Share News

సమస్యల స్టేడియం

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:27 AM

మచిలీపట్నంలో క్రీడా స్టేడియం కలగానే మిగిలిపోయింది. 2018 జూన్‌లో నాటి టీడీపీ ప్రభుత్వం స్థానిక గోసంఘం వద్ద స్డేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపివేసింది. కాంట్రాక్టర్‌ను వెళ్లగొట్టింది. కూటమి ప్రభుత్వ హయాంలోనైనా ఈ స్టేడియం నిర్మాణం పూర్తిచేయాలని బందరువాసులు కోరుతున్నారు.

సమస్యల స్టేడియం
స్టేడియం నిర్మాణం కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూమి ఇదే..

కలగానే మచిలీపట్నంలో క్రీడా స్టేడియం నిర్మాణం

రూ.37 కోట్ల అంచనాతో 2018లో టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపివేత

కాంట్రాక్టర్‌ను తరిమేసిన వైసీపీ నాయకులు

స్టేడియం నిర్మాణ స్థలం మెడికల్‌ స్టోర్‌కు కేటాయింపు

వైసీపీ అనుచరుల ఆధీనంలోకి మిగతా స్థలం

రేకుల షెడ్లు ఏర్పాటుచేసి ఆక్రమణ

కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ చిగురిస్తున్న ఆశలు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నంలో క్రీడా స్టేడియం నిర్మాణంపై వైసీపీ, టీడీపీ మధ్య ప్రచ్ఛన్నయుద్ధమే నడిచింది. 2018కు ముందు టీడీపీ ప్రభుత్వం మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి-65 పక్కనే కుమ్మరిగూడెం సమీపంలోని 25 ఎకరాల ప్రభుత్వ భూమిలో స్టేడియం నిర్మించాలని ప్రతిపాదించింది. భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ అనిల్‌కుంబ్లేను మచిలీపట్నం తీసుకొచ్చిన నాటి క్రీడలు, న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయించారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి పక్కనే స్టేడియం నిర్మాణాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని నాటి వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేసు వేసినవారు మిన్నకుండిపోగా, ఈ భూమిలో మచిలీపట్నం డంపింగ్‌ యార్డులోని చెత్తను తీసుకొచ్చి వేసి మెరక చేశారు. ఇందుకు మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిధులు రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లుగా చూపి బిల్లులు చేసుకున్నారు.అంతటితో ఆగకుండా వైసీపీ నాయకులు జాతీయ రహదారి పక్కనే ఉన్న అత్యంత విలువైన భూమిని తమ అనుచరులకు సెంటు రూ.లక్ష, లక్షన్నరకు విక్రయించారు. అనధికారికంగా రేకుల షెడ్లు వేయించారు. దీంతో ఈ భూమి వైసీపీ నాయకులు, వారి అనుచరుల ఆధీనంలోకి వెళ్లింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమిలో అక్రమంగా నిర్మించిన రేకులషెడ్లను తొలగించింది.

రూ.37 కోట్ల అంచనాతో డీపీఆర్‌

మచిలీపట్నంలో స్టేడియం నిర్మాణం కోసం రూ.37 కోట్ల అంచనాలతో డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను తయారు చేశారు. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ద్వారా ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. గోసంఘం వద్ద ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి రూ.17 కోట్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అథ్లెటిక్‌ ట్రాక్‌ నిర్మాణానికి రూ.9 కోట్లు, 50 మీటర్ల పొడవుతో స్విమ్మింగ్‌పూల్‌ నిర్మాణానికి రూ.9 కోట్లు, ఇతరత్రా పనుల నిమిత్తం మొత్తంగా రూ.37 కోట్ల అంచనాలు రూపొందించారు. గో సంఘం వద్ద స్టేడియం కోసం కేటాయించిన భూమి ఏడేళ్లుగా ఖాళీగానే ఉండటంతో తుమ్మచెట్లు మొలిచాయి. మంత్రి కొల్లు రవీంద్ర చొరవ తీసుకుని ఇక్కడ స్టేడియం నిర్మిస్తామని చెబుతున్నారు.

చిగురిస్తున్న ఆశలు

తాజాగా స్టేడియం నిర్మాణ ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపడంతో మచిలీపట్నం వాసుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పాఠశాల స్థాయిలో ఏటా జరిగే క్రీడా పోటీలను గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించాల్సి వస్తోంది. అక్కడ ఏమైనా పోటీలు జరుగుతుంటే, మచిలీపట్నంలోని ప్రైవేట్‌ స్థలాలు లేదా విజయవాడలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మచిలీపట్నంలో స్టేడియం నిర్మిస్తే ఈ ప్రాంతంలోని క్రీ డాకారులకు, కృష్ణా యూనివర్సిటీ లేదా అంతర్‌ యూనివర్సిటీల స్థాయిలో నిర్వహించే పోటీలకు ఆస్కారం ఏర్పడుతుందని క్రీడాకారులు కోరుతున్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:27 AM