Share News

గేటు పడితే అంతే..!

ABN , Publish Date - May 08 , 2025 | 12:40 AM

గుణదల మినీ ఫ్లై ఓవర్‌ విషయంలో రైల్వేశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల నున్న-గుణదలకు రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక కొత్త వంతెన దగ్గర వాహనదారులకు నరకం కనిపిస్తోంది. గేటు పడితే కిలోమీటరు దూరాన ట్రాఫిక్‌ ఆగిపోతోంది.

గేటు పడితే అంతే..!

గుణదల రైల్వేగేట్‌ వద్ద వాహనదారుల అవస్థలు

దారి చిన్నది.. పైగా వరుస రైళ్ల రాకపోకలు

గేటు పడటంతో గంటలకొద్దీ నిలిచిపోతున్న ట్రాఫిక్‌

గుణదల ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని మరిచారు

ఆర్వోబీ కూడా లేకపోవడంతో నిత్య నరకమే

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గుణదల మినీ ఫ్లై ఓవర్‌ విషయంలో రైల్వేశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల నున్న-గుణదలకు రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక కొత్త వంతెన దగ్గర వాహనదారులకు నరకం కనిపిస్తోంది. గేటు పడితే కిలోమీటరు దూరాన ట్రాఫిక్‌ ఆగిపోతోంది. మెయిన్‌ లైన్‌లో వందేభారత రైళ్లకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో సొంత ఖర్చుతో ఆర్వోబీలు నిర్మిస్తున్న రైల్వేశాఖ అధికారులు బ్రాంచ్‌ లైన్లకు వచ్చేసరికి నిర్లక్ష్యం చూపుతున్నారు. గుణదల వద్ద రైల్వే బ్రాంచ్‌ లైన్‌ ఉండటంతో ఈ మార్గంలో అధిక సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఫలితంగా గేట్లు ఎక్కువ సేపు పడుతుంటాయి. దీంతో కొత్త వంతెనపై రాకపోకలు సాగించే వారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పైగా రెండు, మూడు రైళ్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తుండటంతో అరగంటకు పైగా గేట్లు వేసే ఉంచుతున్నారు. ఇటీవల ఈ మార్గంలో ఓ రైలు ఆగిపోయింది. గేటు దాటిన తర్వాత ఆగాల్సిన రైళ్లు గేటు వద్ద ఉండగానే ఆగిపోయింది. దీంతో అవి కదిలే వరకు వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. ఫలితంగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఏలూరు రోడ్డు వరకు వాహనాలు ఆగిపోయాయి. దాదాపు అన్ని రోజుల్లో ఉదయం, సాయంత్రం ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

గుణదల ఫ్లై ఓవర్‌ను పట్టించుకునే వారేరీ?

వ్యక్తిగత పనులు, ఉద్యోగాలు, చిరు వ్యాపారాల కోసం నున్న నుంచి నగరానికి ఎక్కువమంది వస్తుంటారు. వీరందరికీ ఇది దగ్గరి దారి. దీంతో ఇక్కడి రోడ్లు నిత్యం కళకళలాడుతూ ఉంటాయి. ట్రాఫిక్‌ కూడా అలాగే ఉంటుంది. ఈ బాధలు పోవడానికి దశాబ్దంన్నర కిందట గుణదల మినీ ఫ్లై ఓవర్‌కు శ్రీకారం చుట్టారు. కానీ, అప్పట్లో ఓ ప్రజాప్రతినిధి డిజైన్‌ మార్చడం వల్ల తనకు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్‌ పనులు ఆపేశాడు. ఆ తర్వాత గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పనులు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అంచనాలు వేసి, భూసేకరణ జరిపిన తర్వాత ఎన్నికలు రావడంతో బంతి రైల్వేకోర్టులోకి వెళ్లింది. రైల్వే అధికారులు దీనిని పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆ ఫ్లైఓవర్‌ మొండిగోడలతో కనిపిస్తోంది. పైగా ప్రస్తుతమున్న అంతర్గత మార్గం ఇరుకు. దీంతో ఎదురెదురు వాహనాలను తప్పించుకుంటూ ముందుకెళ్లడం పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. వాహనాలు ముందుకు కదల్లేక ట్రాక్‌పై ఆగిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇటీవల కలెక్టర్‌, కమిషనర్‌, ఎంపీ స్థాయిలో రైల్వే అధికారులతో జరిగిన సమావేశంలో కూడా గుణదల మినీ ఫ్లై ఓవర్‌కు సంబంధించి త్వరగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయినా పట్టించుకునే నాథుడు లేడు.

Updated Date - May 08 , 2025 | 12:40 AM