Share News

జిల్లా జైలు సూపరింటెండెంట్‌పై వేటు

ABN , Publish Date - May 17 , 2025 | 01:35 AM

విజయవాడ జిల్లాజైలు సూపరింటెండెంట్‌ హంసపాల్‌పై వేటు పడింది. ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో పోస్టింగ్‌ ఇస్తూ, నెల్లూరులోని శిక్షణా కేంద్రానికి అటాచ్‌ చేశారు. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లాలో సబ్‌జైళ్ల అధికారిగా ఉన్న మహ్మద్‌ ఇర్ఫాన్‌కు పదోన్నతి కల్పించి నియమించారు.

జిల్లా జైలు సూపరింటెండెంట్‌పై వేటు

హంసపాల్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు

వైసీపీ వీరవిధేయుడిగా పేరు

జైల్లోని సమాచారం తాడేపల్లి ప్యాలెస్‌కు..

ఆరోపణలు పెచ్చుమీరడంతో ప్రభుత్వ చర్యలు

ఆ స్థానంలో మహ్మద్‌ ఇర్ఫాన్‌ నియామకం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ జిల్లాజైలు సూపరింటెండెంట్‌ హంసపాల్‌పై వేటు పడింది. ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో పోస్టింగ్‌ ఇస్తూ, నెల్లూరులోని శిక్షణా కేంద్రానికి అటాచ్‌ చేశారు. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లాలో సబ్‌జైళ్ల అధికారిగా ఉన్న మహ్మద్‌ ఇర్ఫాన్‌కు పదోన్నతి కల్పించి నియమించారు.

వైసీపీకి వీర విధేయుడు

వైసీపీ అధినేత జగన్‌కు హంసపాల్‌ వీరభక్తుడిగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన్ను పనిగట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రస్తుతం విజయవాడ జిల్లాజైలు వైసీపీ వీరవిధేయులతో నిండిపోయింది. ఇక్కడ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, ఐపీఎస్‌ అధికారి పి.సీతారామాంజనేయులు, మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పీఏ దిలీప్‌, భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీ రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. వివిధ కేసుల్లో వైసీపీ విధేయులు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్లడం మొదలైన తర్వాత హంసపాల్‌పై ఆరోపణలు పెరిగాయి. ఇక్కడి నుంచి ప్రతి చిన్న సమాచారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి చేరుతున్నట్టు ప్రభుత్వం పసిగట్టింది. తానెంతో నిజాయితీపరుడినని చెప్పుకొనే హంసపాల్‌ జైల్లో ప్రతి పనినీ అత్యంత రహస్యంగా కానిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి.

అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా..

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు హంసపాల్‌ విజయవాడ జిల్లా జైలుకు సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పాల్‌ కుర్చీ కదులుతుందని అంతా భావించారు. ఇది జరగకపోగా, ఆయన పదిలమైపోయారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు కొంతమంది టీడీపీ నాయకులను కేసుల్లో ఇరికించి జిల్లాజైలులో పెట్టారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కింజరపు అచ్చెన్నాయుడును ఈఎస్‌ఐ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టు చేసి ఈ జైల్లో పెట్టారు. ఆ తర్వాత మరికొంతమంది నేతలను ఈ జైలుకు పంపారు. జైల్లో వారి పరిస్థితిని ఎప్పుటికప్పుడు తాడేపల్లి కార్యాలయానికి హంసపాలే తెలియజేసేవారు. నాడు వారు జైల్లో కొన్ని సదుపాయాలు కల్పించమని కోరినా నిరభ్యంతరంగా తోసిపుచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. సూపరింటెండెంట్‌గా హంసపాల్‌ ఉన్నా నిందితులకు రాజభోగాలు సాగుతున్నాయి. ఇక్కడున్న వైసీపీ విధేయ నిందితులకు చేరాల్సిన సమాచారం.. అన్ని మార్గాల్లోనూ అందుతోంది. రాష్ట్రంలోని ప్రతి కేంద్ర కారాగారం, జిల్లా కారాగారంలో సూపరింటెండెంట్‌ చాంబర్‌ వరకు మీడియాకు అనుమతి ఉంటుంది. ఈ విషయంలో మాత్రం హంసపాల్‌ పూర్తిగా భిన్నం. మీడియా ప్రతినిధులే కాదు, స్పెషల్‌ బ్రాంచ్‌, ఇంటెలిజెన్స్‌ విభాగాల అధికారులు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయరు. ఆయనను కలవడానికి సెంట్రీ సిబ్బంది నుంచి సమాచారం పంపినా స్పందించరు. కొద్దిరోజులుగా హంసపాల్‌ ప్రవర్తనపై అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. దీంతో ఆయనపై వేటు పడింది.

Updated Date - May 17 , 2025 | 01:35 AM