జోగి.. నానా యాగీ
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:50 AM
కుటిల రాజకీయానికి తెరతీశారు. డంపింగ్ యార్డు పేరుతో బుధవారం హడావిడి చేయడానికి ప్రయత్నించిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. తమకు బూడిద అందకుండా జెన్‌కో.. ఓ ప్రైవేట్ సంస్థకు బల్క్‌గా కాంట్రాక్టు అప్పగించిందని ఓవైపు ట్రాన్స్‌పోర్టర్లు ఆందోళన చేస్తుండగా, వారికి మద్దతుగా నిలివాల్సిందిపోయి ఎమ్మెల్యే వసంతపై లేనిపోని ఆరోపణలు చేస్తూ జోగి హడావిడి సృష్టించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మైలవరం కేంద్రంగా కుటిల రాజకీయాలు
మూలపాడు డంపింగ్ యార్డుకు రావాలని పిలుపు
50 మంది వైసీపీ కార్యాకర్తలే రావడంతో అభాసుపాలు
జోగి, 14 మంది అనుచరుల అరెస్టు.. కేసు నమోదు
పాత డంపింగ్ యార్డులపై అనవసర రాద్ధాంతం
జెన్‌కో బల్క్ టెండర్ల తర్వాత స్థానికంగా నిలిచిన రవాణా
పాత డంపింగ్ యార్డు పేరుతో రాజకీయ అలజడికి యత్నం
వైసీపీ హయాంలో అడుగడుగునా బూడిద డంపింగ్ యార్డులు
నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న జోగి సోదరులు
నేడు మాత్రం ఏదో జరిగిపోతోందని హడావిడి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/ఇబ్రహీంపట్నం) : మైలవరం నియోజకవర్గంలో మాజీమంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ సరికొత్త రాజకీయానికి తెరలేపారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను లక్ష్యంగా చేసుకుని, ప్రజలను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్న ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూలపాడులోని బూడిద డంపింగ్ యార్డు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌దేనంటూ జోగీ నానా యాగీ చేశారు. వాస్తవానికి ఈ డంపింగ్ యార్డు కూటమి నాయకుడిదే అయినా ఇప్పటిది కాదు. చాలా పాతది. ట్రాన్స్‌పోర్టర్లు బూడిదను తరలించేటపుడు నారాయణ అనే కూటమి నాయకుడు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ డంప్ చేశారు. జోగి రమేశ్ హడావిడిపై స్పందించిన నారాయణ.. లేనిపోని ఆరోపణలు చేయడమే కాదని, మీడియా సమక్షంలో దమ్ముంటే అక్కడకు రావాలని సవాల్ విసిరారు. అయితే, బుధవారం మూలపాడులో బూడిద డంప్ చేసిన ప్రాంతానికి వెళ్లేందుకు జోగి రమేశ్ విశ్వప్రయత్నం చేశారు. వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా శ్రేణులు తరలివస్తారని భావించినా కేవలం 50 మందిలోపే వచ్చారు. జోగి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మూలపాడు వెళ్లేందుకు బయటకు వచ్చిన ఆయన్ను పది అడుగులు వేయకుండానే వ్యాన్‌లో ఎక్కించి భవానీపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్ ఆంక్షలను ఉల్లంఘించి, అనుమతులు లేకుండా మూలపాడు బూడిద డంపింగ్ యార్డుకు అనుచరగణంతో వెళ్తున్న జోగి రమేశ్, అతని అనుచరులు మరో 14 మందిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్రమ వ్యాపారాన్ని మరిచారా?
వైసీపీ అధికారంలో ఉండగా, మాజీమంత్రి జోగి నాలుగు ఎకరాల స్థలంలో పెద్ద ఎత్తున బూడిద డంపింగ్ చేసి విచ్చలవిడిగా వ్యాపారం చేశారు. ఆయన సోదరుడు ఏకంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల నుంచి లేఖలు తెచ్చి ప్రభుత్వ పక్కా గృహాలకు బూడిద రవాణా చేసి సొమ్ము చేసుకున్నాడని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాడు ఇష్టానుసారంగా బూడిద అక్రమ వ్యాపారం చేసిన జోగి నేడు నీతులు చెబుతున్నారని కూటమి నేతలు పేర్కొంటున్నారు. వైసీపీ హయాంలో 25కు పైగా బూడిద డంపింగ్ యార్డులు నడిచాయి. అధికారంలో ఉండగా ఎన్టీటీపీఎస్ యాజమాన్యంతో మాట్లాడి ఏనాడూ ఒక్క మొక్క నాటించలేదు. సీఎస్‌ఆర్ ఫండ్స్ విడుదల చేయించి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేయించలేదు. కృష్ణాజలాల్లో కలుస్తున్న బూడిద నీళ్ల శుద్ధి విషయంలోనూ నోరు మెదపలేదు. స్థానిక ట్రాన్స్‌పోర్టర్ల సమస్యలను పరిష్కరించింది లేదు. ఇప్పుడు మాత్రం శాంతిభద్రతలను రెచ్చగొట్టేలా జోగి ప్రవర్తిస్తున్నారు.
కావాలనే రచ్చ
ఇటీవల జెన్‌కో టెండర్లు పిలిచి బల్క్‌గా బూడిద తరలింపును ఒక కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. దీంతో కాంట్రాక్టు సంస్థ పర్యవేక్షణలోనే ఈ రవాణా జరుగుతోంది. తమకు బూడిద అందనీయకుండా చేస్తున్నారని స్థానిక ట్రాన్స్‌పోర్టర్లు ఓవైపు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్టర్లు తోలుకోవటానికి జెన్‌కో అనుమతించట్లేదు. బూడిద తరలింపునకు బల్క్‌గా రవాణా చేసేందుకు టెండర్లు పిలిచిన తరుణంలో ప్రైవేట్‌గా బూడిదను డంపింగ్ చేసుకోవటానికి ఎలాంటి అవకాశం లేదు. కానీ, ఏదో జరిగిపోతున్నట్టుగా జోగి బూడిద రాజకీయం చేస్తున్నారు. తమ పొట్టకొట్టారని, తమకు బూడి ద ఇవ్వకుండా జెన్‌కో పెద్ద సంస్థకు అప్పగించిందని స్థానిక ట్రాన్స్‌పోర్టర్లు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఎమ్మెల్యేదిగా ఆరోపిస్తున్న డంపింగ్ యార్డుకు బూడిద ఎలా వెళ్తుందో అర్థంకాని ప్రశ్న. లేని సమస్యను ఉన్నట్టుగా చూపే ప్రయత్నం చేయటం, దానిపై రాజకీయం చేయటం ద్వారా మైలవరం నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్యను తీసుకొస్తున్నారు. జెన్‌కో నిర్ణయంతో ఉచిత బూడిద లోడింగ్ లేక తమకు న్యాయం చేయాలంటూ ఓపక్క స్థానిక ట్రాన్స్‌పోర్టర్లు బూడిద కాలుష్య పీడిత గ్రామాల్లో ప్రజలు, పార్టీల మద్దతు కూడగడుతుండగా, వారికి సంఘీభావం ఇవ్వకుండా, ఉద్యమంలో నేరుగా పాల్గొనకుండా జోగి ఇలా కుటిల రాజకీయాలకు తెరలేపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.