Share News

జల జగడం

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:11 AM

సరఫరా చేసిన మంచినీటికి బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్‌.. సరఫరా చేయని నీటికి బిల్లులు ఎందుకు ఇస్తామని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల మధ్య వాదన జల జగడాన్ని సృష్టిస్తోంది. వర్కర్లకు కాంట్రాక్టర్‌ వేతనాలు నిలుపుదల చేయడంతో వారంతా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఇబ్రహీంపట్నం హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ పరిధిలోని ఈ వివాదం కారణంగా 120 గ్రామాల పరిధిలోని 3 లక్షల మంది మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.

జల జగడం
ఇబ్రహీంపట్నం హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న కార్మికులు

ఇబ్రహీంపట్నం హెడ్‌ వాటర్‌ వర్క్స్‌లో వివాదం

బిల్లులు ఇవ్వలేదంటున్న కాంట్రాక్టర్‌

సరఫరా చేయని నీటికి ఎలా ఇస్తామంటున్న అధికారులు

పనివారికి జీతాలు నిలుపుదల చేసిన కాంట్రాక్టర్‌

4 నెలల జీతాలు రాకపోవడంతో కార్మికుల ఆందోళన

120 గ్రామాల పరిధిలో 3 లక్షల మందికి మంచినీటి ఇక్కట్లు

(ఆంరఽధజ్యోతి, విజయవాడ) : ఇబ్రహీంపట్నం హెడ్‌వాటర్‌ వర్క్స్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, ఏ.కొండూరు మండలాలకు చెందిన మొత్తం 120 గ్రామాలకు రక్షిత మంచినీరు అందుతోంది. ఈ హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ కాంట్రాక్టును ఓ ప్రైవేట్‌ సంస్థకు ఓఅండ్‌ఎం కింద అప్పగించారు. ఈ కాంట్రాక్టు సంస్థ నాలుగు నెలలుగా తమ దగ్గర పనిచేసే పనివారికి జీతాలు ఇవ్వట్లేదు. దీంతో కార్మికులంతా సోమవారం మెరుపు సమ్మెకు దిగారు. హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వద్ద ధర్నా చేపట్టారు. అక్కడే బైఠాయించి నిరవధిక ఆందోళన చేపట్టారు. దీంతో హెడ్‌వాటర్‌ వర్క్స్‌ పరిధిలోని గ్రామాల పరిధిలో మంచినీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ గ్రామాల పరిధిలో నివసించే 3 లక్షల మంది ప్రజలు ఇప్పటికే మంచినీటి కోసం కష్టాలు పడుతున్నారు. కార్మికుల ఆందోళనలు కొనసాగితే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జీతాలిచ్చే వరకు తాము పనిచేసేది లేదని కార్మికులు చెబుతున్నారు. తమకు బిల్లులు రానందున జీతాలు ఇవ్వలేమని కాంట్రాక్టు సంస్థ చెబుతోంది.

కాంట్రాక్టు సంస్థ సమాధానం ఇలా..

ఇబ్రహీంపట్నం, కవులూరు, జి.కొండూరు గ్రామాలకు ఇవ్వాల్సిన మంచినీటి పరిమాణం కంటే ఎక్కువగా పంపిణీ చేశామని కాంట్రాక్టు సంస్థ చెబుతోంది. అయితే, దానికి సంబంధించి కూడా ఎలాంటి రికార్డులు లేవని తెలుస్తోంది. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు బిల్లులకు ఒప్పుకోవట్లేదని సమాచారం. వైసీపీ హయాంలో జరిగిన ఈ కాంట్రాక్టు సంస్థ బాగోతాల సమాచారం ప్రస్తుత కూటమి ప్రభుత్వం వద్ద ఉంది. దీంతో రికార్డుల్లేని మంచినీటి పంపిణీకి సంబంధించి ప్రస్తుతం బిల్లులు రాయటానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు సాహసించట్లేదు.

గతంలోనూ వివాదం

ప్రస్తుత కాంట్రాక్టు సంస్థపై ఇంతకుముందు కూడా పలు ఆరోపణలు వచ్చాయి. గతంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌ ఆ కాంట్రాక్టు సంస్థకు రూ.2 కోట్ల జరిమానా కూడా విధించారు. గతంలో మొత్తం 95 మంది పనివారు ఉండాల్సి ఉండగా, కేవలం 48 మందినే విధుల్లో ఉంచారని, మరమ్మతుల సమయంలో కూడా మంచినీటిని పంపిణీ చేసినట్టు రికార్డు చేశారని ఆయన గుర్తించారు. క్లోరినేషన్‌ పరిమాణానికి లెక్కలు లేవని, హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ స్థలంలో భారీగా పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉండటాన్ని ఆయన గమనించారు. కాంట్రాక్టు సంస్థ బాధ్యతారాహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తప్పుడు రికార్డులను చూపినందుకు ఆయన ఆ జరిమానా విధించారు. నాటి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ, డీఈఈ, ఏఈలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిందటి వైసీపీ హయాంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జరిమానా సొమ్మును కూడా వసూలు చేయలేదు.

ఆర్‌డబ్ల్యూఎస్‌ వాదన ఇలా..

కార్మికుల ఆందోళనతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటర్‌ ఆడిటింగ్‌ నిర్వహిస్తోంది. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మంచినీటి పంపిణీలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇబ్రహీంపట్నం హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ పరిధిలో రికార్డు చేయని వాటికి కూడా కాంట్రాక్టు సంస్థ బిల్లులు అడుగుతోందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికార వర్గాలు చెబుతున్నాయి. నిర్దేశిత లక్ష్యంలో 20 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయకుండానే.. సరఫరా చేసినట్టుగా చెబుతున్నారని, వీటికి ఎలాంటి రికార్డులు లేకుండా బిల్లులు చేయటం అసాధ్యమని అంటున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 01:11 AM