అధికారులపై ఆగ్రహం
ABN , Publish Date - Aug 14 , 2025 | 01:43 AM
‘అధికారుల పనితీరు ఏమాత్రం బాలేదు. విజయవాడ నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీనికి సంబంధించి డీపీఆర్ తయారు చేయాలని సూచించినా ఇప్పటి వరకు ఆ పని చేయలేకపోయారు. గ్రామాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులకు మంజూరైన నిధులు ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంతో వెనక్కి వెళ్లిపోతున్నాయి. పీఎం సూర్యఘర్ పథకానికి విద్యుత శాఖ అధికారుల నిబంధనలే అడ్డుగా మారుతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో జీవో 30 మరుగున పడింది. రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. ల్యాండ్ సీలింగ్ రికార్డులు నేటికీ కృష్ణాజిల్లాలోనే ఉన్నాయి, వాటిని ఎన్టీఆర్ జిల్లాకు తీసుకురావడంలో విఫలమవుతున్నారు.’ ఎన్టీఆర్ జిల్లా సమీక్ష సమావేశంలో నగర, జిల్లా యంత్రాంగాలపై ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాడివేడిగా డీఆర్సీ సమావేశం
అధికారుల పనితీరుపై భగ్గుమన్న ప్రజాప్రతినిధులు
పనితీరు మార్చుకోవాలని ఘాటుగా హెచ్చరికలు
ప్రజాభివృద్ధి కోసం మెరుగైన పనితీరు కనబర్చండి
జిల్లా అధికారులకు ఇనచార్జి మంత్రి సత్యకుమార్ దిశానిర్దేశం
విజయవాడ సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ‘అధికారుల పనితీరు ఏమాత్రం బాలేదు. విజయవాడ నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీనికి సంబంధించి డీపీఆర్ తయారు చేయాలని సూచించినా ఇప్పటి వరకు ఆ పని చేయలేకపోయారు. గ్రామాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులకు మంజూరైన నిధులు ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంతో వెనక్కి వెళ్లిపోతున్నాయి. పీఎం సూర్యఘర్ పథకానికి విద్యుత శాఖ అధికారుల నిబంధనలే అడ్డుగా మారుతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో జీవో 30 మరుగున పడింది. రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. ల్యాండ్ సీలింగ్ రికార్డులు నేటికీ కృష్ణాజిల్లాలోనే ఉన్నాయి, వాటిని ఎన్టీఆర్ జిల్లాకు తీసుకురావడంలో విఫలమవుతున్నారు.’ ఎన్టీఆర్ జిల్లా సమీక్ష సమావేశంలో నగర, జిల్లా యంత్రాంగాలపై ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్ అధ్యక్షతన నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో బుధవారం జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికారుల పనితీరుపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తో పాటుసెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సమావేశంలో ఏకరువు పెట్టారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పనిచేయండి : ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్
ప్రజల సమస్యలను పరిష్కరించి, వారి జీవన ప్రమాణాలు పెంచేలా అధికారులు పని చేయాలని జిల్లా ఇనచార్జి మంత్రి సత్యకుమార్ అధికారులకు సూచించారు. గత డీఆర్సీ సమయంలో ఎమ్మెల్యేలు ప్రస్తావించిన 55 సమస్యల్లో ఇప్పటి వరకు 19 సమస్యలను మాత్రమే పరిష్కరించడం అధికారుల పనితీరును తేటతెల్లం చేస్తోందన్నారు. ఎమ్మెల్యేలు చెప్పిన సమస్యల పరిష్కారంపై ఉదాసీనంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. నగరంలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థకు 2015లోనే నిధులు మంజూరైనా ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేయకపోవడం వారి పనితీరును ప్రదర్శిస్తోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. 2024-25లో ఎన్టీఆర్ జిల్లా జీడీపీ రూ.94,561 కోట్లు ఉందని, 2025-26 నాటికి రూ.లక్షా12వేల057 కోట్లకు చేరాలని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. పీ4 అమలు విషయంలో జిల్లా వెనుకబడి ఉందన్నారు.