Share News

అవినీతి కొండ

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:46 AM

అతను అధికారి కాదు. కానీ, అంతకుమించిన బిల్డప్‌ ఇస్తాడు. కార్యాలయంలో సబార్డినేటే అయినా సరిహద్దులు చెరిపేసుకున్నాడు. వసూళ్ల కోసం తానే అధికారినని దండోరా వేసుకున్నాడు. రాజకీయ పరిచయాలు, అధికారులతో సత్సంబంధాలను ఉపయోగించుకుని తనకు అడ్డే లేదన్నట్టుగా అడ్డగోలుగా వ్యవహరించాడు. చివరికి ఏసీబీకి చిక్కి కటకటాలపాలయ్యాడు. ఇదీ ఏసీబీకి చిక్కిన వాణిజ్య పన్నుల శాఖ సబార్డినేట్‌ కొండపల్లి శ్రీనివాసరావు చరిత్ర. ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నుంచి రూ.16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అతడి బాగోతాలు బయటకు వస్తున్నాయి.

అవినీతి కొండ
కొండపల్లి శ్రీనివాసరావు

వాణిజ్య పన్నులశాఖ సబార్డినేట్‌ కొండపల్లి అరాచకాలు

గెజిటెడ్‌ అధికారిగా ప్రచారం చేసుకుని లంచాలు

సరిహద్దులు దాటేసి.. ఇష్టానుసారంగా వసూళ్లు

విజయవాడ రైల్వేస్టేషన్‌, వన్‌టౌన్‌ మార్కెట్‌ టార్గెట్‌

వ్యాపారులను బెదిరించి రూ.లక్షల్లో డిమాండ్‌

ఆ శాఖలోని విశాఖపట్నం అధికారి అండతోనే..

ట్రాన్స్‌పోర్టు వ్యాపారి ఫిర్యాదుతో ఏసీబీ చేతికి..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కొండపల్లి శ్రీనివాసరావు.. విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలోని గవర్నరుపేట సర్కిల్‌లో అటెండర్‌. పనిచేసిన అన్నిచోట్లా లంచాలకు రుచిమరిగాడు. డిమాండ్‌ చేసిన మొత్తం చేతిలో పెడితేనే శాంతిస్తాడు. లేకపోతే చెలరేగిపోయి అరాచకం సృష్టిస్తాడు. అతను ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారులు ఏనాడూ చర్యలు తీసుకోలేదు. వాణిజ్య పన్నుల శాఖలో సీవీటీ (చెకింగ్‌ వెహికల్‌ ట్యాక్స్‌)ల్లో తానే ఓ అధికారిగా చెప్పుకొని భారీగా దండుకునేవాడు.

వన్‌టౌన్‌లో దందాలు

వనటౌనలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు రైల్వేస్టేషనతో పాటు అక్కడి హోల్‌సేల్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకుని దందాలు సాగించినట్టు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. శ్రీనివాసరావు హోదాను మరిచి తనకు తానే గెజిటెడ్‌ అని చెప్పుకొంటాడు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, హోల్‌సేల్‌ షాపుల వద్దకు వెళ్లి బెదిరింపులకు దిగుతాడు. ఉన్నతాధికారులు ఎలాంటి టాస్క్‌ అప్పజెప్పకపోయినా కన్నుపడిన వ్యాపారాల వద్దకు వెళ్లి డబ్బు డిమాండ్‌ చేస్తాడు. బిల్లు పుస్తకాలు, ఇన్వాయిస్‌లను పరిశీలించి అందులో ఉన్న లోపాలను పట్టుకుని డబ్బు భారీగా డిమాండ్‌ చేస్తాడు. ఈ విధంగా నెలకు లక్షల రూపాయలను వసూళ్ల రూపంలో తీసుకెళ్తాడు. అధికారులు తనిఖీలకు రాకుండా చూసుకుంటానని చెప్పి తెరచాటు వ్యాపారాలు చేసేవారి నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసేవాడు. కొండపల్లి శ్రీనివాసరావు పాపం పండింది. వన్‌టౌన్‌ జెండాచెట్టు సెంటర్‌లో ఉన్న ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి గురువారం రాత్రి వెళ్లి సీవీటీ పేరుతో తనిఖీలు చేశాడు. యజమాని నుంచి రూ.20 వేలు డిమాండ్‌ చేసి, రూ.16 వేలతో సరిపెట్టుకున్నాడు. తనిఖీల పేరుతో వెళ్లిన ప్రతిసారీ కొండపల్లి శ్రీనివాసరావు ఇలా చేస్తుండటంతో ఆ యజమాని విసుగుచెంది ఏసీబీని ఆశ్రయించాడు.

