ఢిల్లీ టూ బెజవాడ
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:05 AM
శిశువుల విక్రయంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ముఠాతో విజయవాడ గ్యాంగ్‌కు ఉన్న సంబంధంతోనే శిశువులు ఇక్కడికి వస్తున్నట్టు తేలింది. ముఠాను నడుపుతున్న బలగం సరోజినికి శిశువులను విక్రయిస్తున్న ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, భారతిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
పసిపిల్లల విక్రయం కేసులో కొత్తకోణం
పోలీసులకు చిక్కిన ఢిల్లీకి చెందిన ఇద్దరు
బలార్షలో పట్టుకున్న పోలీసులు
సరోజిని ఇచ్చిన వివరాలను అనుసరించే..
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : శిశువుల విక్రయంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ముఠాతో విజయవాడ గ్యాంగ్‌కు ఉన్న సంబంధంతోనే శిశువులు ఇక్కడికి వస్తున్నట్టు తేలింది. ముఠాను నడుపుతున్న బలగం సరోజినికి శిశువులను విక్రయిస్తున్న ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, భారతిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సరోజిని పోలీసులకు దొరికిపోయిందన్న సమాచారం తెలుసుకున్న వారిద్దరూ ఢిల్లీ నుంచి మకాం మార్చేశారు. మహారాష్ట్రలోని బలార్షకు పారిపోయినట్టు గుర్తించారు. వారిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. కిరణ్‌శర్మను మహిళా పోలీసులు, భారతీని భవానీపురం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
పేదల నుంచి కొనుగోలు చేసి..
కిరణ్‌శర్మ ఈ ఏడాది మార్చిలో ఇక్కడ నమోదైన కేసులో నిందితురాలిగా ఉంది. నాటి నుంచి ఆమె పోలీసులకు చిక్కలేదు. తాజాగా నమోదైన కేసుల్లో ఆమె పేరును సరోజిని పోలీసులకు తెలిపింది. దీంతో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కిరణ్‌శర్మ భర్త హితేష్ ఢిల్లీలో కారుడ్రైవర్. ఆమె సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్. అక్కడి నుంచి ఉపాధి నిమిత్తం భర్తతో కలిసి కొన్నాళ్ల కిందట ఢిల్లీకి వచ్చింది. కొన్ని నెలలపాటు సంతాన సాఫల్య కేంద్రాల్లో పనిచేసింది. తర్వాత ఆయా కేంద్రాలకు సరోగసీ కోసం మహిళలను సరఫరా చేసేది. తర్వాత చిన్నపిల్లలను కొని విక్రయించడం మొదలుపెట్టింది. ఇందుకోసం సుల్తాన్‌పూర్‌కు చెందిన భారతి అనే మహిళను సహాయకురాలిగా నియమించుకుంది. ఢిల్లీలోని మురికివాడల్లో పిల్లలను పెంచడం భారంగా భావించే కుటుంబాలను సంప్రదించి శిశువులను కొనుగోలు చేస్తోంది. వారిని వివిధ రాషా్ట్రల్లో పరిచయం ఉన్న ముఠాలకు విక్రయిస్తోంది. ఢిల్లీ నుంచి ఇద్దరు శిశువులను ఈనెల 17న కిరణ్‌శర్మ, భారతి కలిసి విజయవాడకు తీసుకొచ్చారు. ఆ ఇద్దరినీ సరోజిని చేతుల్లో పెట్టారు. సాధారణంగా సరోజిని ఒక్కో శిశువును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు కొని అధిక ధరలకు విక్రయిస్తోంది. ఈ ఇద్దరు పిల్లల విషయం కిరణ్‌శర్మతో ఎలాంటి బేరం కుదరలేదు. ఈ శిశువులను విక్రయించాక డబ్బు పంపుతానని సరోజిని చెప్పింది. ఒక చిన్నారిని రూ.3 లక్షలకు నున్నలో దంపతులకు సరోజిని విక్రయించింది. అనంతరం సరోజిని పోలీసులకు దొరికిపోయింది. 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉండటంతో పోలీసులు కిరణ్‌శర్మ, భారతిని రిమాండ్‌కు పంపారు.