Share News

జాతీయ రహదారిపై అంధకారం

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:23 AM

చల్లపల్లి మండల పరిధిలో 216ఏ జాతీయ రహదారి పై విద్యుద్దీపాలు లేకపోవడంతో చీకటిమయంగా ఉం టోంది.

జాతీయ రహదారిపై అంధకారం
లక్ష్మీపురం జంక్షన్‌ వద్ద వెలగని హైవే ఫోకస్‌ లైట్లు

రాత్రివేళ హైవేపై వెలగని లైట్లు

చీకటిమయంగా చల్లపల్లి, లక్ష్మీపురం జంక్షన్లు

(ఆంధ్రజ్యోతి - చల్లపల్లి)

చల్లపల్లి మండల పరిధిలో 216ఏ జాతీయ రహదారి పై విద్యుద్దీపాలు లేకపోవడంతో చీకటిమయంగా ఉం టోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. హైవేమీదుగా గ్రామాలకు వెళ్లే చోట్ల, హైవేపైన కొన్నిచో ట్ల విద్యుద్దీపాలు లేవు. లైట్లు ఉన్నచోట కూడా వాటిని వేయకపోవటంతో హైవే అంధకారంగా ఉంటోంది. జాతీయ రహదారిపై లక్ష్మీపురం ఎస్టీకాలనీ సమీపంలో ఉన్న జంక్షన్‌ ప్రధానమైనది. హైవే మీదుగా లక్ష్మీపురం గ్రామంలోకి వెళ్లకుండా భారీ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలు నేరుగా కాసానగర్‌ మీదుగా మోపిదేవి, అవనిగడ్డ వెళ్లిపోవచ్చు. లక్ష్మీపురం గ్రామంలోకి శివారు గ్రా మాలకు వెళ్లేవారు డౌన్‌లోకి దిగి ఆర్‌అండ్‌బీ రోడ్డుమీదు గా వెళతారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జంక్షన్‌లో తాటిచెట్టు ఎత్తున లైట్లు ఏర్పాటుచేసినా అవి వెలగడం లేదు. నిర్వహణ లోపమో, మరే కారణమో తెలియదు. లక్ష్మీపురం నుంచి మంగళాపురం, రామానగరం నుంచి నూకలవారిపాలెం, చల్లపల్లి పద్మావతి ఆస్పత్రి బజారు మీదుగా గంగులవారిపాలెం దళితవాడ, పెదకళ్లేపల్లి రోడ్డుమీదుగా వెంకటాపురం పెదకళ్లేపల్లి గ్రామాలకు జడ్పీ రహదారుల్లో ప్రయాణం చేస్తూ హైవే ఎక్కివెళ్లాలి. ఆయా రోడ్ల వద్ద హైవేపై లైట్లు వెలగడం లేదు.

తరచూ ప్రమాదాలు

లక్ష్మీపురం జంక్షన్‌ ఎంత ప్రధానమైనదో చల్లపల్లి-పెదకళ్లేపల్లి రోడ్డు జంక్షన్‌ అంతే ప్రధానమైనది. ఫ్యాక్టరీలు, మిల్లులతోపాటు పలు గ్రామాలకు ఈ మార్గంలోనే ప్రయాణించాలి. లైట్లు వెలగకపోవటంతో వాహనాల లైట్లు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, రేడియం స్టిక్కర్లు, వైట్‌ పెయింట్ల ఆధారంగా వాహనదారులు ముందుకు వెళుతున్నారు. సరైన కాంతి లేక తరచూ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయి. గంగులవారిపాలేనికి వెళ్లే దారిలో హైవేపై స్వచ్ఛ చల్లపల్లి వారు గ్లోసైన్‌ బోర్డులు ఏర్పాటుచేసి ఫోకస్‌ లైట్లు పెట్టారు. అక్కడ సమస్య లేదు. మిగిలిన ప్రాంతాల్లో హైవే లైట్లు వెలగక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి హైవేపై లైట్లు వెలిగించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పెదప్రోలు ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది.

Updated Date - Apr 10 , 2025 | 12:23 AM