వన్‌టౌన్‌లో వసూళ్లు

కొండపల్లి శ్రీనివాసరావు అరాచకాలు రైల్వేస్టేషన, వనటౌన హోల్‌సేల్‌ మార్కెట్‌ ప్రధాన కేంద్రాలుగా సాగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వనటౌనలోని హోల్‌సేల్‌ మార్కెట్‌కు పలు రకాల గూడ్స్‌ సరుకు నిత్యం వస్తుంటుంది. పార్శిల్‌ కార్యాలయం నుంచి బయటకు రాగానే పట్టుకోవడానికి రాత్రిపూట శ్రీనివాసరావు రైల్వేస్టేషన పార్సిల్‌ ఆఫీసు వద్ద కాపుగాసేవాడు. గూడ్స్‌తో వాహనం బయటకు రాగానే తనిఖీ అధికారి మాదిరిగా హడావిడి చేసి బిల్లులు చూపించమని బెదిరించేవాడు. బిల్లులు ఉన్నా లేకపోయినా వసూళ్లు మాత్రం చేసేవాడు. బిల్లులు లేని సరుకు యజమానుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుని వెళ్లేవాడు. హోల్‌సేల్‌ మార్కెట్‌లోని వివిధ వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి వ్యాపారులను బెదిరించి భారీగా డబ్బు దండేవాడు. లక్ష రూపాయల నుంచి బేరం సాగేది. సరకు విలువను బట్టి డబ్బు డిమాండ్‌ చేసేవాడు. శ్రీనివాసరావు గవర్నరుపేట సర్కిల్‌లో పనిచేస్తున్నప్పటికీ ఆ సరిహద్దులను మరిచి వ్యవహరించేవాడు. మొదట్లో విజయవాడలో పనిచేసేవాడు. ఇక్కడ ఆరోపణలు రావడంతో ఉయ్యూరు సర్కిల్‌కు బదిలీ చేశారు. అక్కడ కూడా వ్యవహారాలు చక్కబెట్టినట్టు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. తర్వాత అక్కడి నుంచి మళ్లీ విజయవాడకు చేరుకుని గవర్నరుపేట సర్కిల్‌లో పోస్టింగ్‌ సంపాదించుకున్నాడు. రెండు జిల్లాల్లోనూ ఉన్న సర్కిళ్లకు తానే అధికారిని అన్నట్టు వ్యవహరించి వ్యవహారాలు చక్కబెట్టేవాడు.

వైజాగ్‌ అధికారి అండతో..

కొండపల్లి శ్రీనివాసరావుపై పలువురు వ్యాపారులు అనేకసార్లు ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటివరకు అతనిపై చర్యలు తీసుకోలేదు. దీనికి ప్రధాన కారణం కొంతమంది అధికారులేనని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు బహిరంగంగా చెబుతున్నారు. ఏ సర్కిల్‌లో పనిచేసినా అక్కడ అధికారులను ప్రసన్నం చేసుకోవడంలో కొండపల్లి శ్రీనివాసరావు దిట్ట. అధికారుల అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంటాడు. దీంతో అతనిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోలేదు. ఇంతకుముందు విజయవాడలో పనిచేసి ప్రస్తుతం వైజాగ్‌లోని రీజనల్‌ ఆడిట్‌ అండ్‌ విజిలెన్స్‌ విభాగంలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి అండ శ్రీనివాసరావుకు ఉందని వాణిజ్యపన్నుల శాఖలో ప్రచారం జరుగుతోంది. అధికారి సోదరుడు విజయవాడలో కీలక స్థానంలో పనిచేశాడు. ఆ సమయంలోనే అన్నదమ్ములిద్దరినీ గుప్పెట్లో పెట్టుకుని శ్రీనివాసరావు వ్యవహారాలు చక్కబెట్టాడు.

ఈనెల 31 వరకు రిమాండ్‌

కొండపల్లి శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి పి.భాస్కరరావు 31వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం శ్రీనివాసరావును విజయవాడ జిల్లాజైలుకు తరలించారు.

Updated Date - Oct 18 , 2025 | 12:46 AM