Share News

నేనింతే..

ABN , Publish Date - Jul 01 , 2025 | 01:10 AM

కోడిపందేలు జరిగితే.. ‘కోళ్లే కదా.. కొట్టుకు చస్తాయిలే..’ అంటారు. అధికారులు నివేదిక అడిగితే.. ‘చూద్దాంలే..’ అని సాగదీస్తారు. ఆరోపణలు ఉన్న సిబ్బందికి.. ‘నేనున్నాను లే..’ అని అభయమిచ్చేస్తారు. ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఓ ఇన్‌స్పెక్టర్‌ పనితీరుకు ప్రామాణికాలు ఇవన్నీ. ఆయన స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో)గా ఉన్న స్టేషన్‌లో సిబ్బందిపై నేరుగా డీజీపీకి ఫిర్యాదులు అందడంతో అక్కడ జరుగుతున్న బాగోతాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

నేనింతే..

వివాదాస్పదంగా విజయవాడ పశ్చిమ డివిజన్‌లోని ఓ ఇన్‌స్పెక్టర్‌ పనితీరు

ప్రతి ఫిర్యాదుకూ ఓ పిట్టకథ

అధికారులు నివేదిక కోరినా ఇవ్వని నిర్లక్ష్య వైఖరి

ఆరోపణలు ఉన్న సిబ్బందికి అండదండలు

ఇష్టులను స్టేషన్‌కు బదిలీ చేసుకోవడంలో ఘనాపాఠి

అధికారులను సైతం కాదని సొంత సిఫార్సులు

ప్రశ్నించిన అధికారులపై ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : విజయవాడ పశ్చిమ డివిజన్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో క్రైం నెంబరు 715/2022తో చీటింగ్‌ కేసు నమోదైంది. ఇందులో ఇద్దరు నిందితుల అరెస్టు పెండింగ్‌లో ఉంది. పెండింగ్‌ కేసు లెక్కలను తగ్గించే క్రమంలో ఈ కేసు బయట పడింది. ఈ కేసులో ఏ3గా పెనుమర్తి సూర్యకుమారి, ఏ4గా తొట్టెంపూడి వరలక్ష్మి అరెస్టు పెండింగ్‌లో ఉంది. ఓ మహిళా ఎస్‌ఐ తన వద్ద పనిచేసే కానిస్టేబుల్‌తో వారిని స్టేషన్‌కు రమ్మని కబురు పంపారు. వారికి 41ఏ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. కేసులో స్టేషన్‌కు పిలిపించకుండా ఉండేందుకు ఓ మహిళ నుంచి కొంతమొత్తంలో మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ డబ్బు తీసుకున్నారు. ఆ మహిళ జోలికి వెళ్లడం మానేసిన పోలీసులు రెండో మహిళను టార్గెట్‌ చేశారు. జరిగిన విషయమంతా ఆమెకు తెలియడంతో డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఆయన దీనిపై పోలీసు కమిషనర్‌కు ఫోన్‌చేసి అడిగారు. జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని సీపీ సంబంధిత ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఆదేశాలు ఇచ్చి రెండు రోజులు గడిచినా ఆ ఇన్‌స్పెక్టర్‌ ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. పైగా ఆ మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకుని పోలీసు కమిషనర్‌ కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు నివేదిక అడిగితే ఆ విషయం చూడకుండా, డీజీపీకే ఫిర్యాదులు వెళ్లిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను భుజాన వేసుకోవడానికి వెనుక కారణం ఏమిటని కమిషనరేట్‌ అధికారులు ఆలోచించడం మొదలుపెట్టారు. కాగా, ఈ నెల మొదట్లో ఆ మహిళా ఎస్‌ఐ రాత్రిపూట గస్తీలో ఉండగా, 50 బస్తాల ప్రజా పంపిణీ బియ్యాన్ని తీసుకెళ్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఈ విషయం ఏసీపీకి తెలిసి ఆ కేసు గురించి అడిగారు. దానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ఏసీపీకి అందజేయలేదు. వాస్తవానికి పోలీసులు ప్రజా పంపిణీ బియ్యాన్ని పట్టుకున్నప్పుడు సివిల్‌ సప్లయిస్‌ అధికారులకు అప్పగించాలి. తర్వాత వారు దీనిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఆ మహిళా ఎస్‌ఐ పట్టుకున్న వాహనం విషయంలో ఈ రెండూ జరగలేదని తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు కేసు నమోదైన దాఖలాలు కూడా లేవు.

