Share News

నెమ్మదిగా సాగు

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:43 AM

ఓవైపు వరుణుడి కరుణ లేకపోవడం, మరోవైపు కాల్వలకు సరిగ్గా సాగునీరు విడుదల కాకపోవడం.. వెరసి ఈ ఏడాది ఖరీఫ్‌పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై ప్రారంభమైనప్పటికీ వర్షాలు కురవకపోవడంతో నారుమడుల్లో ఎదుగుదల లోపించడం, అరకొర సాగునీరు శివారు ప్రాంతాలకు సరిగ్గా చేరకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అన్నదాతలు అయోమయంతో ఆకాశంవైపు చూస్తున్నారు.

నెమ్మదిగా సాగు

ఖరీఫ్‌పై అన్నదాతల్లో కలవరం

జూలై ప్రారంభమైనా కరుణించని వరుణుడు

జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వేడిగాలులు

ఎదుగుదల లోపించిన వరిపైరు

కాల్వ ఎగువ ప్రాంతాల్లో వరినాట్లు ప్రారంభం

వర్షం కురిస్తేనే సాగుకు అనుకూలం

సాగునీరు కూడా అరకొరగానే విడుదల

శివారు ప్రాంతాలకు ఇంకా చేరని నీరు

ఆకాశంవైపు చూస్తున్న అన్నదాతలు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మే నెలలో 10 రోజుల పాటు కురిసిన వర్షం, ఆ తరువాత ముఖం చాటేసింది. జూన్‌ ప్రారంభం నుంచి వర్షాలు సక్రమంగా కురుస్తాయని రైతులు ఆశించినా నిరాశే మిగిలింది. జూలైలో వర్షాలు కురవకపోగా, ఉష్ణోగ్రతలు పెరిగి వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో నారుమడులలో ఎదుగుదల లోపించింది. నాట్లు వేసిన పొలాల్లో వరిపైరు బతకడానికి సమయం పడుతోంది. కాల్వలకు అరకొరగా నీటి విడుదల జరుగుతుండటంతో వాతావరణం సాగుకు ఎప్పటికి అనుకూలంగా మారుతుందోనని, వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడోనని రైతులు ఆశగా చూస్తున్నారు.

సక్రమంగా విడుదల కాని సాగునీరు

గతనెల 23 నుంచి జిల్లాలోని అన్ని ప్రధాన కాల్వలకు పుష్కలంగా సాగునీరు విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కానీ, పూర్తిస్థాయిలో నీటి విడుదల జరగలేదు. 1.25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేసే బందరు ప్రధాన కాల్వకు పూర్తిగా సాగునీరు విడుదల కాలేదు. మచిలీపట్నం శివారు భూములకు ఇంకా నీటి విడుదల జరగనేలేదు. నీటి విడుదలకు ఇంకా రెండు రోజులు పడుతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దివిసీమకు సాగునీటిని సరఫరా చేసే

వరినాట్లు వేగవంతం

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 1.62 లక్షల హెక్టార్లలో వరిసాగు జరుగుతుందని అంచనా. కంకిపాడు, ఉయ్యూరు, మొవ్వ, చల్లపల్లి, మోపిదేవి, పామర్రు, తోట్లవల్లూరు, ఘంటసాల, పెనమలూరు తదితర మండలాల్లో బోరునీటి ఆధారంగా పోసిన నారుమడులు సిద్ధం కావడంతో వరినాట్లు వేసే పనులు వారం రోజులుగా సాగుతున్నాయి. కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే బందరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు, కోడూరు, అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, నాగాయలంక తదితర మండలాల్లో నారుమడులు పోయడం, వెదజల్లే పద్ధతిలో వరినాట్లు వేయడం చేస్తారు. కాల్వలకు సరిపడా సాగునీరు విడుదల కాకపోవడంతో మోపిదేవి మండలం శివరామపురం, పెద ప్రోలు తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీల్లో అందుబాటులో ఉన్న నీటిని తోడి సాగుకు ఉపయోగిస్తున్నారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వ ర్షాలు సమృద్ధిగా కురిస్తే ఎగువ ప్రాంతంలో సాగునీటి వినియోగం తగ్గి, దిగువ ప్రాంతానికి నీరు విడుదల అవుతుందని రైతులు చెప్పుకొంటున్నారు.కేఈబీ కాల్వకు 1,700 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉండగా, 800 క్యూసెక్కులే విడుదల చేస్తున్నారు. పులిగడ్డ ఆక్విడెక్టు వద్ద గేట్లను ఎత్తి అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలకు సాగునీటిని విడుదల చేశారు. కోడూరు, నాగాయలంక మండలాల్లోని కాల్వలకు 250 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రధాన కాల్వలకు దగ్గరలోని భూముల్లో రైతులు నారుమడులు పోసే పనులు ప్రారంభించారు. బందరు కాల్వకు 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా, 1,150 క్యూసెక్కులే వదిలారు. వీరంకిలాకుల ఎగువన బందరు ప్రధాన కాల్వలో నాచు పెద్దఎత్తున పేరుకుపోవడంతో రెండురోజుల క్రితం వరకు తొలగింపు పనులు చేశారు. దీంతో బందరు కాల్వకు పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేయకుండా నిలిపివేశారు. ఈ కారణంగా బందరు కాల్వకు పూర్తిస్థాయిలో నీటి విడుదల జరగలేదు. శివారుకు ఇంకా సాగునీరు చేరలేదు. జిల్లాలో ఇప్పటివరకు వెదజల్లే పద్ధతిలో 10,600 హెక్టార్లలో వరినాట్లు రైతులు పూర్తి చేశారు. 800 హెక్టార్లలో వరినాట్లు వేశారు. 3,100 హెక్టార్లలో నారుమడులు పోశారు.

కోమటిగుంట లాకులకు మరమ్మతులు చేయరు

కంకిపాడు మండలంలోని పలు గ్రామాలకు, దిగువ ప్రాంతాలకు సాగునీటిని సరఫరా చేసే కోమటిగుంట లాకులు మరమ్మతులకు గురయ్యాయి. గత వేసవిలో ఈ లాకులకు కనీస మరమ్మతులు చేయలేదు. లాకులు సక్రమంగా పనిచేయకపోవడంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసే అవకాశం ఉండట్లేదు. ఇక్కడ 7.2 అడుగుల మేర నీటిమట్టం ఉంటే.. కంకిపాడు మండలంలోని పొలాలకు సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 6.3 అడుగుల మేర మాత్రమే నీటిమట్టం ఉంది. దీంతో నీటిని విడుదల చేసినట్లుగా కనిపిస్తున్నా పొలాల్లోకి పారని పరిస్థితి ఏర్పడింది. కాల్వ ద్వారా సాగునీరు సక్రమంగా అందకపోవడంతో కంకిపాడు మండలంలోని రైతులు బోరునీటిని తోడి వరినాట్లు వేస్తున్నారు. నాలుగైదు రోజులుగా వరినాట్లు వేగవంతమయ్యాయి. కోమటిగుంట లాకులు సక్రమంగా పనిచేసి నీటి విడుదల జరిగి, ఆశించిన స్థాయిలో వర్షం కురిస్తే, బోరునీటితో పని ఉందదని, బోర్లకు ఉపయోగించే విద్యుత కూడా ఆదా అవుతుందని రైతులు చెబుతున్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:43 AM