పక్కా ‘కమర్షియల్’
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:58 AM
ఆటోనగర్.. విజయవాడ నగరానికి, కృష్ణాజిల్లాకు మధ్య ఉన్న కీలకమైన వాణిజ్య కేంద్రం. ఇక్కడ భారీ వాహనాలకు బాడీలు తయారవుతాయి. రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంది. వేలమందికి ఉపాధి లభిస్తుంది. ఇదంతా నాణేనికి ఒకవైపే. రెండోవైపు మాత్రం అనేక అక్రమాలు, అవినీతి కార్యకలాపాలు కనిపిస్తాయి. వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఇదో కల్పతరువు. తనిఖీలు చేయాలని పై నుంచి టాస్క్ రాగానే ఈ శాఖలోని అధికారులకు ముందుగా ఆటోనగరే గుర్తొస్తుంది. సీవీటీ (చెకింగ్ వెహికల్ ట్యాక్స్) ఆదేశాలు వచ్చినా, రాకపోయినా ఠంచనుగా ఇక్కడ వాలిపోయి రూ.లక్షల్లో దండుకుంటున్నారు.
ఆటోనగర్‌లో వాణిజ్య పన్నుల శాఖ చేతివాటం
అందినకాడికి దండుకుంటున్న అధికారులు
కేసుల పేరుతో వ్యాపారులకు బెదిరింపులు
లోడును బట్టి రేటు నిర్ణయించి అక్రమ వసూళ్లు
ఏజెంట్లుగా అటెండర్లు, డ్రైవర్లు, వాచ్‌మెన్లు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఆటోనగర్‌లో వాహనాల బాడీబిల్డింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇవికాకుండా ఈ-వ్యర్థాలు, పాడైపోయిన తీగలు, ప్లాస్టిక్‌ను సేకరించే యూనిట్లు ఉన్నాయి. వాటిని టార్గెట్ చేసుకుని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యవహారాలు చక్కబెడుతున్నారు. బహిరంగంగానే వసూళ్లు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆటోనగర్‌లో దుమారం రేపుతోంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
లారీ కదిలితే రూ.లక్ష
ఆటోనగర్‌లో ప్లాసిక్ట్, ఎలకా్ట్రనిక్, చెత్త కాగితాలను కొనే యూనిట్లు 120 వరకు ఉన్నాయి. ఇందులో కొన్ని యూనిట్లు హోల్‌సేల్‌గా, మరికొన్ని రిటైల్‌గా పనిచేస్తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి వ్యర్థాలను వాహనాల్లో ఇక్కడికి తీసుకొస్తారు. వాటిని కొన్న వ్యాపారులు తిరిగి భారీ లారీల్లో రీసైక్లింగ్ కేంద్రాలకు పంపుతారు. వ్యర్థాల కొనుగోళ్లు, రీ సైక్లింగ్ యూనిట్లకు విక్రయించే క్రమంలో వ్యాపారులు జీఎస్టీ చెల్లించాలి. కానీ, వ్యాపారులు జీఎస్టీ చెల్లించట్లేదు. ఇన్వాయిస్‌లతో సంబంధం లేకుండా రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. దీన్ని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు, ఉద్యోగులు ఓ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తనిఖీల పేరుతో అధికారులు నిత్యం ఆటోనగర్‌లోని వ్యర్థాల సేకరణ యూనిట్ల వద్ద తిష్ట వేస్తున్నారు. కొంతమంది అధికారులు అక్కడే కుర్చీలు వేసుకుని కూర్చుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. మరికొంతమంది హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలపై చక్కర్లు కొడుతున్నారు. వ్యర్థాలతో వాహనం వచ్చినా, వెళ్లినా టక్కున వాలిపోతున్నారు.
ఒక్కో రేటు
ఇనుప వ్యర్థాలతో వచ్చే వాహనాలను తనిఖీ చేసి బిల్లులు లేకపోతే రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. అదే ప్లాస్టిక్ వ్యర్థాల వాహనాలైతే రూ.5 వేలు తీసుకుంటున్నారు. ఈ యూనిట్ల నుంచి లారీల్లో టన్నుల సరుకు బయటకు వెళ్తే మాత్రం రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చేస్తున్న ఈ దందా దారుణంగా ఉంటోందని వ్యాపార వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకోసం వ్యర్థాలను తీసుకొచ్చే వారికి చేసే చెల్లింపుల్లో కోత విధిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖలోని సర్కిళ్లలో పనిచేసే డ్రైవర్లు, అటెండర్లు, వాచ్‌మెన్లను ఈ వసూళ్లకు ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు.