సీఎం సూచనల మేరకు దుర్గగుడి అభివృద్ధి
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:36 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి చేపట్టి, భక్తులకు పెద్దపీట వేస్తామని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డిలో ఉన్న ఆలయ సమావేశపు కార్యాలయంలో పాలకమండలి మొదటి సమావేశం శుక్రవారం జరిగింది.
దసరా తరహాలోనే భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు
మల్లేశ్వరస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం
దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ వెల్లడి
ఇంద్రకీలాద్రి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి చేపట్టి, భక్తులకు పెద్దపీట వేస్తామని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డిలో ఉన్న ఆలయ సమావేశపు కార్యాలయంలో పాలకమండలి మొదటి సమావేశం శుక్రవారం జరిగింది. 24 అంశాలపై చర్చించారు. అనంతరం చైర్మన్‌తో పాటు ఈవో శీనానాయక్ మీడియాతో మాట్లాడారు. తొలుత చైర్మన్ మాట్లాడుతూ భవానీ దీక్ష విరమణలకు పెద్ద ఎత్తున భవానీలు తరలిరానున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్ష విరమణల్లో కూడా అన్ని ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేస్తామన్నారు. ఇంజనీరింగ్ పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కనకదుర్గానగర్, ఘాట్‌రోడ్డులోని దుకాణాలన్నింటినీ మహామండపం ఐదో అంతస్థులోకి మార్చనున్నట్లు చెప్పారు. షాపుల వద్ద ప్రతి వ్యాపారీ తప్పనిసరిగా ధరల పట్టిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పూజా సామగ్రి విక్రయాల దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేవస్థానం నుంచి పోరంకి వరకు ప్రత్యేక బస్సును దాతల సాయంతో కానీ, ఆలయ నిధులతో కానీ నడుపుతామన్నారు. దేవస్థాన అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. మల్లేశ్వరస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించనున్నట్లు తెలిపారు. ఈవో శీనానాయక్ మాట్లాడుతూ భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లపై చర్చించామన్నారు. కనకదుర్గానగర్‌ను మరింత అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దీక్షల విరమణ అనంతరం మాస్టర్ ప్లాన్‌పై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.