Share News

టిప్పర్లతో తిప్పలు

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:51 AM

ఓవర్‌ లోడుతో వెళ్తున్న టిప్పర్లు, డంపర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. తెలంగాణాలోని చేవెళ్లలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో మన జిల్లాలో పరిస్థితులను పరిశీలిస్తే.. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు గ్రామీణ రోడ్లలోనూ ఇవి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇసుక, కంకర, మట్టి, గ్రావెల్‌ ఏదైనా.. అధిక లోడుతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అత్యంత వేగంగా రాకపోకలు సాగిస్తున్నాయి. రాత్రిపూట మరింత వేగం పుంజుకుంటున్నాయి. సరైన ఆజమాయిషీ లేకపోవటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.

టిప్పర్లతో తిప్పలు
ఇబ్రహీంపట్నంలో అధిక లోడుతో పట్టా కూడా లేకుండా వెళ్తున్న టిప్పర్‌

ప్రమాదకరంగా భారీ టిప్పర్లు, హెవీ డంపర్లు

ఓవర్‌ లోడుతో పాటు జాగ్రత్తలు లేకుండా రాకపోకలు

మితిమీరిన వేగంతో ప్రయాణం.. రాత్రుళ్లు మరీ ఘోరం

జిల్లావ్యాప్తంగా అనేక ప్రమాదాలు.. పట్టని అధికారులు

ప్రధాన రహదారులపై పడిపోతున్న కంకర, ఇసుక

వేగంగా వచ్చి జారిపోతున్న వాహనదారులు

జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు గ్రామీణ రోడ్లూ ఛిద్రం

(ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం/కంచికచర్ల/విజయవాడ రూరల్‌/హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌) : విజయవాడ-హైదరాబాద్‌ ఎన్‌హెచ్‌-65, ఇబ్రహీంపట్నం-ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌హెచ్‌-30పై నిత్యం భారీసంఖ్యలో కంకర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, జి.కొండూరు మండలాల్లోని వందలాది రాతి క్వారీలు, సమీపంలోని పెద్దపెద్ద క్రషర్ల నుంచి రాత్రీ పగలు తేడా లేకుండా వందల సంఖ్యలో టిప్పర్లు పలు గ్రామాలకు కంకరను రవాణా చేస్తున్నాయి. టిప్పర్లలో కంకరను ఓవర్‌లోడు చేస్తున్నారు. డ్రైవర్‌ టాప్‌ క్యాబిన్‌పై కూడా కంకరను పోసి మరీ రవాణా చేస్తున్నారు. కంకర కిందకు కారకుండా ఉండేందుకు పట్టాలు కూడా కట్టట్లేదు. ఈ క్రమంలో జాతీయ రహదారుల్లోని పలు కూడళ్ల వద్ద, జంక్షన్లు ఉన్నచోట కంకర కింద పడుతోంది. పశ్చిమ ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న జంక్షన్లలో, రింగ్‌ సెంటర్లలో రోజూ 4 నుంచి 5 ట్రాక్టర్ల మేర టిప్పర్ల నుంచి కంకర కింద పడుతోంది. వీటివల్ల వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయి.

నందిగామ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఘోరంగా..

నందిగామ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఇసుక రీచ్‌లు, గ్రావెల్‌, కంకర క్వారీలు, సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి జిల్లాలోని ప్రాంతాలకే కాకుండా, ఇతర జిల్లాలకు ఇసుక, కంకర, సిమెంట్‌ సరఫరా అవుతుంది. టిప్పర్లు, డంపర్లలో పరిమితికి మించి లోడ్‌ చేస్తున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆరు టైర్ల టిప్పరుకు 10 టన్నులు, 10 టైర్లకు 18 టన్నులు, 12 టైర్లకు 26 టన్నులు, 14 టైర్లకు 32 టన్నుల మేర లోడింగ్‌ చేయాలి. అదే డంపర్‌కు అయితే 35 టన్నుల వరకు లోడ్‌ చేసుకోవచ్చు. కానీ, టిప్పర్లు, డంపర్ల యజమానులు ఓవర్‌ లోడింగ్‌కే ప్రాధాన్యమిస్తున్నారు. భారీ టిప్పర్లకు, డంపర్లకు 60 నుంచి 70 టన్నుల వరకు లోడింగ్‌ చేస్తున్నారు. వీటివల్ల జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు గ్రామీణ రోడ్లు ధ్వంసమవుతున్నాయి.

నగరంలో రాత్రిపూట ఇష్టానుసారంగా..

టిప్పర్ల దూకుడు కారణంగా నగరంలోని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, పైపులరోడ్డు సెంటర్‌, ప్రకాష్‌నగర్‌, కండ్రిక తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అవనిగడ్డ-విజయవాడ కరకట్ట మార్గం మీదుగా ఇసుకతో కూడిన భారీ లారీలు గుంటూరు కూడా వెళ్తున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట హెవీలోడుతో ఎన్‌హెచ్‌-16, ఎన్‌హెచ్‌-65పై గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్తున్నాయి. కొంతమంది డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గన ్నవరం, బాపులపాడు మండలాల్లోని క్వారీల నుంచి కూడా నగరానికి మితిమీరిన వేగంతో టిప్పర్లు దూసుకొస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కంటితుడుపు చర్యలు కాకుండా తగు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలతో పాటు రహదారులు ధ్వంసం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.

Updated Date - Nov 04 , 2025 | 12:51 AM