కళ్లు చె‘మిర్చి’
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:53 AM
ఫొటోలో కనిపిస్తున్నది పెనుగంచిప్రోలుకు చెందిన రైతు కటిక నాగేశ్వరరావు. ఎకరం రూ.23 వేల వంతున 4 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. ఇప్పటికి ఎకరాకు రూ.70 వేల వంతున పెట్టుబడి అయింది. గతనెలలో కురిసిన భారీ వర్షానికి మొక్క కింద పడిపోయింది. పైకి లేపి ప్రాణం పోశారు. పూత, పిందెలతో కళకళలాడుతూ ఎదుగుతున్న తోటలను మొంథా తుఫాను మరోసారి దెబ్బతీసింది. ఈదురుగాలులకు చెట్లు ఒరిగి కొమ్మలు విరిగాయి. పూత రాలిపోయింది. మరల చెట్లను నిలబెట్టినప్పటికీ నిలబడతాయో లేదో కాపు వస్తుందో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది.
మిర్చి రైతును ముంచేసిన మొంథా తుఫాను
బలమైన ఈదురు గాలులకు నేలకొరిగిన పంట
ప్రశ్నార్థకంగా మారిన దిగుబడులు
పెట్టుబడి అయినా వస్తుందా రాదా అనే భయం
ప్రభుత్వం ఆదుకోవాలంటున్న మిర్చి రైతులు
(ఆంధ్రజ్యోతి, కంచికచర్ల) : పశ్చిమ ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగైంది. కౌలుతో కలుపుకొని ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి అయ్యింది. తోటలు పూత, పిందె దశలో ఉన్నాయి. తెగుళ్లు, చీడపీడలు కూడా లేకపోవడంతో తోటలు ఎదుగుతూ, కాపునకు దిగుతున్న తరుణంలో మొంథా తుఫాన్ విరుచుకుపడింది. పల్లపు, లోతట్టు ప్రాంతాల్లోని మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. నీళ్లు నిలబడటంతో తోటలు ఎర్రబడ్డాయి. బలమైన ఈదురుగాలులకు మొక్కలు పక్కకు ఒరిగాయి. కొన్ని తోటల్లో చెట్లకొమ్మలు విరిగాయి. పూత రాలిపోయింది. ఒరిగిన చెట్లను రెండోరోజే నిలదొక్కించారు. అయితే, మిర్చి తోటలకు కనిపించని నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. నేలకొరిగిన చెట్లు నిలదొక్కుతున్నప్పటికీ కాపుపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఆశించిన దిగుబడులు రావటం కష్టమని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు పెట్టుబడి కూడా బాగా పెరుగుతుందంటున్నారు. సాధారణంగా ఎకరాకు రూ.1.50 లక్షలకు అయ్యే పెట్టుబడి, అధిక వర్షాలు, తుఫాన్ వల్ల రూ.2 లక్షల పైగా అవుతుందంటున్నారు.
పుంజుకుంటున్న మార్కెట్
రెండేళ్లుగా మిర్చి మార్కెట్‌లో సంక్షోభం ఏర్పడింది. క్వింటాకు రూ.10 వేల నుంచి రూ.13 వేలలోపు మాత్రమే ధర వచ్చింది. ఒకప్పుడు తాలు కాయల ధర కూడా ఎర్ర కాయలకు లభించకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల నుంచి మార్కెట్‌లో కదలిక వచ్చిందని అంటున్నారు. క్రమేణా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం గుంటూరు మార్కెట్‌లో తేజ రకానికి క్వింటాకు కనిష్టంగా రూ.13 వేలు, గరిష్టంగా రూ.15,700 ధర పలికింది. లావులకు సంబంధించి 334 రకానికి కనిష్టంగా రూ.12,500, గరిష్టంగా రూ.15 వేలు ధర పలికింది. ప్రస్తుతం మార్కెట్లో ధర పెరుగుతుండటం రైతులకు కొంత ఊరట కలిగించే అంశం.