కదలరు.. వదలరు..!
ABN , Publish Date - May 25 , 2025 | 01:39 AM
రెగ్యులర్ తహసీల్దార్ల స్థానాల్లో పాతుకుపోయిన ఉమ్మడి కృష్ణాజిల్లాలోని రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు (డీటీ) బదిలీల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకో సం ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షి ణలు చేస్తున్నారు. రూల్ పొజిషన్ చెబుతూ మాట వినని కొంతమంది తహసీల్దార్లను వైసీపీ ప్రభుత్వ హయాంలో లూప్‌లైన్ పోస్టుల్లోకి పంపారు. వారి స్థానంలో నాటి ఎమ్మెల్యేలు చెప్పిన రీసర్వే డీటీలకు పోస్టిం గ్ ఇచ్చారు. ప్రస్తుత బదిలీల నుంచి తప్పించుకునేందుకు వీరంతా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు.
రెవెన్యూ బదిలీల్లో రీసర్వే డీటీల పైరవీలు
వైసీపీ హయాంలో లూప్‌లైన్‌లోకి 12 మంది తహసీల్దార్లు
వారి స్థానంలో తమ మాటవినే డీటీలకు పోస్టింగ్
జగనన్న ఇళ్ల స్థలాల కొనుగోలులో విచ్చలవిడి వ్యవహారాలు
ఇప్పటికీ అవే పోస్టుల్లో కొనసాగుతున్న డీటీలు
కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగే ప్రయత్నాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 12 మంది రెగ్యులర్ తహసీ ల్దార్లు లూప్‌లైన్ పోస్టుల్లో ఉన్నారు. వీరికి రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉంది. రూల్ పొజిషన్ గురించి కూడా తెలుసు. ఇలాంటి వారిని కిందటి వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఆ స్థానంలో రీసర్వే డిప్యూటీ తహసీ ల్దార్ల (డీటీ)లకు పోస్టింగ్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ విషయాలు ఎమ్మెల్యేల కు తెలియకపోవడంతో లూప్‌లైన్‌లో ఉన్నవారు అక్కడే ఉండిపో యారు. తాజాగా జరుగుతున్న బదిలీల నేపథ్యంలో తమ విష యం తెలుస్తుందన్న ఉద్దేశంతో డీటీలు కొందరు ఎమ్మెల్యేల సిఫా ర్సుల కోసం ఎగబడుతున్నారు. ఈ పరిణామాలు ఎమ్మెల్యేలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
వైసీపీ హయాంలో జరిగిన కథ ఇదీ..
వైసీపీ హయాంలో జగనన్న ఇళ్ల పట్టాల పేరుతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో వేలాది ఎకరాలు కొన్నారు. గరిష్టంగా ఎకరం రూ.కోటి వరకు ర్చు పెట్టారు. స్థానిక మార్కెట్ రేటు కంటే కూడా ఎక్కువ రేట్లకు పరిహారం చెల్లించారు. ఈ పరిహారం చెల్లింపు వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం నిగూఢంగా వ్యవహారాలను నడిపింది. ఇలా భూములను అధిక ధరలు పెట్టి తీసుకున్నందుకు ఎమ్మెల్యేలకు ఆర్థిక వనరులను సృష్టించింది. ఇళ్ల స్థలాలకు ఎలాంటి భూములు తీసుకోవాలో కూడా ఆలోచించకుండా ఎక్కడపడితే అక్కడ తీసుకుంది. లోతట్టు ప్రాంతాల్లోని భూములు, కొండలు, గుట్టలు, చెరువులు, డొంకలు ఉన్నచోట భూములు తీసుకున్నారు. ఇలా ఇష్టానుసారంగా భూములు తీసుకోవటానికి నాటి వైసీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు తహసీల్దార్లను ఎడాపెడా బదిలీ చేశారు. భూముల కొనుగోలు విషయంలో రూల్ పొజిషన్ చె బుతున్నారన్న కారణంతో లూప్‌లైన్లకు పంపించారు. వారి స్థానంలో డీటీలను కూర్చోబెట్టారు. వీరికి చట్టాలపై పూర్తి అవగాహన లేకపోవటం, రూల్ పొజిషన్స్ గురించి సరిగ్గా తెలియకపోవటం వల్ల భూముల కొనుగోళ్ల వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహారాలు నడిచాయి. ఇళ్ల పట్టాల పంపిణీ, నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపు, ప్రభుత్వ భూములకు ఆక్రమణల పేరుతో పొసెషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం.. వంటి మోసాలకు నాటి ప్రజాప్రతినిధులు పాల్పడ్డారు. ఇలా.. అవినీతి రుచిమరిగిన రీసర్వే డీటీలు తాజా బదిలీల నేపథ్యంలో తమ స్థానాలను కోల్పోతామేమోనన్న భయంతో ఉన్నారు. బదిలీ నిలుపుదల చేయించుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వానికి వివరించే ప్రయత్నాలు
రెవెన్యూ శాంక్షన్డ్ పోస్టుల్లో.. ఒక మండలానికి ఒక రెగ్యులర్ తహసీల్దార్, ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉంటారు. కాలక్రమంలో అవసరాల పేరుతో రీసర్వే డీటీలు, పీడీఎస్ డీటీలు, ఎలక్షన్ డీటీలు, కేఆర్‌ఆర్‌సీ డీటీలు వచ్చారు. వివిధ విభాగాల్లోని డీటీలంతా రెగ్యులర్ తహసీల్దార్ల పోస్టుల కోసం పాకులాడే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెగ్యులర్ తహసీల్దార్లను పక్కనపెట్టి రీసర్వే డీటీలకు పెద్దపీట వేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏడుగురు తహసీల్దార్లు, కృష్ణాజిల్లాలో ఐదుగురు తహసీల్దార్లు.. మొత్తం 12 మంది తహసీల్దార్లను లూప్‌లైన్ పోస్టుల్లో పెట్టారు. ఇంకా పెద్ద సంఖ్యలో తహసీల్దార్లను కీలక స్థానాల్లో పనిచేయనీయకుండా తప్పించారు. అవసరాల రీత్యా నెలల వ్యవధిలోనే బదిలీ చేశారు. కాగా, తమకు జరుగుతున్న అన్యాయాన్ని రెవెన్యూ సంఘాల ద్వారా జిల్లా ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి రెగ్యులర్ తహసీల్దార్లు రంగం సిద్ధం చేస్తున్నారు.