Share News

రూ.3.50 కోట్ల విలువైన కార్పొరేషన్‌ స్థలం హాంఫట్‌

ABN , Publish Date - May 22 , 2025 | 12:58 AM

కార్పొరేషన్‌కు చెందిన దాదాపు 450 చదరపు గజాల స్థలం, ఇల్లు ప్రైవేట్‌ వ్యక్తుల పరమయ్యాయి. కృష్ణలంకలో రూ.3.50 కోట్ల విలువచేసే ఈ ఇంటికి ఎదురింటి డోర్‌ నెంబర్‌ తెప్పించడంతో పాటు విద్యుత, మంచినీరు కనెక్షన్లు తెచ్చుకుని మరీ యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఈ వ్యవహారంలో స్థానిక వైసీపీ మాజీ కార్పొరేటర్‌ హస్తం ఉందని తెలుస్తోంది.

రూ.3.50 కోట్ల విలువైన కార్పొరేషన్‌ స్థలం హాంఫట్‌
డొంకరోడ్డులో ఆక్రమణకు గురైన కార్పొరేషన్‌ స్థలం, ఎన్‌హెచ్‌కు చెందిన ఇల్లు

కృష్ణలంక డొంకరోడ్డులోని స్థలం, ఇల్లు ప్రైవేట్‌పరం

వారధి నిర్మాణ సమయంలో ఎన్‌హెచ్‌కు ఇచ్చిన కార్పొరేషన్‌

450 చ.గ స్థలంలో వాచ్‌మెన్‌కు ఇల్లు నిర్మాణం

ఆ తర్వాత ప్రైవేట్‌ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిన భవనం

ఎదురింటి డోరు నెంబరుతో కరెంట్‌, మంచినీరు, ఇంటిపన్ను

చక్రంతిప్పిన వైసీపీ మాజీ కార్పొరేటర్‌

చోద్యం చూస్తున్న కార్పొరేషన్‌, ఎన్‌హెచ్‌ అధికారులు

కృష్ణలంక, మే 21 (ఆంధ్రజ్యోతి) : కనకదుర్గమ్మ వారధి నిర్మాణ సమయంలో మెటీరియల్‌ను ఉంచేందుకు గాను కార్పొరేషన్‌కు చెందిన కృష్ణలంక నెహ్రూనగర్‌ డొంకరోడ్డులోని దాదాపు 450 చదరపు గజాల స్థలాన్ని జాతీయ రహదారుల శాఖకు అప్పగించారు. ఆ స్థలంలో ఎన్‌హెచ్‌ అధికారులు ఇల్లు నిర్మించి అందులో వాచ్‌మెన్‌ను నియమించారు. ఆ వాచ్‌మెన్‌ వెళ్లిపోయాక ఈ ఇంటిలోకి ప్రైవేట్‌ వ్యక్తులు చొరబడ్డారు. జాతీయ రహదారుల శాఖలో ప్రాజెక్ట్‌ డైరెక్టరుగా పనిచేసిన ఓ అధికారిని మచ్చిక చేసుకుని ఈ తతంగం నడిపారు. వైసీపీకి చెందిన మాజీ కార్పొరేటర్‌ పల్లెం రవికుమార్‌ ద్వారా ఎదురింటి డోర్‌ నెంబర్‌ 41-1/12-14ను వేయించి సదరు ప్రైవేట్‌ వ్యక్తులు ఆ ఇంటిని ఆక్రమించారు. కరెంట్‌, మంచినీరు, ఇంటిపన్ను సృష్టించుకున్నారు. కారు పెట్టుకునేందుకు వీలుగా రేకులతో ప్రహరీ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు.. ఇంటి ఎదురు రోడ్డుపై పూలకుండీలు కూడా పెట్టారు. దీనిపై స్థానికులు నిలదీయగా, జాతీయ రహదారుల శాఖ తమకు రిజిస్ర్టేషన్‌ చేసిందని చెప్పారు. ఒకే రోడ్డులో రెండు ఇళ్లకు ఒకే డోరు నెంబరు తీసుకురావటంలో మాజీ కార్పొరేటర్‌ పల్లెం రవికుమార్‌ చక్రం తిప్పాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన సహకారంతోనే ప్రభుత్వ ఇంటికి ఎదురింటి డోరు నెంబరుతో ఇంటిపన్ను, విద్యుత, మంచినీటి కనెక్షన్‌ తీసుకున్నారు.

పట్టించుకోని అధికారులు

20వ డివిజన్‌లో కమ్యూనిటీ హాల్‌ నిర్మించేందుకు ఇది అనువైన స్థలమని స్థానిక నాయకులు గుర్తించారు. అయితే, ఇది కార్పొరేషన్‌ది కాదని, జాతీయ రహదారులది కాదని, తమ పేరున రిజిస్టరై ఉందని ఆక్రమణదారులు వాదించడంతో ఈ వ్యవహారం బయటపడింది. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు, భవనాలు ఇలా ప్రైవేట్‌పరమవుతున్నా అటు కార్పొరేషన్‌ అధికారులు కానీ, ఇటు జాతీయ రహదారుల శాఖ అధికారులు కానీ పట్టనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం..

ఆ స్థలం రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. జాతీయ రహదారుల శాఖ వాచ్‌మెన్‌ అందులో ఉంటున్నారు అంటే.. అది ఇంకా కార్పొరేషన్‌ చేతికి వచ్చి ఉండదు. మా పరిధిలోనిది అయితే చర్యలు తీసుకుంటాం. కాకపోతే కమిషనర్‌కు చెప్పి చర్యలు తీసుకుంటాం. గత కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ జాతీయ రహదారుల శాఖకు ఆ స్థలాన్ని అప్పగించాల్సిందిగా లేఖ రాసిన విషయం నాకు తెలియదు.

- సంజయ్‌ రత్నకుమార్‌, చీఫ్‌ సిటీప్లానర్‌

Updated Date - May 22 , 2025 | 12:58 AM