తొలగింపు తాత్సారం
ABN , Publish Date - May 17 , 2025 | 01:33 AM
నగరంలోని పూల మార్కెట్ తరలింపుపై సందిగ్ధం ఏర్పడింది. కీలకమైన ప్రాంతంలో ట్రాఫిక్‌కు అవరోధంగా మారడం, స్థలం రైల్వేది కావడం, కృష్ణా పుష్కరాల నాటికి దీనిని ఖాళీ చేయించాలనే ప్రతిపాదనలు ఉండటం, విజయవాడ-గూడూరు థర్డ్‌లైన్, మెట్రో కారిడార్ దీని పక్క నుంచే వెళ్తుండటంతో మార్కెట్ తరలింపు అనివార్యంగా మారింది. తమకు ప్రత్యామ్నాయం చూపించి, షాపులు తొలగించాలని వ్యాపారులు కోరుతున్నా కార్పొరేషన్ అధికారులు మాత్రం తాత్సారం ప్రదర్శిస్తున్నారు.
హోల్‌సేల్ పూల మార్కెట్ తరలింపులో కార్పొరేషన్ నిర్లక్ష్యం
రైల్వేస్థలంలో నిర్మాణం.. నోటీసులు ఇచ్చిన రైల్వే అధికారులు
థర్డ్‌లైన్ పనులు, మెట్రో కారిడార్, పుష్కరాల నేపథ్యంలోనే..
నగర నడిబొడ్డులో ట్రాఫిక్‌కు ప్రధాన అవరోధం
ప్రత్యామ్నాయం చూపిస్తే వెళ్లిపోతామంటున్న వ్యాపారులు
పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ పక్కన, విజయవాడ మెయిన్ రైల్వేలైన్ వెంబడి, రాజీవ్‌గాంధీ పార్కు వెనుక భాగంలో, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి దగ్గరగా రైల్వేస్థలంలో హోల్‌సేల్ పూల మార్కెట్ ఉంది. దీనిని 2004లో కార్పొరేషన్ అధికారులు నిర్మించారు. దశాబ్దం కిందట ఈ పూల మార్కెట్ రాష్ట్రంలోనే ఓ వెలుగు వెలిగింది. విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడికి వచ్చి పూలను పెద్ద ఎత్తున కొనేవారు. విజయవాడ విస్తరించటంతో ఈ మార్కెట్ సృష్టిస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉంది.
ఖాళీ చేయాలని రైల్వే ఆదేశాలు
రైల్వే ఆక్రమిత స్థలంలో కార్పొరేషన్ అధికారులు హోల్‌సేల్ పూల మార్కెట్‌ను నిర్మించటంతో అప్పట్లో సమస్యలు ఏర్పడ్డాయి. తమ స్థలంలో పూల మార్కెట్‌ను నిర్మించారని 2017వ సంవత్సరంలో రైల్వే అధికారులు కార్పొరేషన్‌కు నోటీసులిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్ తరలింపుపై తరచూ రైల్వే అధికారులు కార్పొరేషన్‌కు నోటీసులు ఇస్తూనే ఉన్నారు. ఏడాది కిందట రైల్వే అధికారులు కార్పొరేషన్‌కు నోటీసులు ఇస్తూ.. ఈసారి తరలించకపోతే కూల్చివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏడాది గడిచినా చర్యలు తీసుకోకపోవడంతో రైల్వేశాఖ కార్యాచరణలోకి దిగుతోంది. ఇప్పటికే ఆర్టీసీ ఆక్రమణలు తొలగించి భారీ గోడను నిర్మిస్తున్న రైల్వే.. రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌ను కూడా తరలించింది. ఇక మిగిలింది పూల మార్కెట్ ఒక్కటే.
ప్రత్యామ్నాయంగా పలు ప్రాంతాలు
తమకు ప్రత్యామ్నాయంగా స్థలం చూపించి, షాపులు ఏర్పాటుచేసి ఇవ్వాలని హోల్‌సేల్ మార్కెట్‌లోని దుకాణదారులు, అసోసియేషన్ నేతలు కార్పొరేషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ, ఈ విషయాన్ని కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవట్లేదు. గాంధీనగర్ రైతుబజార్ వద్ద తమకు స్థలం కేటాయించాలని కోరుతున్నా స్పందన లేదు. సింగ్‌నగర్ ఎక్సెల్ ప్లాంట్ వద్ద ఇస్తామని కార్పొరేషన్ చెబుతున్నా.. అక్కడ మూడు శ్మశానాలు ఉండటంతో సెంటిమెంట్‌గా పూలు కొనటానికి ఎవరూ రారని వ్యాపారులు వాదిస్తున్నారు. చివరికి ఈ వ్యవహారం రాజకీయ నేతల వరకూ వెళ్లగా, కొందరు నాయకులు బేరాలు పెట్టారు. ఈ మార్కెట్‌కు పాములకాల్వ వద్ద రెండెకరాల స్థలం ఉంది. అక్కడ మార్కెట్ ఏర్పాటు చేస్తే.. గిట్టుబాటు ఉండదని వ్యాపారులు అంటున్నారు. నగరంలోని మహిళలు అంతదూరం రారని చెబుతున్నారు. అలాగే, ఈ మార్కెట్‌లో గతంలో షాపులు అమ్ముకున్న కొందరు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు కలిసి కృష్ణానది అవతల, కృష్ణా కరకట్ట దిగువన 90 షాపులతో కూడిన మార్కెట్ ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ కరకట్టకు దిగువన ఉండటం క్షేమం కాదని, అక్కడికి వెళ్లడానికి కూడా వ్యాపారులు ఇష్టపడట్లేదు.
తొలగింపు అవసరమే..
పూల మార్కెట్‌ను తొలగించటం రైల్వే అధికారులు అత్యవసరం. ఎందుకంటే విజయవాడ-గూడూరు మూడోలైన్ పనులను కృష్ణా కెనాల్ జంక్షన్ దాటి విజయవాడ రైల్వేస్టేషన్ వరకు జరపాలంటే మార్కెట్‌ను తొలగించాల్సి ఉంటుంది. కిందటి కృష్ణా పుష్కరాల సందర్భంలో ఈ మార్కెట్‌ను తరలించటానికి కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. గాంధీనగర్ రైతుబజార్ ప్రాంతంలోకి తరలించేందుకు సిద్ధమైంది. అప్పట్లో హోల్‌సేల్ మార్కెట్ అసోసియేషన్‌లో సభ్యుల మధ్య ఐక్యత లేకపోవటంతో అడుగు ముందుకు పడలేదు. పుష్కరాలు సమీపించే సమయానికి కార్పొరేషన్ ఈ అంశాన్ని వదిలేసింది. మరో మూడేళ్లలో మళ్లీ కృష్ణా పుష్కరాలు రానున్నాయి. ఏడాది ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చే రెండేళ్లలోనే దీనిని తరలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మెట్రోరైల్ కారిడార్ కూడా ఈ పూల మార్కెట్ సమీపం నుంచే కృష్ణా కెనాల్ జంక్షన్‌కు వెళ్తుంది. కాబట్టి త్వరలోనే ఈ మార్కెట్‌ను తరలించాల్సిన అవసరముంది.