Share News

బుడమేరుపై భయమొద్దు

ABN , Publish Date - Jul 26 , 2025 | 01:11 AM

తెలంగాణాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బుడమేరుకు వరద వస్తుందేమోనని విజయవాడ వాసులు భయాందోళన చెందుతున్నారు. సోషల్‌ మీడియాలో భయపెట్టేలా పోస్టులు పెడుతుండటంతో ముఖ్యంగా సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలో ప్రజలు భయాందోళనకు గురవుతుండగా పోలీసులు మైక్‌ ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణాలో భారీ వర్షాలకు, బుడమేరు వరదకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ భారీ వర్షాలు కురిస్తే ఆ వరద నీరంతా వైరా, మునేరుల ద్వారా కృష్ణానదిలోకి వెళ్తుందే తప్ప.. బుడమేరులోకి రాదన్న విషయం విజయవాడ వాసులు గుర్తుంచుకోవాలి.

బుడమేరుపై భయమొద్దు

తెలంగాణ వర్షాలతో బుడమేరుకు సంబంధం లేదు

బుడమేరు పుట్టింది, ప్రవహించేది ఎన్టీఆర్‌ జిల్లాలోనే..

అనేక వాగులు, వంకల సమాహారమే ఈ కాల్వ

గంపలగూడెం, ఏ.కొండూరు, మైలవరం, జి.కొండూరు

ఈ నాలుగు మండలాల వర్షపాతంపైనే బుడమేరు వరద

20 సెంటీమీటర్ల పైబడి వర్షం కురిస్తేనే వరద వచ్చే చాన్స్‌

(ఆంధ్ర జ్యోతి, విజయవాడ) : తెలంగాణా ప్రాంతానికి, బుడమేరు పుట్టుక ప్రాంతానికి మధ్యలో ఎత్తయిన కొండలున్నాయి. కాబట్టి తెలంగాణకు, బుడమేరు వరదకు ఎలాంటి సంబంధం లేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో కురిసే భారీ వర్షాలకే బుడమేరు పొంగుతుంది. జిల్లాలోని గంపలగూడెం, ఏ.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు.. ఈ నాలుగు మండలాల పరిధిలో అత్యంత భారీ వర్షాలు కురిస్తేనే బుడమేరు ఉప్పొంగుతుంది. ఈ మండలాల పరిధిలో కిందటి సెప్టెంబరులో ఒక్క రోజులో 30 సెంటీమీటర్ల మేర వర్షం కురవటం వల్ల బుడమేరు ఉగ్రరూపం దాల్చింది.

బుడమేరు పుట్టింది ఎన్టీఆర్‌ జిల్లాలోనే..

బుడమేరు పుట్టుక మన జిల్లాలోనే జరిగింది. ఏ.కొండూరు మండలం జమ్మలవాయిదుర్గం కొండపై బుడమేరు పుట్టింది. ఈ కొండపై పడిన వర్షపు నీరు, గంపలగూడెం మండలంలో కురిసిన వర్షపు నీటితో బుడమేరు ప్రారంభమవుతుంది. ఇలా కొంతదూరం ప్రయాణించాక పలు ప్రాంతాల్లో అనేక వాగులు, వంకలు కలుస్తాయి. ఇవన్నీ పొంగిపొర్లినపుడు బుడమేరు మహోగ్రరూపం దాల్చుతుంది. జమ్మలవాయిదుర్గం నుంచి ప్రవహించాక బుడమేరు చీమలపాడు దగ్గర పాలవాగులో కలుస్తుంది. అక్కడి నుంచి ఒక పాయ విడిపోయి మైలవరం మండలం మెర్సుమల్లి కొండవాగు, అనంతవరం కొండవాగు, మైలవరం కొండవాగు వద్ద జి.కొండూరు చేరుతుంది. మరో పాయ కూడా కూనపరాజుపర్వ నుంచి కొండవాగు, రెడ్డిగూడెం నుంచి వచ్చే కోతుల వాగులో కలిసి జి.కొండూరు చేరుతుంది. ఇక్కడే రెండు పాయలు కలిసి బుడమేరుగా రూపాంతరం చెందుతాయి. ఇక్కడి నుంచి బుడమేరు వెల్లటూరు, కందులపాడు, హెచ్‌.ముత్యాలంపాడు మీదుగా ముందుకు వెళ్తుంది. వెల్లటేరు వద్ద కొండవాగు ఒకటి కుంటముక్కల చెరువులో కలుస్తుంది. ఆ చెరువు నిండినప్పుడు నీరంతా బుడమేరులో చేరుతుంది. వెలగలేరు హెడ్‌ రెగ్యులేటరీ దగ్గరకు వచ్చేసరికి కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ నుంచి పులివాగు వచ్చి బుడమేరులో మిళితమవుతుంది. ఇక్కడి నుంచి బుడమేరు డైవర్షన్‌ చానల్‌ ద్వారా ఎన్టీటీపీఎస్‌ మీదుగా వరదను కృష్ణానదిలో కలుపుతారు. వెలగలేరు హెడ్‌ రెగ్యులేటరీ సామర్థ్యానికి మించి వరద వస్తే రెగ్యులేటరీ గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతారు. ఇలా వెళ్లే ప్రవాహంలో కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ నుంచి వచ్చే కప్పలవాగు (పినపాక), తొమ్మండ్రువాగు (కట్టుబడిపాలెం) కూడా కలుస్తాయి. విజయవాడ దిగువన ఉండే కుంపిణీ వాగు బ్రహ్మయ్యలింగం చెరువులోకి వస్తుంది. బ్రహ్మయ్యలింగం చెరువు పొంగితే చీమలవాగు ద్వారా పోలవరం కాల్వ దిగువన ఉన్న యూటీ నుంచి పురుషోత్తపట్నం చెరువులోకి వెళ్తుంది. ఆ చెరువు పొంగితే ముస్తాబాద మీదుగా బుడమేరులో కలుస్తుంది. ఈ చెరువు నుంచి వచ్చే మరో పాయ పురుషోత్తపట్నం రైల్వేగేటు సమీపం నుంచి జక్కలనెక్కలం మీదుగా బుడమేరులో కలుస్తుంది. ఇక అక్కడి నుంచి బుడమేరు విజయవాడ, ఎనికేపాడు యూటీ మీదుగా కొల్లేరు చేరుతుంది.

అపోహలొద్దు

బుడమేరు ప్రవాహం అనేది అనేక వాగులు, వంకలు, చెరువుల సమాహారం. కొండవాగులు, రిజర్వు ఫారెస్ట్‌ నుంచి వచ్చే వాగులు, ఇతర వాగులన్నీ కలిస్తే బుడమేరు మహోగ్రరూపం దాల్చుతుంది. కాబట్టి ఆయా మండలాల్లో గరిష్టంగా 20 సెంటీమీటర్ల పైబడి వర్షం కురిస్తే తప్ప వరద వచ్చే పరిస్థితి ఉండదు. తెలంగాణా ప్రాంతంలోని భారీ వర్షాలు, వాగుల ఉధృతిని చూసి బెజవాడ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. సోషల్‌ మీడియాలో జరిగే ప్రచారాలను నమ్మకుండా మన జిల్లాలో కురిసే వర్షపాతం ప్రాతిపదికన బుడమేరు వరదను అంచనా వేయొచ్చు.

Updated Date - Jul 26 , 2025 | 01:11 AM