భయోమెట్రిక్
ABN , Publish Date - Nov 22 , 2025 | 01:04 AM
పాత ప్రభుత్వాసుపత్రిలో సరైన సదుపాయాలు లేక బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో ప్రసవమై.. శిశువు జన్మించిన ఎనిమిది రోజులకు బాలింత.. బిడ్డతో కలిసొచ్చి ఆరోగ్యమిత్ర వద్ద బయోమెట్రిక్, ఫొటో తీయించుకోవాలి.
పాతప్రభుత్వాసుపత్రిలో బాలింతల అవస్థలు
ఎన్టీఆర్ ఆరోగ్యమిత్ర వద్ద పడిగాపులు
కూర్చోడానికి లేని బెంచీలు, శిశువులతో నిలబడే క్యూ
నేలపైనే కూర్చుంటున్న కొందరు బాలింతలు
ఇరుకైన గదిలోకి తోసుకుంటూ వెళ్తూ అవస్థలు
శిశువులకు గాయాలయ్యే అవకాశం
చోద్యం చూస్తున్న ఆసుపత్రి అధికారులు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : పాత ప్రభుత్వాసుపత్రిలో సరైన సదుపాయాలు లేక బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో ప్రసవమై.. శిశువు జన్మించిన ఎనిమిది రోజులకు బాలింత.. బిడ్డతో కలిసొచ్చి ఆరోగ్యమిత్ర వద్ద బయోమెట్రిక్, ఫొటో తీయించుకోవాలి. ఇలా.. పాత ప్రభుత్వాసుపత్రికి బయోమెట్రిక్ కోసం వచ్చే బాలింతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో బాలింతలను ఒకేసారి పిలుస్తున్నారు. దీంతో కూర్చోడానికి బల్లలు లేక చాలామంది అలాగే నిలబడిపోతున్నారు. అప్పటికే బిడ్డకు జన్మనిచ్చి కుట్లు, ఇతర నొప్పులతో విలవిల్లాడుతున్న వారికి ఈ పరిస్థితి నరకయాతనగా మారింది.
నేలపైనే కూర్చుంటున్న బాలింతలు
ఆరోగ్యమిత్రలో రిజిసే్ట్రషన్‌కు ఒక్కొక్కరికి కనీసం 10 నిమిషాల సమయం పడుతోంది. పదుల సంఖ్యలో వచ్చిన బాలింతలు గది ముందు వేసిన బెంచీలు చాలక, అక్కడికి వచ్చి నిలబడలేక, నేలపై కూర్చోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందరినీ ఒకేసారి రమ్మని చెప్పడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా రెండో అంతస్థులో ఉన్న బాలింతలు కిందకు దిగి, అంతసేపు నిలబడి ఉండి మళ్లీ పైకి వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. లిఫ్టు ఈ గది పక్కన కూడా లేదు. 10, 15 మందిని ఒకేసారి పిలిచి, వారు అయ్యేలోగా మరికొంత మందిని పిలిపిస్తే బాగుంటుందని బాలింతలు చెబుతున్నారు. శిశువులను ఎత్తుకోవడం కష్టమవుతున్న సమయంలో వారి సహాయకులు కూడా అక్కడ ఉంటున్నారు. వారందిరితో ఆ ప్రాంతమంతా ఇరుగ్గా మారుతోంది. ముఖ్యంగా ఆరోగ్యమిత్ర గది వద్ద గుమిగూడటంతో శిశువులకు గాయాలవుతున్నాయి. ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా ఉంది. ఆ గది వద్ద నియంత్రించడానికి కూడా ఎవరూ లేకపోవడం ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
ఫ్యాన్లు లేక ఉక్కపోత
బయోమెట్రిక్ కోసం వచ్చే బాలింతలు, వారి సహాయకులు గాలి ఆడక ఇబ్బందులు పడుతున్నారు. పదుల సంఖ్యలో బాలింతలను బయోమెట్రిక్ కోసం పిలిపించి గది బయటే ఉంచుతున్నారు. ఆ గది బయట ఫ్యాన్లు లేకపోవడంతో పసిపిల్లలతో వచ్చిన బాలింతలు ఇబ్బంది పడుతున్నారు.
పై నుంచి కిందకు రావడానికి ఇబ్బంది పడ్డాను
నాకు ఆపరేషన్ అయింది. ఇప్పటికే చాలానొప్పిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కిందకు దిగాలంటే ఇబ్బంది పడ్డా. కింద ఉన్నవారితో పాటే పై అంతస్థులో ఉన్న మమ్మల్ని పిలిచారు. నాతో మరో ఐదారుగురు ఇలాగే ఇబ్బంది పడ్డారు. కిందవారి ప్రాసెస్ పూర్తయ్యాక మమ్మల్ని పిలిస్తే బాగుండేది. పై అంతస్థు నుంచి వచ్చి ఇక్కడ ఇంత సమయం ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. బల్లలు సరిగ్గా లేవు. గాలి రావట్లేదు. అందరి పరిస్థితి అంతే, ఎవరినీ ఏం అనలేం.
- దుర్గ, బాలింత, కృష్ణలంక