Share News

చకచకా

ABN , Publish Date - May 04 , 2025 | 12:50 AM

అమరావతి పునర్నిర్మాణానికి ఇలా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారో లేదో.. అలా పనులు పురోగతిలోకి వస్తున్నాయి. తాజాగా గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ పరిధిలోనే రాజ్‌భవన్‌ నిర్మించాలని నిర్ణయించడం, వాటికి సంబంధించిన డిజైన్లపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో మంత్రి నారాయణ చర్చించడం, ఐకానిక్‌ భవనాలైన హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ టవర్ల ఇంటర్నల్‌ డిజైన్లపై నార్మన్‌ ఫోస్టర్స్‌, హఫీజ్‌ కాంట్రాక్టర్లు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో సమావేశం కావడంతో పనులు త్వరలోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

చకచకా
అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష

వేగంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు

గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ పరిధిలోనే రాజ్‌భవన్‌ నిర్మాణం

గవర్నర్‌తో మంత్రి నారాయణ చర్చలు

ఐకానిక్‌ భవనాల ఇంటర్నల్‌ డిజైన్లపైనా ప్రతిపాదనలు

నార్మన్‌ ఫోస్టర్స్‌, హఫీజ్‌ కాంట్రాక్టర్లు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో సమావేశం

విజయవాడ, మే 3 (ఆంధ్రజ్యోతి) : అమరావతిలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ (ఏజీసీ) పరిధిలోనే రాజ్‌భవన్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్‌భవన్‌ డిజైన్‌ ఎలా ఉండాలన్న దానిపై శనివారం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కలిసి చర్చించారు. రాజ్‌భవన్‌ ఎలా ఉండాలి? ఆర్కిటెక్చరల్‌ డిజైన్‌ ఎలా ఉంటే బాగుంటుంది? ఇంటీరియర్‌ స్ట్రక్చర్‌ ఎలా ఉండాలి? ఎన్ని రూములు ఏర్పాటు చేయాలి? సిబ్బంది ఎంతమంది ఉంటారు ? సమావేశాలకు, ఇతర అవసరాలకు అనుగుణంగా ఏమేం ఏర్పాటు చేయాలి? ఓపెన్‌ ఏరియా, గార్డెన్‌ వంటి సదుపాయాలకు సంబంధించి గవర్నర్‌ నుంచి మంత్రి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గవ ర్నర్‌ అబ్దుల్‌ న జీర్‌ కూడా కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం.

ఐకానిక్‌ భవనాల ఇంటర్నల్‌ డిజైన్లపై చర్చ

రాజధాని అమరావతిలో తలపెడుతున్న ఐకానిక్‌ భవనాలైన హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ టవర్ల ఇంటర్నల్‌ డిజైన్లు ఎలా ఉండాలన్న దానిపై శనివారం మంత్రి నారాయణ సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో నార్మన్‌ ఫోస్టర్స్‌, హఫీజ్‌ కాంట్రాక్టర్స్‌, ఎల్‌అండ్‌టీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఐదు ఐకానిక్‌ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ భవనాల్లో ఇంటర్నల్‌ డిజైన్లు ఎలా ఉండాలన్న దానిపైనా ఈ సమావేశం సాగింది. హైకోర్టు కాంప్లెక్స్‌లో ఎన్ని గదులు ఉండాలి? ఆర్కిటెక్చర్‌ ఎలా ఉండాలన్న దానిపై చర్చించారు. ఇంతకుముందే మంత్రి నారాయణ హైకోర్టు సీజేతో హైకోర్టు కాంప్లెక్స్‌కు సంబంధించి చర్చించారు. హైకోర్టు కాంప్లెక్స్‌లో 40 గదులు వస్తాయని మంత్రి నారాయణ చెప్పినపుడు, 52 గదులు కావాలని సీజే సూచించినట్టు సమాచారం. డిజైన్‌ను బట్టి అన్ని గదులు కష్టమని మంత్రి నారాయణ చెప్పగా, 48 గదులు కచ్చితంగా ఉండాలని సీజే చెప్పారని తెలుస్తోంది. సీజే వ్యక్తపరిచిన విధంగా హైకోర్టు కాంప్లెక్స్‌లో చేపట్టాల్సిన ఇటర్నల్‌ డిజైన్లు రూమ్స్‌పై నార్మన్‌ ఫోస్టర్స్‌ ప్రతినిధులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.

టవర్‌లోకి అనుమతిపై మంతనాలు

హైకోర్టు కాంప్లెక్స్‌పై సందర్శకుల కోసం టవర్‌ ఏర్పాటు ఉంటుంది. ఈ టవర్‌లోకి సందర్శకులకు అనుమతి ఉంటుంది కాబట్టి.. ఎంతవరకు వారికి భద్రతగా ఇవ్వాలి? ఎంత ఎత్తు వరకు సందర్శకులను అనుమతించవచ్చు? టవర్‌ ఎక్కటానికి ఎలివేటర్స్‌ ఎంతమేర ఏర్పాటు చేయాలి? వంటి అంశాలను చర్చించారు. అసెంబ్లీ భవనంలో అసెంబ్లీ, మండలితో పాటు లోపల ఎన్ని రూములు ఏర్పాటు చేయాలి? సమావేశ మందిరాలు, ఆర్కిటెక్చరల్‌ డిజైన్లు ఎలా ఉండాలి? ఎంతమంది సిబ్బంది ఉన్నారు? ఆయా సిబ్బందికి అనుగుణంగా విభాగాలను ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై చర్చించారు. సచివాలయ టవర్లకు సంబంధించి కూడా శాఖలు, సిబ్బందికి అనుగుణంగా లోపల భాగాన్ని ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై చర్చలు సాగాయి.

Updated Date - May 04 , 2025 | 12:50 AM