బరువును బట్టి డోస్
ABN , Publish Date - Jul 13 , 2025 | 01:10 AM
ఏ పదార్థాన్నైనా గ్రాములు, కిలోల్లో లెక్కిస్తాం. కానీ, కిక్ ఇచ్చే డ్రగ్‌ను మాత్రం డోస్‌ల లెక్కన విక్రయిస్తున్నాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. మనిషి బరువును బట్టి డ్రగ్‌ను ఇవ్వడంతో పాటు ఇంజనీరింగ్‌లో ఒత్తిడిని తట్టుకోడానికే మత్తు అలవాటు చేసుకున్నామని చెప్పడం గమనార్హం.
మెథాన్‌ఫెటమైన్ కేసులో కొత్త కోణం
కొనుగోలు చేసే వారి బరువును బట్టి డ్రగ్ డోస్
డోస్‌ల లెక్కనే అమ్మకాలు.. విద్యార్థులే టార్గెట్
బెంగళూరు నుంచి బెజవాడకు సరఫరా
అంబాపురంలో ముగ్గురు అరెస్టు
బెంగళూరు బాస్ లెక్క తేల్చే పనిలో పోలీసులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మెథాన్‌ఫెటమైన్ డ్రగ్ కేసులో కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం కేదారిలంక గ్రామానికి చెందిన గవర శ్రీరామ వెంకట మణికంఠ సూత్రధారి అని పోలీసులు తేల్చారు. అంబాపురం గ్రామంలోని ఓ తాటాకు పాకలో శుక్రవారం అర్ధరాత్రి డ్రగ్‌ను విక్రయిస్తుండగా, మణికంఠతో పాటు దేశబోయిన ఆకాశ్, శివకుమార్ కౌశిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అమరావతిలో ఉన్న విట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతుండగా మణికంఠ, ఆకాశ్‌కు పరిచయం ఏర్పడింది. వీరద్దరికీ కామన్ ఫ్రెండ్ కౌశిక్. అంబాపురానికి చెందిన కౌశిక్ ఇంటర్మీడియెట్ ఫెయిలై టీవీ రిపేర్ల షాపులో పనిచేస్తున్నాడు.
డోస్ లెక్కేంటి?
ఇప్పటి వరకు పోలీసులకు చిక్కిన కేసుల్లో నిందితులు డ్రగ్స్‌ను, గంజాయిని గ్రాముల్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. మెథాన్‌ఫెటమైన్ డ్రగ్ కేసులో డోస్‌ల లెక్క బయటపడింది. ఈ మెథాన్‌ఫెటమైన్‌ను ‘ఎం’ అని, ‘మెథ’ అని పిలుస్తుంటారు. ఈ ముగ్గురు నిందితుల నుంచి పోలీసులు ఐదు గ్రాముల డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని విచారణ చేస్తున్నప్పుడు మణికంఠ కొత్త లెక్క చెప్పాడు. తాను గ్రాముల లెక్కన డ్రగ్‌ను విక్రయించనని, డోస్‌ల లెక్కన విక్రయిస్తానన్నాడు. కొనుగోలు చేసే వ్యక్తి శరీర బరువును బట్టి డోస్ ఉంటుందని తెలిపాడు. కొనుగోలు చేసే వ్యక్తి బరువు 70 కిలోలు ఉంటే, ఒక డోస్ ఇస్తాడు. ఇందుకు రూ.9 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తాడు. డ్రగ్స్‌ను తీసుకునే వారి బరువును బట్టి దాని మత్తు పరిమాణం ఉంటుందని వివరించాడు. సాధారణంగా మాదకద్రవ్యాల అలవాటు ఉన్నవారు ముందుగా కొంత పరిమాణంలో డ్రగ్ తీసుకుంటారు. అది మత్తును ఇవ్వకపోతే మరికొంత తీసుకుంటారు. అది కూడా చాలకపోతే ఇంకొంత తీసుకుంటారు. తీసుకున్న వెంటనే కిక్ ఎక్కడానికి మణికంఠ డోస్‌ల లెక్కను ఎంచుకున్నాడు. బెంగళూరు నుంచి గ్రాము మెథను రూ.4 వేల కొంటాడు. ఇక్కడికి తీసుకొచ్చాక దానిని డోస్‌ల లెక్కన విక్రయిస్తాడు. ఒక డోస్ అంటే గ్రాములో పదో వంతు అని పోలీసులకు లెక్కలు చెప్పాడు.
బెంగళూరు బాస్ ఎవరు?
మణికంఠకు మెథాను సరఫరా చేస్తున్న బెంగళూరు బాస్ ఎవరన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ వ్యక్తితో మణికంఠ, ఆకాశ్ ఇన్‌స్టా ద్వారా చాటింగ్ చేసినట్టు గుర్తించారు. ఈ ఇద్దరు విట్ కళాశాలలో చదువుతున్నప్పటి నుంచే మెథాకు అలవాటు పడ్డారు. తమకు జర్మనీలో ఉంటున్న హేమంత అనే యువకుడి ద్వారా ఈ డ్రగ్ అలవాటైనట్టు పోలీసుల విచారణలో వెల్లడించారు. అతడు ఎవరో వివరాలను బయటకు లాగే పనిలో పోలీసులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొంతమంది ఇంజనీరింగ్ పట్టభద్రులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ ఎండీఎంఏ వంటి డ్రగ్‌ను తయారు చేసి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంది. ఇలా బెంగళూరు నుంచి ఎండీఎంఏను తీసుకొస్తూ ఇద్దరు, ముగ్గురు యువకులు విజయవాడ పోలీసులకు చిక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ డ్రగ్స్‌తో దొరికిన వారికి ప్రతి కేసులోనూ బెంగళూరుతో లింక్‌లు ఉంటున్నాయి. మణికంఠ బెంగళూరులో ఉన్న వ్యక్తితో ముందుగా ఇన్‌స్టాలో చాటింగ్ చేసి ఎంత మొత్తంలో డ్రగ్ కావాలో చెబుతాడు. దానికి సంబంధించిన డబ్బును ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లిస్తాడు. తర్వాత ఆ వ్యక్తి డ్రగ్‌ను ఒకచోట ఇచ్చి ఆ ప్రదేశం పేరు చెబుతాడు. అక్కడి నుంచి డ్రగ్‌ను తీసుకుని మణికంఠ విజయవాడ చేరుకుంటాడు. ఈవిధంగా మణికంఠ ఏడాది నుంచి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డ్రగ్‌ను ఎందుకు అలవాటు చేసుకున్నారని పోలీసులు అడిగినప్పుడు మణికంఠ, ఆకాశ్ విచిత్రమైన సమాధానం చెప్పారు. ఇంజనీరింగ్‌లో ఉన్న ఒత్తిడిని తట్టుకోవడానికి, రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని చదవడానికి అలవాటు చేసుకున్నామని చెప్పినట్టు తెలిసింది.