Share News

దీవులకు దారి

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:58 AM

అవనిగడ్డ నియోజకవర్గంలో దీవులుగా ఉన్న గ్రామాల రూపురేఖలు మారే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు పడవల మార్గం తప్ప ఎలాంటి రవాణా సౌకర్యం లేని దీవుల గ్రామాలకు రాచమార్గం రానుంది. ఇందుకు కృష్ణానదిపై హైలెవర్‌ వంతెన నిర్మించనున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

దీవులకు దారి
సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌తో కలెక్టర్‌ బాలాజీ, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌

కృష్ణానదిపై హైలెవల్‌ వంతెన నిర్మాణం

అవనిగడ్డలోని దీవుల రోడ్లకు అనుసంధానం

‘సాస్కీ’ నుంచి నిధుల కేటాయింపు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడి

జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష

విజయవాడ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : అవనిగడ్డ నియోజకవర్గంలో దీవులుగా ఉన్న గ్రామాల రూపురేఖలు మారే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు పడవల మార్గం తప్ప ఎలాంటి రవాణా సౌకర్యం లేని దీవుల గ్రామాలకు రాచమార్గం రానుంది. ఇందుకు కృష్ణానదిపై హైలెవర్‌ వంతెన నిర్మించనున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి, మొంథా తుఫానులో జరిగిన నష్టంపై కృష్ణాజిల్లా అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నదిపై నిర్మించే హైలెవల్‌ వంతెనకు దీవులు ఉన్న గ్రామాలను అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వ నిధులతో పాటు సాస్కీ పథకం నుంచి నిధులు మంజూరు చేస్తామని పవన్‌ వెల్లడించారు. కేంద్రప్రభుత్వ సాయంతో అవనిగడ్డ పరిధిలోని అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లను పునరుద్ధరిస్తామన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిన అభివృద్ధి పనులను త్వరలోనే మొదలుపెడతామని ఆయన హామీ ఇచ్చారు. ఏటిమొగ, ఎదురుమొండి హైలెవల్‌ వంతెన నిర్మాణాన్ని సాకారం చేస్తామన్నారు. హైలెవల్‌ బ్రిడ్జి కోసం ఇప్పటికే రూ.109 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయని ఆయన చెప్పారు. అలైన్‌మెంట్‌ మార్పుల కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ తెలిపారు. రూ.60 కోట్ల వరకు వ్యయం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

వైసీపీ నిర్లక్ష్యం వల్లే..

గతంలో వైసీపీ ప్రభుత్వం అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఉన్న తీర ప్రాంతంలోని కాల్వలను సముద్రానికి అనుసంధానిస్తూ నిర్మించిన అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లు పని చేయకపోవడంతో నాగాయలంక, కోడూరు మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు ముంపుబారిన పడ్డాయని పవన్‌ వెల్లడించారు. కనీస నిర్వహణ పనులకు నిధులు కేటాయించకపోవడంతో స్లూయిజ్‌లు మొరాయించి సముద్రం పోటెత్తినప్పుడు ఉప్పునీరు పొలాలను ముంచెత్తుతోందన్నారు. అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లను పునరుద్ధరించేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లు పునర్నిర్మించాల్సి ఉందన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ నిధుల నుంచి కేటాయింపులు చేస్తామని వెల్లడించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటనష్టం అంచనాలు త్వరగా పూర్తిచేయడంతో పాటు కౌలు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, కలెక్టర్‌ డీకే బాలాజీ, అటవీ, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 12:58 AM