అక్రమార్కుల బరితెగింపు
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:48 AM
మడ అడవులను ఇష్టానుసారంగా నరికేస్తున్న అక్రమార్కులు మరిన్ని దారుణాలకు తెగబడుతున్నారు. చెట్ల నరికివేత, రొయ్యల చెరువుల తవ్వకాల పరిశీలనకు వచ్చే తనిఖీ బృందాలను అడ్డుకోవటానికి రోడ్లకు గండ్లు కొడుతున్నారు.
మడచెట్ల నరికివేత నుంచి తప్పించుకునే కుట్రలు
తనిఖీ బృందాలు రాకుండా డొంకరోడ్లకు గండ్లు
ఎన్‌జీటీకి ఫిర్యాదు చేయాలనుకుంటున్న పర్యావరణ ప్రేమికులు
అయినా పెదపట్నంలో ఇష్టానుసారంగా చెట్ల నరికివేత
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మడ అడవులను ఇష్టానుసారంగా నరికేస్తున్న అక్రమార్కులు మరిన్ని దారుణాలకు తెగబడుతున్నారు. చెట్ల నరికివేత, రొయ్యల చెరువుల తవ్వకాల పరిశీలనకు వచ్చే తనిఖీ బృందాలను అడ్డుకోవటానికి రోడ్లకు గండ్లు కొడుతున్నారు. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం మండలం పెదపట్నంలో మడచెట్ల నరికివేతకు పాల్పడుతున్న మాఫియాపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎవరైనా తనిఖీలకు వస్తారేమోనని ఈ పని చేస్తున్నారు.
డొంకరోడ్లకు గండ్లు
పెదపట్నం నుంచి పార్వతీపురం వెళ్లే మార్గం వెంబడి లోపలి వైపు మడచెట్ల నరికివేత కొనసాగుతూనే ఉంది. ప్రధాన మార్గానికి అనుసంఽధానంగా డొంక రోడ్లు ఉంటాయి. ఈ డొంక రోడ్ల మీదుగా ముందుకువెళ్తే మడచెట్ల నరికివేత, రొయ్యల చెరువుల తవ్వకాలు కనిపిస్తాయి. డొంకరోడ్ల మీదుగా వెళ్తే బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతో అక్రమార్కులు తెలివిగా ఒక్కొక్కటిగా గండ్లు కొట్టాలని నిర్ణయించారు. ముందుగా మొదటి డొంకరోడ్డుకు గండి కొట్టే పని ప్రారంభించారు. తనిఖీ బృందాల వాహనాలను అడ్డుకోవటానికి వీలుగా గండ్లు కొడుతున్నారని సమీప ప్రాంతాల ప్రజలు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. తూర్పు కృష్ణాలో మడచెట్ల నరికివేత పెడన, బంటుమిల్లి మండలాలతో పాటు పెదపట్నం వరకు పాకింది. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని కొంతమంది పర్యావరణ ప్రేమికులు సిద్ధమవుతున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్తే తనిఖీ బృందాలు వస్తాయన్న ఉద్దేశంతో అక్రమార్కులు డొంకరోడ్లకు గండ్లు కొట్టించే పనులు చేస్తున్నారు.
స్పందించరేం..!
పెదపట్నంలో మడచెట్ల నరికివేత, రొయ్యల చెరువుల తవ్వకాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం స్పందించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. అటవీ, రెవెన్యూ శాఖలు తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. పీడబ్ల్యూడీ భూముల్లోని మడచెట్లను నరికివేస్తున్నా ఆ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. లజ్జబండ డ్రెయిన్ వెంబడి ఉన్న చెట్లను కూడా నరికి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నా జలవనరుల శాఖ అధికారులు అటువైపు చూడట్లేదు. దీంతో మడచెట్ల సంరక్షణ కోసం కొంతమంది ప్రకృతి ప్రేమికులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)ను ఆశ్రయించాలని భావిస్తున్నారు.