Share News

శాతవాహనలో ధనకార్యాలు

ABN , Publish Date - Jun 17 , 2025 | 01:24 AM

శాతవాహన కళాశాలలో ‘ధన’కార్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కంచే చేను మేసినట్టుగా సొసైటీలోని కొందరు కళాశాలను అడ్డం పెట్టుకుని భారీగానే దోచేశారు. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన వారే డబ్బుకు కక్కుర్తి పడి సర్టిఫికెట్లను అమ్ముకోడానికి ప్రయత్నించారు. కళాశాల నిర్వహణలో కీలకస్థానంలో ఉన్న షాడో ఒకరు అన్నీ తానై పాల్పడిన ఈ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

శాతవాహనలో ధనకార్యాలు
శాతవాహన కళాశాలలో శిథిలాలు

సొసైటీలోని అవినీతి ముఠా అక్రమాలు

ఓ షాడో చుట్టూ తిరుగుతున్న కథలు

డిగ్రీ సర్టిఫికెట్ల పేరిట రూ.5 లక్షల వసూలు

సర్టిఫికెట్లు ఇవ్వకపోవటంతో రచ్చ.. కాళ్లబేరం

కళాశాల బాధ్యుడు ప్రజాపతిరావు డిజిటల్‌ సిగ్నేచర్‌తో దొంగపనులు

నూజివీడులో స్థలం కొనుగోలులోనూ అక్రమాలు

కమర్షియల్‌ మాల్‌ ఏర్పాటు కోసం బయటి వారితో డీల్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : శాతవాహన కళాశాల వ్యవస్థాపకులు.. సొసైటీ బాధ్యతలను ప్రజాపతిరావుకు అప్పగించాక కొంతకాలం వరకు బాగానే సాగింది. ప్రజాపతిరావు వృద్ధాప్యంలోకి రావటంతో ఆయన నమ్మిన ఓ షాడో ఎంచక్కా సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. కళాశాల నిర్వహణకు నిధులు అవసరమంటూ అప్పులు తీసుకొచ్చి లెక్కలు చూపటం ప్రారంభించారు. ఏవేవో అవసరాలు చెప్పి ప్రజాపతిరావు నుంచి రూ.లక్షలు లాగేశారు. కళాశాల ప్రాంగణాన్ని ఎగ్జిబిషన్లు, ఇతర కార్యక్రమాలకు అద్దెకు ఇస్తూ భారీగా సముపార్జించారు. కమిటీకి తక్కువ చూపి సింహభాగాన్ని తన జేబులో వేసుకున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కీలక వ్యక్తి ప్రజాపతిరావుతో పాటు ఒక ఏసీపీ, మరికొందరి భాగస్వామ్యంతో నూజివీడులో భూములు కొన్నారు. ప్రజాపతిరావు, ఏసీపీ కుటుంబ సభ్యుల పేర్లతో ఈ భూములు కొన్నారు. అయితే, ప్రజాపతిరావు తన కుటుంబం పేరుతో కొన్న భూమికి సంబంధించి ఫొటోను తారుమారు చేసి రిజిస్ర్టేషన్‌ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ స్థలం వివాదంలో చిక్కుకుంది. ఏసీపీతో పాటు ఇతరులు కూడా ఆ వివాదాన్ని ఇప్పటికీ పరిష్కరించుకోలేకపోయారు.

సర్టిఫికెట్ల పేరుతో హాంఫట్‌

డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తానని చెప్పి ఓ కల్చరల్‌ అసోసియేషన్‌ నిర్వాహకురాలి నుంచి ఈ షోడో రూ.5 లక్షలు తీసుకున్న అంశం వెలుగులోకి వచ్చింది. ఈ డబ్బును కూడా తాను సూచించిన వ్యక్తి ఖాతాలోకి నేరుగా బదిలీ చేయించుకోవటం గమనార్హం. కల్చరల్‌ అసోసియేషన్‌ నిర్వాహకురాలి సోదరి ఆ డబ్బును జమ చేశారు. అయితే, ఇచ్చిన హామీ ప్రకారం సర్టిఫికెట్లను ఇవ్వకపోవటంతో ఆ నిర్వాహకురాలు పంచాయితీ పెట్టారు. పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆమె సిద్ధం కావటంతో కాళ్ల బేరానికి వచ్చిన ఆ షాడో సదరు మహిళకు రూ.లక్ష డబ్బు ఇప్పించినట్టు సమాచారం.

అక్రమాలు అనేకం

ప్రజాపతిరావు వృద్ధాప్యాన్ని అడ్డం పెట్టుకుని సొసైటీలో నకిలీ సభ్యత్వాలు కల్పించటం, వారితో కలిసి సొసైటీ నిధుల దుర్వినియోగానికి ఈ షాడో పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రజాపతిరావు డిజిటల్‌ సిగ్నేచర్‌ను క్యాప్చర్‌ చేసి, తన దగ్గరే ఉంచుకుని అనేక అక్రమాలకు పాల్పడినట్టు చెబుతున్నారు. సొసైటీ నిధుల దుర్వినియోగం దగ్గర నుంచి డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తామని మోసం చేయటం, ఏకంగా శాతవాహన కళాశాలను మూసివేసి డెవలప్‌మెంట్‌కు ఇచ్చుకునే ఆలోచన చేయడం గమనార్హం. ఈ ఆలోచనను అమల్లోకి తీసుకురావటానికి సొసైటీలో బలంగా ఉన్న ఓ నేతను కూడా ఒప్పించేందుకు ఆయన పథక రచన చేయటం విడ్డూరం. ఈ నేత గతంలో ‘శాతవాహన’పై కన్నేశారు. ఆయన సభ్యత్వంపై కూడా వివాదం ఉంది. ఇన్ని గొడవల నేపథ్యంలో తాననుకున్న ఆలోచనను అమలు చేయటానికి సదరు నేతతో ఈ షాడో సంప్రదింపులు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కిడ్నాప్‌ డ్రామా సృష్టించింది కూడా షాడోనేనని సమాచారం.

డెవలప్‌మెంట్‌ మాయ

శాతవాహన స్థలాన్ని మరికొందరితో కలిసి స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు షాడో అతిపెద్ద మోసానికి తెరతీశారు. ప్రజాపతిరావు డిజిటల్‌ సిగ్నేచర్‌ను వాడుకుని కోర్టును కూడా తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. కోర్టుకు ఇచ్చిన లేఖ తనది కాదని ప్రజాపతిరావు బహిరంగంగా చెబుతున్నారు. శాతవాహన కళాశాల స్థలంలో కొంత తమదని వాదిస్తున్న వారితో ఈ షాడో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. తద్వారా శాతవాహన కళాశాల స్థలం మొత్తం డెవలప్‌మెంట్‌కు ఇచ్చుకోవచ్చన్నది ఎత్తుగడ. నగరంలో ఓ మాల్‌ నిర్వాహకుడితో చేతులు కలిపి డీల్‌ కూడా కుదుర్చుకున్నట్టు సమాచారం. శాతవాహన కళాశాలలో జరిగిన ఈ అక్రమాలన్నింటిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jun 17 , 2025 | 01:24 AM