తాగునీటికి కటకట!
ABN , Publish Date - May 12 , 2025 | 12:49 AM
విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో మంచినీటి కొరత ఏర్పడింది. బుడమేరు వరదలప్పుడు మినరల్ వాటర్ ప్లాంటు పాడైంది. అప్పటి నుంచి దానికి మరమ్మతులు చేయలేదు.
విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో కండక్టర్లు, డ్రైవర్లు వాటర్ కొని తెచ్చుకుంటున్న వైనం
బుడమేరు వరదలప్పుడు పాడైన మినరల్ వాటర్ ప్లాంట్
ఇప్పటికీ చేయని మరమ్మతులు
(ఆంధ్రజ్యోతి-బ్‌సస్టేషన్)
విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో మంచినీటి కొరత ఏర్పడింది. బుడమేరు వరదలప్పుడు మినరల్ వాటర్ ప్లాంటు పాడైంది. అప్పటి నుంచి దానికి మరమ్మతులు చేయలేదు. ఎండల తీవ్రత కారణంగా మంచినీటి కోసం సిబ్బంది, కండక్టర్లు, డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మంచినీరు తాగేందుకు ఏదో విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. డిపోలో పనిచేసే కార్మికులకు అక్కడకు వచ్చే డ్రైవర్లు, కండక్టర్లు సిబ్బందికి నీరుండడం లేదు. దీంతో కొంతమంది బాటిళ్లలో నీరు తెచ్చుకుంటున్నా, ఎండల కారణంగా అవీ చాలడం లేదు. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు తమ సొంత డబ్బుతో మినరల్ వాటర్ క్యాన్లు కొనుకొచ్చి కుండల్లో పోసుకుని వాటినే తాగుతున్నారు.
మేమే కొని తెచ్చుకుంటున్నాం
బుడమేరు వరదల సమయంలో మినరల్ వాటర్ ప్లాంట్ చెడిపోయింది. దానిని ఇంత వరకు బాగు చేయలేదు. ఇంత పెద్ద డిపోలో సిబ్బందికి, ఉద్యోగులకు మంచినీళ్లు సరఫరా చేయటంలో అధికారుల నిర్లక్ష్యం శోచనీయం. డిపోలో పనిచేసే వారికి కనీసం మునిసిపల్ వాటర్ వచ్చేందుకు పంపులను కూడా ఏర్పాటు చేయలేదు. కార్పొరేషన్ నీటికి కూడా దిక్కు లేకుండా పోయింది. తాగేందుకు మేమే మంచినీటిని కొని తెచ్చుకుంటున్నాం.
- స్టాఫ్, వర్కర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా జాయింట్ సెక్రటరీ పి.దుర్గారావు