Share News

వజ్రాల వేట!

ABN , Publish Date - May 31 , 2025 | 01:08 AM

రుతుపవనాల రాకతో తొలకరి వర్షాలు ఆరంభమయ్యాయి. దీంతో చందర్లపాడు మండలం గుడిమెట్లలో వజ్రాల వేట మొదలైంది. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్న ఔత్సాహికుల రాకతో గుడిమెట్ల సందడిగా మారింది. తొలకరి వర్షా లు పడినప్పడల్లా వజ్రాల అన్వేషకులు, స్థానికులు గుడిమెట్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్వేషణ సాగిస్తుంటారు. ప్రస్తుతం తొలకరి పులకరించడంతో భారీ సంఖ్యలో ప్రజలు వజ్రాల వేటకు వస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వజ్రాల అన్వేషణపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

వజ్రాల వేట!
వజ్రాల కోసం వెదుకుతున్న మహిళలు

తొలకరి పలకరింపుతో కృష్ణా తీరం వెంబడి పొలాల్లో వెదుకులాట

గుడిమెట్లకు భారీగా తరలివచ్చిన అన్వేషకులు, స్థానికులు

(ఆంధ్రజ్యోతి, కంచికచర్ల):

కృష్ణా తీరం వజ్ర సంపదకు నిలయం. నదీ పరివాహక ప్రాంతంలో గతంలో విలువైన వ జ్రాలు దొరికాయి. ఎన్‌ఎండీసీ ఆధ్వర్యంలో ఇంతకు ముందు తవ్వకాలు కూడా జరిగాయి. ఇప్పటికీ తీరగ్రామాల్లో అడపాదడపా వజ్రా లు దొరుకుతూనే ఉన్నాయి. వర్షాకాలంలో వ జ్రాల కోసం ఎక్కువగా వెదుకుతుంటారు. వ జ్రం దొరుకుతుందన్న ఆశతో స్థానికులే కాకుం డా, దూరప్రాంతాల నుంచి వచ్చి, ఇక్కడే ఉం టూ గాలిస్తుంటారు.

ఖరీదైన వజ్రాలకు నెలవు

కృష్ణానది తీరంలో విలువైన వజ్రాలు దొరుకుతాయి అనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రిటీష్‌ ప్రభుత్వం అధీనంలో ఉన్న, ఎంతో విలువైన, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్‌ వజ్రం కూడా కృష్ణా తీరంలోనే దొరికింది.

పరిటాల కేంద్రంగా నిజాం పాలన

ఖరీదైన వజ్రాలు లభిస్తుండటంతో స్వాతంత్ర్యానికి పూర్వం నిజాం నవాబు పరిటాల, మో గులూరు, బత్తినపాడు, గనిఆత్కూరు(ఈ నాలు గు గ్రామాలు కంచికచర్ల మండలం), చందర్లపాడు మండలం కొడవటికల్లు, ఉస్తేపల్లి, నూజివీడు దగ్గర ఉన్న మల్లవల్లి గ్రామాలను మాత్రం ఈస్ట్‌ ఇండియా కంపెనీకి అప్పగించలేదు. పరిటాల కేంద్రంగా పాలన చేశారు.

వర్షం కురిసిన మరుసటిరోజు నుంచి..

వజ్రాలు వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. వర్షం కురిసిన మరుసటి రోజు ఎక్కువ మంది వజ్రాల కోసం వెదుకుతుంటారు. వర్షానికి మట్టి పైభాగం(పొర) కొట్టుకుపోతుం ది. పొర కింద ఉండే వజ్రాలు బయటపడతా యి. మట్టి తవ్వకుండానే నిశితంగా పరిశీలిస్తూ వెదుకుంటారు. సాగుభూముల్లో కూడా వజ్రా లు దొరికాయి. రెండేళ్ల క్రితం పొలం దున్నుతుండగా కొడవటికల్లుకు చెందిన ఒక రైతుకు విలువైన వజ్రం దొరికింది. ఆ గ్రామంలోనే రెండు మూడు వజ్రాలు దొరికాయి. అం తకు ముందు ఉస్తేపల్లిలో ఒకరికి దొరికింది. వజ్రం దొరికిందంటే మూడో కంటికి కూడా తెలియనీయరు. తెలిస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న భయంతో చాలా జాగ్రత్తగా ఉంటారు. మధ్యవర్తుల ద్వారా వ్యాపారులను కలిసి విక్రయిస్తుంటారు. వజ్రాలు కొనేందుకు స్థానికంగా కూడా వ్యాపారులు ఉన్నారు.

ఇరవై ఏళ్ల క్రితం రూ.కోట్లు పలికిన పరిటాల వజ్రం

పరిటాల గ్రామంలో వజ్రాల కోసం నిత్యం వెదుకుతూనే ఉంటారు. ఇంతకు ముందు పరిటాలలో విలువైన వజ్రాలు ఎక్కువగానే దొరికాయి. వజ్రాల వ్యాపారులు కూడా పరిటాల చుట్టూ తిరుగుతుండేవారు. రెండు దశాబ్ధాల క్రితం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బైపాస్‌ రోడ్డు నిర్మించారు. రోడ్డుకు చెరు వు మట్టి తోలుతుండగా, విలువైన వజ్రం దొరికింది. స్థానికంగా రూ.లక్షల్లో చేతులు మారగా, చివరగా ముంబై మార్కెట్లో రూ.కోట్లలో పలికింది. అప్పట్లో వజ్రాలు వెతికేందుకు వేలల్లో జనాలు రావడంతో అదుపుచేసేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. అడపాదడపా చిన్న చిత కా వజ్రాలు దొరుకుతున్నాయి.

ఉదయం నుంచి చీకటి పడేంత వరకు అన్వేషణ

చందర్లపాడు మండలం గుడిమెట్ల (రామన్నపేట) కృష్ణానది ఒడ్డున ఎర్ర మట్టితో కూడిన గట్టుపోరంబోకు ఉంది. మట్టిని తవ్వుతూ నిశితంగా పరిశీలిస్తూ మెరుస్తున్న రాళ్లను, రంగురాళ్లను ఏరుతున్నారు. తెల్లారటం ఆలస్యం గాలింపులో నిమగ్నమైపోతున్నారు. చీకటి పడేంత వరకు ఏరుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది అక్కడే వంట చేసుకుంటున్నారు. ఇక్కడ ఏడాది పొడవునా పదుల సంఖ్యలో జనాలు రాళ్లు ఏరుతుంటారు. ఐదు నెలల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన ఒకరికి ఇక్కడ విలువైన వజ్రం దొరికింది. కొన్నేళ్ల క్రితం మూడు నాలుగు వజ్రాలు దొరికాయి.

మూలన పడిన ఎన్‌ఎండీసీ ప్రాజెక్టు

వజ్రాలు దొరుకుతుండటంతో నేషనల్‌ మినరల్‌ డవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టును నెలకొల్పింది. కొన్నేళ్ల క్రితం చందర్లపాడులో వజ్రాలను గుర్తించేందుకు యంత్రాలను ఏర్పాటు చేసింది. యాభై మంది ఉద్యోగులు ఉండేవారు. ఆ ప్రాంతంలో మట్టిని, రాళ్లను తెచ్చి శుద్ధి చేసేవారు. కొద్ది సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు మూలనపడింది. ఖర్చు తప్పితే ఆశించిన విధంగా పెద్ద సంఖ్యలో వజ్రాలు లభించనందున గిట్టుబాటు కాకపోవటంతో యంత్రాలను ఇతర ప్రాంతాలకు తరలించారు.

Updated Date - May 31 , 2025 | 01:08 AM