పైసామే పర్సంటేజీ
ABN , Publish Date - May 06 , 2025 | 01:02 AM
కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ విభాగ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంలోని కొందరు అధికారులు పర్సంటేజీలకు అలవాటు పడి కీలకమైన పనుల నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారు. రోడ్లు, డ్రెయిన్లు, కాల్వలు ఇలా ప్రతి పనులూ నాసిరకంగా మారుతుండగా, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసం పదేపదే అవే పనులు చేయించడం రివాజుగా మారింది. ఈ చర్యలతో కార్పొరేషన్‌పై ఆర్థిక దుబారా పడుతోంది.
కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ విభాగంలో కమీషన్ల కక్కుర్తి
ఎక్కడికక్కడ చేయి తడిపితేనే కాంట్రాక్టర్లకు బిల్లులు అందేది
గుమస్తా నుంచి పైస్థాయి అధికారి వరకు అందరికీ మామూళ్లే
కీలకమైన పనులు తూతూమంత్రంగా చేస్తున్న కాంట్రాక్టర్లు
నామమాత్రంగా తనిఖీలు చేస్తున్న క్వాలిటీ కంట్రోల్ అధికారులు
కార్పొరేషన్, మే 5 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది. బడ్జెట్‌ను బట్టి పర్సంటేజీలు లెక్కకట్టి వసూలు చేస్తున్నారు. గుమస్తా స్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు అందరికీ ఈ పర్సంటేజీలు ఇవ్వాల్సిందే. లేకుంటే ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. నగరాభివృద్ధి అంతా ఈ ఇంజనీరింగ్ విభాగంపైనే ఆధారపడి ఉంటుంది. పర్సంటేజీలకు, మామూళ్లకు అలవాటుపడుతున్న ఇక్కడి అధికారులు నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారు.
బినామీ పేర్లతో అధికారులకు పనులు
బీటీ రోడ్ల నుంచి సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కాల్వల్లో పూడికతీత వరకు ప్రతి పనిలో ఇంజనీరింగ్ విభాగం ప్రధాన భూమిక పోషిస్తోంది. పనుల్లో వస్తున్న పర్సంటేజీలు చాలక కొందరు ఇంజనీరింగ్ అధికారులు నగరంలో బినామీ పేర్లతో నామినేషన్ పనులను చేపట్టి ప్రజాధనాన్ని దండుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మామూళ్లు తీసుకున్న పనులైనా సక్రమంగా జరుగుతున్నాయా అంటే ప్రశ్నార్థకమే. చేసిన పనినే పదేపదే చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
తూతూమంత్రంగా క్వాలిటీ కంట్రోల్
పనుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాల్సిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు.. కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులతో ఉన్న ‘రూపాయి’కారి సంబంధాలతో పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ఒక రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక బిల్లు చేసేందుకు.. క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఆ రోడ్డు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి సర్టిఫై చేస్తారు. అయితే, ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ అధికారులను.. కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారు. కాంట్రాక్టర్లు చూపించిన చోట శాంపిల్స్ తీసి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేలా చేస్తున్నారు. ఉదాహరణకు ఒక కాంట్రాక్టర్ సుమారు 7 అంగుళాల మందంతో సీసీ రోడ్డు వేయాలంటే దానికి కావాల్సిన పూర్తిస్థాయి మెటీరియల్‌ను ఇంజనీరింగ్ అధికారులు ముందే సూచిస్తారు. కానీ, కాంట్రాక్టర్లు.. రోడ్డు కిలోమీటరు పొడువు ఉంటే ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన ప్రమాణాలను నాలుగైదు చోట్ల మాత్రమే అమలు చేస్తారు. క్వాలిటీ కాంట్రోల్ అధికారులు కూడా ఆ ప్రదేశాల్లో మాత్రమే శాంపిల్స్ తీసి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తారు.
పర్సంటేజీలు ఇలా..
పనులు పూర్తయ్యాక కొలతలు తీసుకుని ఇంజనీరింగ్ అధికారులు బిల్లు సిద్ధం చేస్తారు. ఇక్కడి నుంచే పర్సంటేజీల పర్వం మొదలవుతుంది. బిల్లు సిద్ధంచేసే గుమస్తాకు మామూళ్లు సమర్పించి ఫైల్ ముందుకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఏ సర్కిల్లో పని జరిగితే ఆ సర్కిల్ ఏఈ, డీఈ, ఈఈలకు ఒకటి నుంచి మూడు వరకు పర్సంటేజీలు ఇవ్వాలి. సర్కిల్ నుంచి ఫైల్ ఎస్‌ఈలకు వెళ్తుంది. అక్కడ ఒక శాతం ఉంటుంది. అక్కడి నుంచి ఎగ్జామినర్, అకౌంట్ సెక్షన్లలో ఒక్కొక్కరికి ఒక శాతం, అలాగే బిల్లు చేసేవారికి ఎంతో కొంత సొమ్ము చెల్లించాలి. 20 లక్షల పైన అయితే ఉన్నతస్థాయి అధికారులకు పర్సంటేజీలు ఇవ్వాలి. అయితే, కొందరు కాంట్రాక్టర్లు నిజాయితీగా పనులు చేసినా.. మామూళ్లు లేనిదే ఫైల్ కదలకపోవడంతో బయట తెచ్చిన డబ్బుకు వడ్డీ కట్టలేక ఎవరు ఎంత అడిగితే అంత ముట్టజెబుతున్నారు. ఈ విధంగా ఇంజనీరింగ్ విభాగంలో బిల్లుల కోసం పన్నులు కడుతుంటే అభివృద్ధి పనుల్లో నాణ్యత ఎక్కడ ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలా చేసిన పనులకు సకాలంలో డబ్బు చెల్లించకుండా తమకు ఇవ్వాల్సింది ఇవ్వకుంటే నానా ఇబ్బందులు పెడతారనే ఆరోపణలు ఈ విభాగంపై వస్తున్నాయి. చేసేది లేక కాంట్రాక్టర్లు ఈ చెల్లింపునకు అలవాటు పడ్డారు.