విజ్ఞానమా? విలాసమా?
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:39 AM
నగరాభివృద్ధికి నిధుల కేటాయింపునకు దిక్కులు చూస్తున్న కార్పొరేషన్‌లోని వైసీపీ పాలకపక్షం రూ.కోట్లు ఖర్చుపెట్టి విజ్ఞాన యాత్రలకు మాత్రం సిద్ధమవుతోంది. కార్పొరేటర్ల విజ్ఞాన యాత్ర పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇలా యాత్రలకు వెళ్లినవారు అక్కడ చూసిన అభివృద్ధి, ఇతర అంశాలను నగరంలో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అంటే ప్రశ్నార్థకమే. విజ్ఞానయాత్ర అంటూ విహార యాత్రలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
విజ్ఞానయాత్రల పేరిట కార్పొరేటర్ల విలాసాలు
ఏడాదిలో మూడుసార్లు పర్యటనలు
ఒక్కోసారి రూ.60 లక్షలు ఖర్చు
పైగా ఎలక్ర్టిక్ పరికరాల కొనుగోలు
తిరిగొచ్చి చేసిందేమీ లేదు..!
కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
రేపటి యాత్రకు బ్రేక్
(ఆంధ్రజ్యోతి, కార్పొరేషన్) : నగరాభివృద్ధికి నిధుల కేటాయింపునకు దిక్కులు చూస్తున్న కార్పొరేషన్‌లోని వైసీపీ పాలకపక్షం రూ.కోట్లు ఖర్చుపెట్టి విజ్ఞాన యాత్రలకు మాత్రం సిద్ధమవుతోంది. కార్పొరేటర్ల విజ్ఞాన యాత్ర పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇలా యాత్రలకు వెళ్లినవారు అక్కడ చూసిన అభివృద్ధి, ఇతర అంశాలను నగరంలో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అంటే ప్రశ్నార్థకమే. విజ్ఞానయాత్ర అంటూ విహార యాత్రలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇన్ని టూర్లా..?
ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి 15 రోజులు వివిధ ప్రాంతాలకు సుమారు 40 మంది కార్పొరేటర్లు వెళ్లారు. దాని నిమిత్తం సుమారు రూ.60 లక్షలు ఖర్చు చేశారు. ఇకపై యాత్ర ఉండదంటూ గత ఆగస్టులో కార్పొరేటర్లంతా ఎలక్ర్టికల్ పరికరాలు కొన్నారు. వాటి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుంది. పట్టుమని రెండు నెలలు గడవక ముందే మళ్లీ విజ్ఞానయాత్ర అంటూ పలువురు కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీలో ప్రతిపాదన పెట్టి ఆమోదించుకున్నారు. కాగా, ఏడాదిలో మూడుసార్లు యాత్రలేమిటంటూ నగరవాసులు మండిపడుతున్నారు. నగరాభివృద్ధికి సకాలంలో బిల్లులు చెల్లించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు, కార్పొరేటర్లు విజ్ఞాన యాత్రలు అనగానే వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటాన్ని విమర్శిస్తున్నారు. ఏప్రిల్‌లో సుమారు 40 మంది యాత్రకు వెళ్లగా, పదిమంది వెనక్కి వచ్చారు. దానివల్ల అదనంగా సొమ్ము ఖర్చు అయ్యింది. నగరాభివృద్ధికి దోహదపడేలా కాకుండా, ఒకరిపై ఒకరు గొడవలు పడి మధ్యలోనే వెనక్కి వచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
ఈసారి యాత్రకు బ్రేక్
ఈనెల 6న విజ్ఞాన యాత్ర వెళ్లేందుకు కార్పొరేటర్లు మరోసారి సిద్ధమయ్యారు. ప్రజల నుంచి విమర్శలు రావడంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకండా వైసీపీ కార్పొరేటర్లు ఏకపక్షంగా వ్యవహరించడంతో యాత్రపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈ యాత్రకు బ్రేక్ వేశారు. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుంది. వైసీపీకి చెందిన ఓ కార్పొరేటర్ స్వలాభం, కమీషన్ల కోసం విజ్ఞాన యాత్ర అంశాన్ని తీసుకొచ్చి ఆమోదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు కమిషనర్‌తో పాటు అధికారులపై మండిపడినట్లు సమాచారం. ప్రజాధనాన్ని ఈవిధంగా దుర్వినియోగం చేయటం ఏమిటని ప్రశ్నించడంతో యాత్రకు బ్రేక్ పడిందని తెలిసింది.