Share News

స్మార్ట్‌గా రేషన్‌

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:41 AM

రేషన్‌ కార్డుదారులకు ఇక స్మార్ట్‌గా రేషన్‌ పంపిణీ జరగనుంది. త్వరలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు రాబోతున్న తరుణంలో బుధవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో రేషన్‌ డీలర్లకు స్మార్ట్‌ ఈ-పోస్‌ యంత్రాలు అందజేశారు.

స్మార్ట్‌గా రేషన్‌

రేషన్‌ డీలర్లకు స్మార్ట్‌ ఈ-పోస్‌ మిషన్ల పంపిణీ

అత్యాధునిక ఫీచర్లతో వేగంగా రేషన్‌ సరఫరా

నెట్‌వర్క్‌ సమస్యకు, రద్దీకి చెక్‌ పెట్టేందుకే..

త్వరలోనే స్మార్ట్‌ రేషన్‌ కార్డులు కూడా..

సంతోషం వ్యక్తం చేస్తున్న రేషన్‌ డీలర్లు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రేషన్‌ కార్డుదారులకు ఇక స్మార్ట్‌గా రేషన్‌ పంపిణీ జరగనుంది. త్వరలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు రాబోతున్న తరుణంలో బుధవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో రేషన్‌ డీలర్లకు స్మార్ట్‌ ఈ-పోస్‌ యంత్రాలు అందజేశారు. గతంలో కీప్యాడ్‌ ఈ-పోస్‌ల స్థానంలో సరికొత్త టచ్‌స్ర్కీన్‌ ఈ-పోస్‌లను ప్రభుత్వం పంపిణీ చేసింది. పాత ఈ-పోస్‌ల కంటే మంచి ఫీచర్లతో పాటు వేగంగా పనిచేయడం వీటి ప్రత్యేకత. త్వరలో ప్రభుత్వం అందజేయనున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డులను ఈ స్మార్ట్‌ ఈ-పోస్‌ యంత్రాల్లో స్వైపింగ్‌ చేయాలి. పాతకాలపు కీ ప్యాడ్‌ ఈ-పోస్‌ యంత్రాలు సరిగ్గా పనిచేయకపోవడం, నెట్‌వర్క్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న రేషన్‌ డీలర్లకు ఈ కొత్త యంత్రాలు ఊరట కలిగిస్తున్నాయి. దీనివల్ల నెట్‌వర్క్‌ సమస్య కూడా ఉండదు. ఇందులోని ఇన్‌బిల్డ్‌ సిమ్‌ ద్వారా నెట్‌ రాకపోయినా డీలర్‌ దగ్గర ఉన్న ఇంట్లోని వైఫైకు అనుసంధానం చేయొచ్చు. బ్లూటూత ద్వారా కూడా అనుసంధానం కావచ్చు. లేదంటే డీలర్‌ మొబైల్‌ ఇంటర్నెట్‌ను హాట్‌స్పాట్‌ ఆప్షన్‌ ద్వారా కూడా స్మార్ట్‌ ఈ-పోస్‌ను పనిచేయించవచ్చు. ఈ మిషన్‌కు స్మార్ట్‌ టచ్‌ స్ర్కీన్‌ ఉంటుంది. ఆరండాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తుంది. టచ్‌ చేస్తే చాలు క్షణాల్లో లావాదేవీలు పూర్తవుతాయి. త్వరలో ఇచ్చే స్మార్ట్‌ రేషన్‌ కార్డులను స్వైప్‌ చేయటానికి వీలుగా ఇందులో వ్యవస్థ ఉంది. స్మార్ట్‌ రేషన్‌ కార్డును ఈ మిషన్‌పై పెట్టినా వైఫై ద్వారా ఆటోమేటిక్‌గా కనెక్ట్‌ అవుతుంది. బయోమెట్రిక్‌ ఇవ్వటానికి వీలుగా ఆప్షన్‌ ఇచ్చారు. దిగువన ఇన్‌బిల్డ్‌ కెమెరా ఉంది. వేలిముద్ర పడకపోతే ఈ కెమెరా ద్వారా ఐరిస్‌ తీసుకుంటారు. జీపీఆర్‌ఎస్‌ వ్యవస్థ ద్వారా డే టా రికార్డ్‌ చేస్తుంటుంది. ఈ స్మార్ట్‌ మెషీన్లను ఉపయోగించటం ద్వారా డిపోల వద్ద రద్దీకి ఆస్కారం ఉండదు.

2015లోనే..

2015లోనే ఈ-పోస్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోనే పైలెట్‌ ప్రాజెక్టుగా నాటి కృష్ణాజిల్లా కలెక్టర్‌ అహ్మద్‌బాబు ఈ విధానాన్ని పరిచయం చేశారు. ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. అదే ఏడాది నవంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. అప్పట్లో ఈ విధానం ఓ విప్లవాత్మకం. ఆ తర్వాత వీటిని ఉపయోగించింది లేదు. రేషన్‌ డీలర్ల విజ్ఞప్తి మేరకు కూటమి ప్రభుత్వంలో దీనిని మళ్లీ మన ముందుకు తీసుకొచ్చారు.

Updated Date - Aug 21 , 2025 | 12:41 AM