దసరాకు పశ్చిమ బైపాస్
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:30 AM
విజయవాడ పశ్చిమ బైపాస్‌ను సంక్రాంతికి పూర్తిస్థాయిలో ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే, రాబోయే దసరా ఉత్సవాలను పురస్కరించుకుని తాత్కాలికంగా వాహనాలను మళ్లించాలని నిర్ణయించారు.
తాత్కాలికంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయం
ఎన్‌హెచ్ అధికారులతో ఎంపీ కేశినేని చిన్ని చర్చలు
సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ పశ్చిమ బైపాస్‌ను సంక్రాంతికి పూర్తిస్థాయిలో ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే, రాబోయే దసరా ఉత్సవాలను పురస్కరించుకుని తాత్కాలికంగా వాహనాలను మళ్లించాలని నిర్ణయించారు. దసరా ఉత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలిరానున్నారు. అలాగే, దసరా ఉత్సవ్-2025, కృష్ణా వ్యవసాయ, పారిశ్రామిక ఎగ్జిబిషన్ జరగనున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే విజయవాడ పశ్చిమ బైపాస్‌ను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో నిర్వాహక కమిటీ సభ్యులు, ఎంపీ కేశినేని చిన్ని.. జాతీయ రహదారుల సంస్థ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం విజయవాడ వెస్ట్ బైపాస్ రెండు ప్యాకేజీలు కలిపి దాదాపు 90 శాతం మేర పనులు పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇవి ఇప్పుడు పరిష్కారమయ్యేవి కావు. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాలకు తాత్కాలికంగా వెస్ట్ బైపాస్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. గత సంక్రాంతి సందర్భంలో, రాజధాని అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన సమయంలో దీనిని విజయవంతంగా ఉపయోగించుకున్నారు. అలాగే, గుంటూరు వైపు నుంచి ప్యాకేజీ-4ను కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. పూర్తికాని రోడ్డు పోర్షన్‌ను కంకర చిప్స్, డస్ట్‌తో తాత్కాలికంగా అందుబాటులోకి తేవాలని ఎంపీ చిన్ని చెప్పారు. ఇందుకు ఎన్‌హెచ్ అధికారులు కూడా అంగీకరించారు.