాలు
సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆనం, ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవదాయ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, కలెక్టర్‌ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, ఈవో శీనానాయక్‌ తదితరులు

సామాన్య భక్తుడికే అగ్రతాంబూలం

మూలానక్షత్రం, దశమి రోజున ఉచిత లడ్డూ ప్రసాదం

దసరా ఉత్సవాలపై సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

కిందటి దసరాను మమ.. అనిపించారు : ఎమ్మెల్యే సుజన ఫైర్‌

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 వరకు జరిగే దసరా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వన్‌టౌన్‌ బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డిలో బుధవారం దసరా ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నివేదికను మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గతం కంటే ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూలానక్షత్రం, విజయదశమి రోజు ప్రతి భక్తుడికీ లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. ఉత్సవాలను జయప్రదం చేయటానికి అన్ని శాఖల్లోని సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అన్నప్రసాదం, తాగునీరు అందుబాటులో ఉండాలని, సామాన్య భక్తుడికే అగ్ర ప్రాధాన్యమని తెలిపారు. ఇంద్రకీలాద్రితో పాటు ప్రకాశం బ్యారేజీ విద్యుత వెలుగులతో శోభాయమానంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దూరాభారం కారణంగా ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం కంటే దుర్గాఘాట్‌లో నిర్వహించే పంచహారతులకే ప్రాధాన్యత ఇచ్చామని, భక్తుల నుంచి కూడా స్పందన వస్తోందని మంత్రి తెలిపారు. గత దసరాలో భక్తులు వేచి ఉండే ప్రాంతం, క్యూలైన్ల విషయంలో కొంత ఇబ్బంది కలిగిందని, ఈసారి వాటిని సరిదిద్ది మరిన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యాధరపురంలో టీటీడీ స్థలాన్ని దసరా ఉత్సవాలకు వినియోగించుకునేందుకు అనుమతి కోరతామన్నారు. దుర్గమ్మ ప్రధాన ఆలయానికి పూర్తి బంగారు తాపడం కోసం టీటీడీని సంప్రదించామని, వారికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారన్నారు.

ఎమ్మెల్యే సుజనా అసంతృప్తి

ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఉత్సవాలకు సంబంధించి పది నెలలుగా చేయాల్సిన పనులేమీ చేయలేదన్నారు. బడ్జెట్‌ తయారీలో క్లారిటీ కూడా లేదన్నారు. కిందటి ఏడాది ఉత్సవాలను మమ అనిపించారని, సంతృప్తికరం కాదన్నారు. పనులకు టెండర్లు పిలిచేటప్పుడు పారదర్శకత ఉండాలన్నారు. న్యాయపరంగా టెండర్లు పిలిచి ఉంటే పనులు చక్కగా జరిగేవని, టెండర్లు పిలిచేటప్పుడు లోపం కనిపించిందన్నారు. చెత్త తరలింపు విషయంలో అశ్రద్ధ చూపించారని, ఎక్కడ చెప్పులు అక్కడే ఉన్నాయన్నారు. ఆలయ సిబ్బంది, వలంటీర్లు, ఇతర సేవకులకు ఆర్‌ఎఫ్‌ఐడీ గుర్తింపు ఇవ్వాలని సూచించారు. లేకపోతే ఇష్టానుసారంగా ఎవరు వస్తుంటారో, ఎవరు పోతుంటారో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లో అమలు చేస్తున్న విధానాలు దుర్గగుడిలో ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ఇది సిస్టమ్‌ ఫెయిల్యూర్‌గా తాను అభిప్రాయపడుతున్నానన్నారు. శాశ్వత చర్యల విషయంలో కొంత లోపం ఉందని సుజనా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌, కలెక్టర్‌ లక్ష్మీశ, ఈవో శీనానాయక్‌, పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు, మునిసిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 12:42 AM