అవినీతి ఆటంబాంబ్
ABN , Publish Date - Oct 24 , 2025 | 01:07 AM
ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపితే, వాణిజ్యపన్నుల శాఖలోని మూడో డివిజన్‌ను మాత్రం నోట్ల కట్టలతో ముంచేసింది. పన్నులు చెల్లించకుండా ఇతర రాషా్ట్రల నుంచి దీపావళి సరుకును రప్పించుకున్న హోల్‌సేల్ డీలర్లకు ఆయాచితంగా మేలు చేకూర్చినందుకు ఈ డివిజన్‌కు చెందిన అధికారులకు భారీగా ముడుపులు అందాయి. ఈ విషయం ప్రస్తుతం వాణిజ్యపన్నుల శాఖలో దుమారాన్ని రేపుతోంది.
వాణిజ్యపన్నుల శాఖ మూడో డివిజన్‌లో దీపావళి డీల్
గుడివాడలో ఇద్దరు డీలర్ల నుంచి రూ.25 లక్షల వసూలు
రూ.30 కోట్ల విలువచేసే సరుకును రూ.కోటిగా చూపించినందుకే..
చక్రంతిప్పిన నలుగురు.. వారిలో ఇద్దరు అధికారులు, ఇద్దరు ఉద్యోగులు
డీలర్లు, అధికారులకు మధ్య సంధానకర్తగా వ్యవహరించిన ఎస్టీపీ
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : గవర్నరుపేట సర్కిల్‌లోని సబార్డినేట్ కొండపల్లి శ్రీనివాసరావు ట్రాన్స్‌పోర్టు వ్యాపారి నుంచి డబ్బు వసూలు చేసి ఏసీబీకి చిక్కి కొద్దిరోజులు కూడా గడవకుండానే అధికారులు, సిబ్బంది ఎలాంటి జంకుబెంకు లేకుండా వసూళ్లకు ద్వారాలను తెరిచారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలు చేయడం ప్రారంభించాక వాణిజ్య పన్నుల శాఖలో అధికారులు, సిబ్బంది ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. ఈ విషయాన్ని వ్యాపారులు, హోల్‌సేల్ డీలర్లే బహిరంగంగా చెబుతున్నారు. వాణిజ్యపన్నుల శాఖ మూడో డివిజన్‌లో ఇద్దరు అధికారులు, ఇద్దరు సిబ్బంది కలిసి దీపావళి టపాసులు విక్రయించే హోల్‌సేల్ డీలర్ల నుంచి ఏకంగా రూ.25 లక్షలు వసూలు చేశారు. ఈ విషయం ఆ శాఖలో చర్చకు దారితీసింది.
రూ.కోట్ల సరుకును దాచేసి..
వాణిజ్యపన్నుల శాఖ మూడో డివిజన్‌లో మొత్తం ఐదు సర్కిళ్లు ఉన్నాయి. ఈ కార్యాలయం అయోధ్యనగర్‌లోని లోటస్‌లో ఉంది. గుడివాడ, మచిలీపట్నం, పెనమలూరు, రామవరప్పాడు, పటమట సర్కిళ్లు ఈ మూడో డివిజన్‌లో పరిధిలో ఉంటాయి. ఇందులో గుడివాడ సర్కిల్ ఈ డివిజన్‌కు గుండెకాయ వంటిది. హోల్‌సేల్ వ్యాపారులు, డీలర్లు ఎక్కువగా ఉండేది ఈ సర్కిల్‌లోనే. తర్వాత పెనమలూరు సర్కిల్‌లోని గన్నవరంలో ఈ డీలర్లు ఉంటారు. మచిలీపట్నం సర్కిల్‌లో మినీ హోల్‌సేల్ డీలర్లు ఉంటారు. దీపావళికి శివకాశి, తమిళనాడు నుంచి దీపావళి సరుకును ఈ డీలర్లు రప్పిస్తుంటారు. ఇది ఏటా జరిగే ప్రక్రియ. ఈ ఏడాది గుడివాడలో ఇద్దరు ప్రముఖ డీలర్లు రూ.కోట్ల సరుకును దిగుమతి చేసుకున్నారు. దీనికి ఎలాంటి వేబిల్లులు, ప్రభుత్వానికి పన్నులు చెల్లించలేదు. ఈ ఇద్దరు డీలర్లు రూ.కోటి సరుకే తమ వద్ద ఉన్నట్టు చూపించారు. వాస్తవానికి వారి వద్ద రూ.10 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు విలువచేసే సరుకు ఉంది. దీన్ని వారు ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాలోని వ్యాపారులకు సరఫరా చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా అంత మొత్తంలో సరుకును దిగుమతి చేసుకున్న ఈ డీలర్లతో పాటు మినీ హోల్‌సేల్ డీలర్ల గోదాములు, షాపుల్లో తనిఖీలు చేయకుండా భారీ మొత్తంలో ముడుపులు అందుకున్నారు.
ఆ నలుగురు కనుసన్నల్లో..
గుడివాడలోని ఇద్దరు ప్రముఖ హోల్‌సేల్ డీలర్లతో పాటు మినీ హోల్‌సేల్ వ్యాపారుల నుంచి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేశారు. డివిజన్‌లో పనిచేసే ఇద్దరు అధికారులు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల కనుసన్నల్లో ఈ దీపావళి డీల్ నడిచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాణిజ్యపన్నుల శాఖలోని ఉద్యోగవర్గాలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. వ్యాపారులకు, అధికారులకు మధ్య ఒక ఎస్టీపీ (సేల్స్‌ట్యాక్స్ ప్రాక్టీషనర్) అనుసంధానకర్తగా వ్యవహరించాడు. జీఎస్టీ తగ్గింపునకు సంబంధించిన అవగాహన కార్యక్రమంలో అధికారులు మచిలీపట్నంలో సూపర్ జీఎస్టీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటుచేసే హడావిడిలో ఉన్నారు. దీన్ని అదునుగా తీసుకున్న ఈ నలుగురు కలిసి ఎస్టీపీ ద్వారా వసూళ్ల కథను నడిపించారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశిస్తారా, ఇదంతా మామూలే అన్నట్టుగా వదిలేస్తారా చూడాలి.