పునర్విభజన.. పునరుద్ధరణ
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:55 AM
్చగన్నవరం, నూజివీడు నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో కలుస్తున్నాయా? పెనమలూరు నియోజకవర్గం కృష్ణాజిల్లాకే పరిమితమవుతుందా? కైకలూరును తిరిగి కృష్ణాజిల్లాలోకి తీసుకురానున్నారా?.. అంటే దాదాపు అవుననే సమాధానమే వస్తుంది. జిల్లాల పునర్విభజనకు సంబంధించి మంత్రుల బృందం బుధవారం అమరావతిలో నిర్వహించిన కీలక సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది.
మంత్రుల సమావేశంలో కీలక అంశాలపై చర్చ
ఎన్టీఆర్ జిల్లాలోకి గన్నవరం, నూజివీడు వచ్చే చాన్స్
నూజివీడు రెవెన్యూ డివిజన్ పునరుద్ధరించే అవకాశం
తిరువూరు రెవెన్యూ డివిజన్ రద్దు చేయవచ్చు
కైకలూరు నియోజకవర్గం తిరిగి కృష్ణాలో కలుపుతారా?
పెనమలూరు నియోజకవర్గం కృష్ణాలోనే కొనసాగించే ఆస్కారం
గ్రేటర్ విజయవాడలో ఉన్న పెనమలూరు పరిస్థితి ఏమిటి?
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు సమయంలో.. గన్నవరం, పెనమలూరుతో పాటు ఏలూరు జిల్లాలో కలిపిన నూజివీడును ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ బాగా వినిపించింది. కాగా, అమరావతిలోని సెక్రటేరియట్‌లో బుధవారం నిర్వహించిన మంత్రుల సమావేశంలో గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల విలీన అంశాలు చర్చకు వచ్చాయి. దీనికి సంబంధించి క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తాజా చర్చల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా భౌగోళిక స్వరూపం మార్పు చెందే అవకాశం ఉంది. గన్నవరం, పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాలు మూడూ ఎన్టీఆర్ జిల్లాకు దగ్గరగా ఉంటాయి. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని ప్రధాన మండలాల్లో ఉన్న గ్రామాలు విజయవాడ గ్రేటర్ విలీన ప్రతిపాదిత జాబితాలోనివి. దీంతో గన్నవరం, పెనమలూరును ఖాయంగా విలీనం చేస్తారని ప్రజలు భావించారు.
విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి గన్నవరం, మైలవరం?
గన్నవరం, మైలవరం నియోజకవర్గాలను పూర్తిగా విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, జి. కొండూరు, మైలవరం మండలాలు ప్రస్తుతం విజయవాడ రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. రెడ్డిగూడెం మండలం మాత్రమే తిరువూరు రెవెన్యూ డివిజన్‌లో ఉంది. రెడ్డిగూడెం మండలాన్ని కూడా విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. గన్నవరంలోని బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ రూరల్ (9 గ్రామాలు) కూడా విజయవాడ డివిజన్‌లో విలీనం చేసే పరిస్థితి కనిపిస్తోంది.
నూజివీడు రెవెన్యూ డివిజన్ పునరుద్ధరణకు అవకాశం
గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో విజయవాడ రూరల్ (9 గ్రామాలు) విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండగా, బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాలు గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు మండలాలు ఉన్నాయి. ఈ మూడు మండలాలు ఉయ్యూరు డివిజన్ పరిధిలో ఉన్నాయి. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల ప్రకారం ఈ రెండు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చే క్రమంలో గన్నవరం రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయవచ్చనే చర్చ నడిచింది. తాజాగా మంత్రుల బృందం గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలనే ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న దిశగా చర్చ సాగించటంతో గన్నవరం రెవెన్యూ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటుచేసే అవకాశమే ఉండకపోవచ్చు. ఒకప్పుడు నూజివీడు రెవెన్యూ డివిజన్‌గా ఉంది. పరిపాలనా భవనం కూడా అక్కడ ఉంది. కాబట్టి ప్రస్తుత తిరువూరు రెవెన్యూ డివిజన్‌ను రద్దుచేసి, నూజివీడు రెవెన్యూ డివిజన్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు, నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి మండలాలు, తిరువూరు నియోజకవర్గ పరిధిలోని ఏ.కొండూరు, గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట మండలాలను నూజివీడు డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
కైకలూరు.. కృష్ణాజిల్లాలో కలిపే అవకాశం
కైకలూరు నియోజకవర్గాన్ని తిరిగి కృష్ణాజిల్లాలోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మంత్రుల సమావేశంలో చర్చ జరిగింది. ఈ నియోజకవర్గంలోని కలిదిండి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి మండలాలను పూర్తిగా గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
పామర్రులో రెండు డివిజన్ల సమస్య తీరనుందా?
పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు, పమిడిముక్కల, పామర్రు, మొవ్వ మండలాలు ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. ఒక్క పెదపారుపూడి మండలం మాత్రమే గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. తాజా మార్పుల నేపథ్యంలో పెదపారుపూడి మండలాన్ని కూడా ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకొస్తే పామర్రులో రెండు డివిజన్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
పెనమలూరు కృష్ణాజిల్లాకే పరిమితమా?
పెనమలూరు నియోజకవర్గం కృష్ణాజిల్లాలోనే కొనసాగించాలన్న ఆలోచనలో మంత్రుల బృందం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క పెనమలూరు మండలంలో కొన్ని గ్రామాలు తప్ప మిగిలిన గ్రామాలు, మండలాలు కృష్ణాజిల్లాలోనే అంతర్భాగంగా ఉండటం వల్ల ఆ నియోజకవర్గాన్ని అక్కడే కొనసాగించాలన్న ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. కాగా, విజయవాడ గ్రేటర్ విలీన ప్రతిపాదిత జాబితాలో పెనమలూరు మండలంలోని కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు గ్రామాలతో పాటు కంకిపాడు మండల పరిధిలోని గంగూరు, గోసాల, ఈడుపుగల్లు, పునాదిపాడు, కంకిపాడు, వేల్పేరు, ఉప్పులూరు గ్రామాలు పాత (45 విలీన గ్రామాల) జాబితాలో ఉన్నాయి. తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించిన జాబితాలో కంకిపాడు, పెనమలూరు మండలాల్లోని పూర్తి గ్రామాలను చేర్చారు. పెనమలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఉంటే గ్రేటర్ విజయవాడ ఎలా సాకారం అవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.