Share News

ఇదేం వరస

ABN , Publish Date - Jun 24 , 2025 | 01:03 AM

హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్‌-65 విస్తరణను 6 వరసలకే కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయటం చర్చనీయాంశంగా మారింది.

ఇదేం వరస

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో గందరగోళం

8 లేన్లు అవసరం ఉండగా, 6 లేన్లకే కేంద్రం ఆమోదం

పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్‌-65 విస్తరణను 6 వరసలకే కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ విస్తరణకు డీపీఆర్‌ రూపకల్పన చేస్తున్న కన్సల్టెన్సీ సంస్థ 8 వరసలకు ప్రతిపాదించగా, 6 వరసలకే కేంద్రం అనుమతినివ్వడం గమనార్హం. హైదరాబాద్‌-విజయవాడ సెక్షన్‌లో ట్రాఫిక్‌ స్టడీ వివరాలను కూడా సదరు సంస్థ కేంద్రానికి తెలియజేసింది.

నిబంధనల ప్రకారం..

ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట వరకు రోజుకు సగటున 55 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని పేర్కొంది. అలాగే, సూర్యాపేట నుంచి గొల్లపూడి వరకు సగటున రోజుకు 35 వేల వాహనాలు నడుస్తున్నాయని తెలిపింది. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌, ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు ఎన్‌హెచ్‌-65కు అనుసంధానమైతే ఆ ట్రాఫిక్‌ కూడా ఈ జాతీయ రహదారికే అనుసంధానమవుతుందని పేర్కొంది. అన్ని ప్రాంతాల ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 8 వరసలు తప్పనిసరి అని ప్రతిపాదించింది. తెలంగాణాలోని మందొళ్లగూడెం నుంచి నార్కట్‌పల్లి వరకు ఎన్‌హెచ్‌-65పై 47.50 కిలోమీటర్ల మేర సగటున రోజుకు 61 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపింది. అలాగే, నార్కట్‌పల్లి నుంచి సూర్యాపేట బైపాస్‌ వరకు 41 కిలోమీటర్ల మేర సగటున రోజుకు 51 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, సూర్యాపేట బైపాస్‌ నుంచి కోదాడ వరకు 51 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్‌-65పై రోజుకు 33 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, కోదాడ నుంచి నందిగామ వరకు 42 కిలోమీటర్ల మేర రోజుకు 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, నందిగామ నుంచి గొల్లపూడి వరకు 44.5 కిలోమీటర్ల మేర రోజుకు 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపింది. కేంద్రానికి నివేదించిన ట్రాఫిక్‌ గణాంకాల ప్రకారం 8 వరసలుగా విస్తరించాలని కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదించింది. అయితే, కేంద్రం ఆరు వరసలకు ప్రతిపాదించటం తగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?

ఒక జాతీయ రహదారిపై ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తే, ఎన్ని లేన్లను అనుమతులు ఇవ్వాలన్న దానిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్తు) కొన్ని నిబంధనలను నిర్దేశించింది. వీటి ప్రకారం 20 వేల నుంచి 30 వేల వాహనాలు రాకపోకలు సాగించే మార్గాన్ని 8 లేన్ల స్ట్రక్చర్‌తో 6 లేన్ల రహదారిని అభివృద్ధి చేయాలి. అలాగే, 30 వేల నుంచి 40 వేల వాహనాలు కనుక రాకపోకలు సాగిస్తే కచ్చితంగా 8 లేన్ల హైవేను అభివృద్ధి పరచాలి. 40 వేల వాహనాలు, ఆ పైన రాకపోకలు సాగిస్తూ.. ఆ హైవే ప్రస్తుతం 2 లేన్లుగా ఉంటే, 12 లేన్ల విస్తరణకు కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ 65.. 4 లేన్లుగా ఉంది కాబట్టి, 8 లేన్లకు తగ్గకుండా విస్తరించాలి. అలాగే, 40 వేల పైబడి వాహనాలు రాకపోకలు సాగిస్తూ, ఆ హైవే ప్రస్తుతం 4 లేన్లుగా ఉంటే, 8 లేన్లుగా విస్తరించాల్సి ఉంటుంది. మోర్తు నిబంధనల ప్రకారం హైదరాబాద్‌-విజయవాడ మార్గాన్ని 8 వరసలుగా విస్తరించటానికే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం 6 లేన్లుగా ప్రతిపాదించటం గమనార్హం.

Updated Date - Jun 24 , 2025 | 01:03 AM