పట్టుబట్టి బదిలీ

ఇటీవల ఓ క్రైం ఎస్‌ఐ ఉన్నట్టుండి ఆ పోలీసు స్టేషన్‌కు బదిలీపై వెళ్లారు. ఈ బదిలీని అధికారులంతా తిరస్కరించారు. అధికారులు ఆపినప్పటికీ ఆ ఎస్‌ఐ బదిలీని సాధించుకున్నారు. ఈ విషయం తెలిసి అధికారులకే మతిపోయింది. దీని వెనుక మొత్తం కథను సదరు ఇన్‌స్పెక్టర్‌ నడిపించాడు. ఆ క్రైం ఎస్‌ఐ ఓ ఇన్‌స్పెక్టర్‌కు మావయ్య అవుతారు. ఆ ఎస్‌ఐ పనిచేసిన అన్ని స్టేషన్లలో ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఈ ఫిర్యాదులన్నీ స్వయంగా అధికారులకు చేరాయి. ఎన్నికల ముందు పశ్చిమ డివిజన్‌లోని పోలీసు స్టేషన్‌లో నాలుగేళ్లు పనిచేశారు. తర్వాత ఉత్తర మండలానికి బదిలీ అయ్యారు. ఇక్కడ రెండు పోలీస్‌స్టేషన్లలో పనిచేశారు. ఉత్తర మండలంలో ఉన్న రెండు పోలీస్‌ స్టేషన్లలో ఆరోపణలు రావడంతో పశ్చిమ డివిజన్‌లో నగరం, గ్రామీణ ప్రాంతం విలీనమై ఉండే పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇక్కడున్న ఆ క్రైం ఎస్‌ఐను ఈ ఇన్‌స్పెక్టర్‌ ఏరికోరి మరీ తన స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ బదిలీ వద్దని సీపీ, ఏడీసీపీ, ఏసీపీ చెప్పారు. అయినా రాజకీయ బాణాన్ని ఉపయోగించి ఆరోపణలు ఉన్న క్రైం ఎస్‌ఐని తన స్టేషన్‌కు తెచ్చుకున్నారు. ఈ బదిలీకి ఓ ఎమ్మెల్యే బావమరిదితో సిఫార్సులు చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. జరిగిన తప్పుల గురించి తెలుసుకుని మందలిస్తే వారికి వెంటనే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధి నుంచి ఫోన్‌కాల్స్‌ వెళ్తుండటం గమనార్హం.

ట్రాఫిక్‌ ఆర్‌ఎస్‌ఐ విషయంలోనూ..

జాతీయ రహదారులు ఎక్కువగా ఉండే ఈ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడానికి ఇక్కడ ఓ ఆర్‌ఎస్‌ఐకి బాధ్యతలు అప్పగించారు. చలానాలు విధించడానికి ఆయన్ను కొంతమంది అధికారులు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఆ అధికారులను కలవని టిప్పర్లు, లారీల యజమానులే టార్గెట్‌గా చలానాలు వేయిస్తున్నారు. వారు వచ్చి కలిశాక చలానాల విధింపు ఆగిపోతోంది. దీనిపై ఫిర్యాదులు అందడంతో అక్కడి నుంచి ఆర్‌ఎస్‌ఐని అధికారులు బదిలీ చేశారు. ఈ బదిలీని నిలుపుదల చేయించడంలోనూ ఈ ఇన్‌స్పెక్టర్‌ పైచేయి సాధించడంతో కమిషనరేట్‌లో ఇతని తీరు చర్చనీయాంశమైంది.

Updated Date - Jul 01 , 2025 | 01:10 AM