Share News

కమిటీ కుయుక్తులు

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:54 AM

నందిగామ రామలింగేశ్వరస్వామి ఆలయ భూములను ఎలాగైనా కొట్టేయాలని కొందరు అక్రమార్కులు కమిటీల పేరిట కుట్రలకు తెరలేపుతున్నారు. మిగులు భూములపై కన్నేసిన ఈ గ్యాంగ్‌.. తమకు అడుగడుగునా అడ్డుపడుతున్న ధర్మకర్తను అడ్డుకోవాలని కుయుక్తులతో వ్యూహాలు పన్నుతున్నారు. అధికార పార్టీ పంచన చేరి, అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకున్న వీరు కమిటీలో తమ వారిని నియమించుకుని మిగిలిన భూములను కూడా కరిగించేయాలనే పన్నాగానికి తెరలేపుతున్నారు.

కమిటీ కుయుక్తులు
ఆక్రమణలకు గురవుతున్న స్వామివారి ఆలయ భూములు

నందిగామ రామలింగేశ్వరుడి భూములు కరిగించే కుట్రలు

ధర్మకర్త అడ్డుపడుతున్నారని కమిటీ ఏర్పాటుచేసే ఎత్తుగడ

అక్రమార్కులకు అండగా అధికార పార్టీ నేతలు, అధికారులు

అనుయాయులు 9 మందితో దేవదాయశాఖకు కమిటీ ప్రతిపాదన

నందిగామ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): నందిగామలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు 1,200 ఎకరాల భూమి ఇవ్వగా, అందులోని 785 ఎకరాలు ఆలయానికి సేవలందించే వివిధ వృత్తుల వారికి ఇనామ్‌గా అప్పగించారు. మిగిలిన 400 ఎకరాలు ఆలయానికి ఉన్నాయి. ఈ భూములు సుదీర్ఘకాలంగా అక్రమార్కులు ఆక్రమించి అమ్ముకుంటున్న వైనంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. ఆక్రమణలు పోను ప్రస్తుతం 262.2 ఎకరాలు ఉండగా, ఇందులో సుమారు 20 ఎకరాలు నందిగామ పట్టణంలో అంతర్భాగం అయ్యాయి. వీటి విలువ కనీసం రూ.100 కోట్లకుపైగా ఉంది. ప్రస్తుతం కొందరు అక్రమార్కుల దృష్టంతా ఈ భూములపై పడింది. కిందటి వైసీపీ హయాంలో ఈ భూమిని మున్సిపాలిటీకి బదలాయించి లీజుల పేరుతో అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలు జరిగాయు. ధర్మకర్త పోరాటంతో అవి ఫలించలేదు. తాజాగా పాలకమండలి కమిటీ వేయించే దిశగా అక్రమార్కులు అడుగులు వేస్తున్నారు. కమిటీలో తమకు కావాల్సిన వారిని నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నాడు వైసీపీ హయాంలో రామలింగేశ్వరుడి ఆస్తుల అన్యాక్రాంతానికి పాల్పడిన వ్యక్తులే నేడు కూటమి పంచన చేరి వారి కార్యకలాపాలను కొనసాగించడం ప్రారంభించారు.

రూ.కోట్ల విలువైన స్థలం స్వాహా

ఈ అక్రమార్కులు.. చందర్లపాడు బైపాస్‌ రోడ్డు సమీపంలో ఆలయానికి చెందిన 79 సెంట్ల భూమిని ఆక్రమించారు. విలువ రూ.10 కోట్లు ఉండగా, ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిపై ధర్మకర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించింది. అయినా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయ సిబ్బందిని బెదిరిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అధికారుల సహకారలేమితో ధర్మకర్త స్టే ఆర్డర్‌పై కంటెమ్ట్‌కు వెళ్లారు. ఇంత జరుగుతున్నా అధికారులు కానీ, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు కానీ స్పందించట్లేదు. అలాగే, అయ్యప్ప సన్నిధికి ఎదురుగా ఉన్న 5.38 ఎకరాల్లో సుమారు 35 సెంట్ల భూమి ఆక్రమణకు గురైంది. దీనిపైనా ధరకర్త పోరాడుతున్నారు.

ఆది నుంచి ధర్మకర్తల పాలనే..

ఆలయ నిర్వహణ దశాబ్దాలుగా వెంకటాద్రినాయుడి వంశీకుల పాలనలో జరుగుతూ వచ్చింది. 90వ దశకం ప్రారంభంలో ధర్మకర్తగా ఉన్న వాసిరెడ్డి శ్రీనినాద్‌ ప్రసాద్‌బాబు మరణించారు. ఆయన వారసులు క్లెయిమ్‌ చేసుకోకపోవడంతో కొద్దికాలం ధర్మకర్త పీఠం ఖాళీగా ఉంది. ఆ సమయంలో రెండు, మూడుసార్లు కమిటీలను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఆయన కుమారులు సదాశివప్రసాద్‌, మురళీకృష్ణప్రసాద్‌, రామనాథ్‌బాబు హైకోర్టును ఆశ్రయుంచారు. తమకు వంశపారంపర్య ధర్మకర్త హోదా ఉండగా, ప్రభుత్వాలు కమిటీలు ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేశారు. విచారణ జరిపిన కోర్టు 2010లో వాసిరెడ్డి సదాశివబాబుకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త హక్కులు కల్పిస్తూ తీర్పునిచ్చింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏ ప్రభుత్వమూ కమిటీలు వేయలేదు. గత వైసీపీ ప్రభుత్వం కమిటీ వేసే ప్రయత్నం చేసి విఫలమైంది. సదాశివబాబు మరణానంతరం ఆయన సోదరుడు రామనాథ్‌బాబు బాధ్యతలు చేపట్టారు. రామనాథ్‌బాబు మరణానంతరం ఆయన కుమారుడు మురళీకృష్ణబాబు బాధ్యతలు చేపట్టారు.

కమిటీ పేరిట కుయుక్తులు

ధర్మకర్త బాధ్యతలను నిర్వహిస్తున్న మురళీకృష్ణబాబు ఇప్పటికే రూ.కోటి సొంత నిధులతో ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఆక్రమణలు, అక్రమాలపై న్యాయపోరాటాలు చేస్తున్నారు. ఇక తమ ఆటలు సాగవని దొడ్డిదారిన ఆలయ ఆస్తుల కైంకర్యానికి అక్రమార్కులు, కొందరు దేవదాయ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కొందరు అధికార పార్టీ నాయకుల సహకారం తీసుకుని ఇప్పటివరకు లేని కమిటీ నియామకానికి సిద్ధమయ్యారు. ధర్మకర్త పేరు కూడా ప్రస్తావించకుండా తొమ్మిది మందితో కమిటీని నియమిస్తూ పేర్లను దేవదాయ శాఖకు పంపినట్లు సమాచారం.

Updated Date - Sep 01 , 2025 | 12:54 AM