‘బీపీ’ఎస్
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:49 AM
కృష్ణాజిల్లాలో ధాన్యం సేకరణకు తీసుకునే వాహనాల విషయంలో వాహన యజమానులు, రవాణా అధికారుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జీపీఎస్ ఉన్న వాహనాలే సమకూర్చాలని నిర్ణయించడంతో సమస్య మొదలైంది.
ధాన్యం సేకరణకు వాహనాల ఎంపికలో రచ్చ
జీపీఎస్ ఉన్న వాహనాలే చూడాలని ఉన్నతాధికారుల ఆదేశాలు
క్షేత్రస్థాయిలో జీపీఎస్ ఉన్న వాహనాలు లేని పరిస్థితి
సొంత ఖర్చుతో ఏర్పాటు చే సుకోవాలని యజమానులకు సూచన
వాహనాలు తీసుకోవడమే కాక ఈ గొడవ ఏంటని యజమానుల ఆగ్రహం
సమస్యను జేటీసీకి తెలియజేసేందుకు సిద్ధమవుతున్న రవాణా ఇన్‌స్పెక్టర్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కృష్ణాజిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ఉన్న వాహనాలను సమకూర్చాలని రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (జేటీసీ)కు ఆదేశాలు అందాయి. కానీ, క్షేత్రస్థాయిలో రవాణా శాఖ అధికారులకు జీపీఎస్‌తో కూడిన వాహనాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. జీపీఎస్ పరికరాల ఖర్చుపై జిల్లా యంత్రాంగం నుంచి స్పష్టత లేకపోవటంతో వాటిని యజమానులే ఏర్పాటు చేసుకోవాలని రవాణా అధికారులు నిర్దేశిస్తున్నారు. ‘అవసరానికి మా వాహనాలను బలవంతంగా తీసుకోవటమే కాకుండా.. జీపీఎస్‌లు ఏర్పాటు చేయమంటారా..’ అంటూ వాహన యజమానులు రవాణా ఇన్‌స్పెక్టర్లపై ఎదురు తిరుగుతున్నారు. ఈ పరిణామంతో ఇక తమ వల్ల కాదని రవాణా ఇన్‌స్పెక్టర్లు.. జేటీసీని కలిసి విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు.
వివాదాలు ఇలా..
ప్రతి సీజన్‌లోనూ ధాన్యం సేకరించే సందర్భంలో వాహనాలను సమకూర్చే బాధ్యతలను జిల్లా ఉన్నతాధికారులు రవాణా అధికారులకు అప్పగిస్తుంటారు. రవాణా అధికారులు ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు, లారీలను తీసుకుంటారు. రైతు సేవాకేంద్రాల నుంచి కస్టమ్ మిల్స్‌కు ధాన్యాన్ని పంపటానికి ఈ వాహనాలను వినియోగిస్తారు. ఈసారి జీపీఎస్‌తో కూడిన వాహనాలను తీసుకోమని కృష్ణాజిల్లా యంత్రాంగం నిర్దేశించటంతో సమస్య మొదలైంది. చిన్న, మధ్య తరహా లారీలు, ట్రాలీ ట్రాక్టర్లకు చాలావరకు జీపీఎస్‌లు ఉండవు. నిర్దేశిత మిల్లులకు వెళ్తున్నాయా, లేదా అనేది తెలుసుకోవాలంటే కచ్చితంగా జీపీఎస్ అవసరం. ఇలాంటి సందర్భంలో జీపీఎస్ పరికరాలను జిల్లా యంత్రాంగమే ఏదైనా ఏజెన్సీకి అప్పగించి తీసుకున్న వాహనాలకు ఏర్పాటు చేయించాలి. అలాకాకుండా యజమానులే జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశిస్తుండటం వివాదాలకు కారణమవుతోంది.
మండలానికి 150 వాహనాల సమీకరణ
కృష్ణా జిల్లావ్యాప్తంగా ప్రతి మండలానికి 150కు తగ్గకుండా వాహనాలను సమకూర్చాలని జిల్లా యంత్రాంగం రవాణా శాఖకు నిర్దేశించింది. అవనిగడ్డ, నాగాయలంక వంటి మండలాల్లో వాహనాలను సేకరించటం అధికారులకు కష్టంగా మారింది. సాధారణంగా జీపీఎస్ పరికరాలను జిల్లా యంత్రాంగమే ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు ఇదే జరిగింది. అలాకాకుండా రవాణా అధికారులకు ఖర్చుపై స్పష్టత ఎందుకు ఇవ్వట్లేదో అర్థంకాని పరిస్థితి. ఫలితంగా క్షేత్రస్థాయిలో వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
జేటీసీ వద్దకు..
వాహనాల సేకరణ విషయంలో జీపీఎస్ పరికరాల ఏర్పాటుకు సంబంధించి యజమానులతో తలెత్తుతున్న గొడవల వల్ల తాము పడుతున్న ఇబ్బందులను జేటీసీకి వివరించేందుకు రవాణా ఇన్‌స్పెక్టర్లు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల్లో ఆయన్ను కలిసి వ్యవహారం తేల్చాల్సిందిగా కోరనున్నారు.