పుష్కరాల్లోపు దుర్గగుడి అభివృద్ధి
ABN , Publish Date - Jun 24 , 2025 | 01:00 AM
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కృష్ణా పుష్కరాల నాటికి పూర్తిచేస్తామని, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను త్వరగా చేపడతామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దుర్గగుడిలో పెండింగ్‌లో ఉన్న మాస్టర్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం పనుల పురోగతిపై మంత్రి రాంనారాయణరెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్‌చంద్, దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనానాయక్‌తో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు.
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తాం
మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందగానే పనులు వేగం
ఇంద్రకీలాద్రిపై చెట్ల పెంపకం కార్యక్రమం
ఈనెల 28న మరోసారి సమావేశం
దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి
ఇంద్రకీలాద్రి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కృష్ణా పుష్కరాల నాటికి పూర్తిచేస్తామని, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను త్వరగా చేపడతామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దుర్గగుడిలో పెండింగ్‌లో ఉన్న మాస్టర్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం పనుల పురోగతిపై మంత్రి రాంనారాయణరెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్‌చంద్, దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనానాయక్‌తో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దుర్గగుడిలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత త్వరగా పూర్తి చేసేందుకు దేవదాయ శాఖ కమిషనర్, ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి సమష్టి నిర్ణయం తీసుకున్నామన్నారు. అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశామని, కొన్ని మార్పులు చేపడుతున్నట్లు తెలిపారు. 2047 వరకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల వాహనాల పార్కింగ్ ఏర్పాటుపై మాస్టర్ ప్లాన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు హోల్డింగ్ ఏరియా (వేచి ఉండేందుకు) ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్నవితరణలో పూర్తి నాణ్యత ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ప్రసాదాలన్నీ నాణ్యతతో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామన్నారు. భక్తులు సేదతీరేందుకు ప్రత్యేకమైన బల్లలను, కేశఖండన శాల వద్ద గదుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 28న ఎంపీ, ఎండోమెంట్ కమిషనర్, ఉన్నతాధికారులతో కలిసి మరోసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొన్ని స్థల వివాదాలు ఉన్నాయని, వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం, ఇరిగేషన్‌కు సంబంధించిన స్థల వివాదాలు ఉన్నాయని తెలిపారు. వీటిపై ఈనెల 28వ తేదీన జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఈ సమావేశంలో ఈవో శీనానాయక్ మాస్టర్ ప్లాన్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
సర్వం సువర్ణమయం
దుర్గమ్మ ఆలయం మొత్తానికి సంపూర్ణ స్వర్ణతాపడం
ప్రతిపాదన తయారుచేసిన దేవస్థాన అధికారులు
టీటీడీ, దాతల సహకారంతో పూర్తి చేయాలని నిర్ణయం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కనకదుర్గమ్మ ఆలయానికి సంపూర్ణ బంగారు తాపడం చేపట్టేందుకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నిర్ణయించింది. ప్రస్తుతం దుర్గమ్మ గోపురానికి మాత్రమే బంగారు తాపడం ఉంది. పూర్తిస్థాయిలో ఆలయానికి బంగారు తాపడం చేయించాలని తాజాగా నిర్ణయించారు. ఈ విషయాన్ని దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దృష్టికి కూడా తీసుకొచ్చారు. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో అమ్మవారి ఆలయ గోపురానికి స్వర్ణతాపడ పనులు జరిగాయి. ప్రస్తుతం అమ్మవారి ఆలయ గోపురం, ఆలయ గోడలకు స్వర్ణతాపడ పనులు చేయాలని నిర్ణయించారు. ఖరీదైన వ్యవహారం కావటంతో పాటు కోట్ల రూపాయల నిధులు కావాల్సి ఉండటంతో మరోసారి టీటీడీ అధికారులను సంప్రదించారు. టీటీడీ అధికారులు కూడా ప్రణాళికలు రూపొందించారు. దాతల సహాయాన్ని కూడా తీసుకుని దుర్గమ్మ ఆలయానికి సంపూర్ణ స్వర్ణతాపడ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.