Share News

డాన్‌బాస్కో స్కూల్‌ ప్రిన్సిపాల్‌పై ఉపాధ్యాయిని యాసిడ్‌ దాడి

ABN , Publish Date - May 20 , 2025 | 01:19 AM

ఉద్యోగం నుంచి తొలగించారనే అక్కసుతో ప్రిన్సిపాల్‌పై ఓ ఉపాధ్యాయిని పథకం ప్రకారం యాసిడ్‌ దాడి చేసింది.

డాన్‌బాస్కో స్కూల్‌ ప్రిన్సిపాల్‌పై ఉపాధ్యాయిని యాసిడ్‌ దాడి

స్వల్ప గాయాలు..ఆస్పత్రికి తరలింపు

ఇబ్రహీంపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగం నుంచి తొలగించారనే అక్కసుతో ప్రిన్సిపాల్‌పై ఓ ఉపాధ్యాయిని పథకం ప్రకారం యాసిడ్‌ దాడి చేసింది. ఈ ఘటన గుంటుపల్లి డాన్‌బాస్కో స్కూల్లో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రియదర్శిని అనే ఉపాధ్యాయిని గుంటుపల్లి డాన్‌బాస్కో స్కూల్లో ఒకటో తరగతి విద్యార్థులకు భోదన చేస్తుంటుంది. భోదన సమయంలో విద్యార్థులను అకారణంగా దారుణంగా దండిస్తుందని తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు గత నెలలో ఆమెను ప్రిన్సిపాల్‌ విజయ ప్రకాష్‌ విధుల నుంచి తప్పించాడు. దీంతో కోపం పెంచుకున్న ఆమె సోమవారం పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్‌తో గొడవ పడింది. తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ప్రిన్సిపాల్‌ ముఖంపై పోసింది. దీంతో ఆయన స్వల్పంగా గాయపడ్డాడు. ప్రిన్సిపాల్‌ను చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు మేరకు ప్రియదర్శినిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యాసిడ్‌లో పవర్‌ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.

Updated Date - May 20 , 2025 | 01:19 AM