Share News

శ్రీలలిత శివజ్యోతి

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:54 AM

ఓవైపు జైభవానీ అంటూ భక్తుల జేజేలు.. మరోవైపు పండితుల మంత్రోచ్ఛారణలు.. అటువైపు కుంకుమార్చనల ధగధగలు.. ఇటువైపు విద్యుల్లతా హారాల నిగనిగలు.. అటుచూస్తే వలంటీర్ల సేవాస్ఫూర్తి.. ఇటుచూస్తే సాంస్కృతిక కార్యక్రమాల దీప్తి, ముత్తయిదు వాయినాలు, సువాసినీ పూజలు, వేదసభలు, నివేదనలు, అన్నప్రసాదాలు, హోమాది క్రతువులు.. ఒక్కటేమిటి.. తెలుగునాట భక్తిభావమంతా ఇంద్రకీలాద్రి వ్యాపితమైందా అన్నట్టుగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం లలితా వదనారవిందాన్ని చూసి తరించేందుకు భక్తులు క్యూ కట్టారు. రాకపోకల్లో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ దర్శనం మాత్రం సాఫీగానే సాగిపోయింది.

శ్రీలలిత శివజ్యోతి

లలితాత్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం

ఘనంగా అర్చకసభ, అర్చకుల సాధకబాధకాలపై ప్రత్యేక చర్చ

దర్శనానికి విచ్చేసిన వీఐపీలు.. సినీ ప్రముఖులు

ఒక్కరోజే లక్షమంది భక్తుల రాక.. రికార్డు

నేటి నుంచి మరింత పెరిగే అవకాశం

తగినట్టుగా అధికార యంత్రాంగ ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శనివారం శ్రీలలితా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన డ్యాష్‌ బోర్డు గణాంకాల ప్రకారం రాత్రి 7 గంటల వరకు 92,360 మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. అన్నప్రసాదాన్ని 20,895 మంది స్వీకరించారు. 2,125 మంది కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించారు. 1,74,720 లడ్డూల కొనుగోలు జరిగింది. అమ్మవారిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, గాయని సునీత దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ ఆదివారం మహాచండీగా దర్శనమిస్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Updated Date - Sep 28 , 2025 | 12:54 AM