Share News

గుంటుపల్లిలో గుట్టుగా..

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:03 AM

కృష్ణాతీరంలో, ఇసుక తిన్నెల్లో, పచ్చగా ఏపుగా ఎదిగిన పొదల్లో పందెపురాయుళ్లు ‘బరి’ తెగించారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుంటుపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా కోడిపందేలు వేశారు. ఖరీదైన కార్లలో దర్జాగా జరిగిన ఈ పందెపు శిబిరాలపై ఆదివారం దాడిచేసిన పోలీసులు పెద్దవారిని వదిలి, పనివారిని పట్టుకోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గుంటుపల్లిలో గుట్టుగా..

కృష్ణానది తీరాన, పచ్చటి పొదల్లో కోడిపందేలు

ఖరీదైన కార్లలో వచ్చి మరీ భారీగా పందేలు

పక్కా సమాచారంతో దాడిచేసిన పోలీసులు

ప్రముఖులను వదిలేసి, పనివారిపై పెట్టీ కేసులు

ఇబ్రహీంపట్నం పోలీసుల తీరుపై అనుమానాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సాధారణంగా సంక్రాంతి సంబరాల్లో కోడిపందేలు జోరుగా సాగుతాయి. కానీ, ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుంటుపల్లిలో మాత్రం సంబరాలతో సంబంధం లేకుండానే కోళ్లకు కత్తులు కడుతున్నారు. వైసీపీ హయాంలో గుంటుపల్లిలో ఇసుక ర్యాంపు నిర్వహించిన ప్రాంతం ఇప్పుడు ఖాళీగా ఉంది. ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఇక్కడ ఓ చిన్న రహదారి వస్తుంది. ఇది పుంతమార్గంలా ఉంటుంది. ఇసుక ర్యాంపు నిర్వహించడానికి ఆ ప్రదేశాన్ని మొత్తం చదును చేశారు. ఈ ప్రదేశాన్ని పందెపురాయుళ్లు కోడిపందేలు వేసుకోవడానికి ఎంపిక చేసుకున్నారు. ఆదివారం ఇక్కడ విచ్చలవిడిగా పందేలు జరిగాయి. ఇందుకోసం హైటెక్‌ ఏర్పాట్లు కూడా చేశారు. నీడ కోసం టెంట్లు వేశారు. కోడిపుంజులు ఎగిరినప్పుడు, కాలు రువ్వినప్పుడు మట్టి పైకి లేవకుండా గ్రీన్‌కార్పెట్‌ పరిచారు. చల్లదనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నుంచి లక్షలాది రూపాయల బెట్టింగ్‌లతో పందేలు వేశారు. గుంటుపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కార్లలో వచ్చి పందేలు వేశారు. ఆహారం, మందు కూడా సమకూర్చుకున్నారు. కార్లు బయటకు కనిపించకుండా తుప్పల మధ్య పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.

అసలు వారిని వదిలి.. కొసరు వారిని ఇరికించి..

పందేల సమాచారం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో ఐదు పుంజులు, ఏడుగురు బెట్టింగ్‌ రాయుళ్లను పట్టుకున్నారు. అయితే, ఎలాంటి నగదు లభించలేదు. ఖరీదైన కార్లలో వచ్చిన వ్యక్తులెవరూ పోలీసులకు చిక్కలేదు. విచిత్రమేమిటంటే.. పందేలకు వచ్చిన కార్లు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఇబ్రహీంపట్నం పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై దాడిచేస్తే ఎలా ఉంటుందనడానికి నిదర్శనమే ఈ పరిణామం. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏడుగురిలో కార్లలో వచ్చిన వ్యక్తులెవరూ లేరు. ఆహారం, బీర్లు సరఫరా చేయడానికి ఏర్పాటు చేసుకున్న సహాయకులే ఉన్నారు. వీరిపై పెట్టీ కేసు నమోదు చేసి వదిలేశారు. సాధారణంగా పోలీసులు ఎక్కడైనా దాడి చేసి వ్యక్తులను పట్టుకున్నప్పుడు అక్కడున్న వాహనాలను సీజ్‌ చేస్తారు. ఈ కోడిపందేల శిబిరం వద్ద కనిపించిన కార్లను ఎందుకు పోలీస్‌స్టేషన్‌కు తరలించలేదన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ అధికారి ఎవరు?

ఈ విషయంపై పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు సీరియస్‌గా ఉన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటుపల్లిలో నది ఒడ్డున కోడిపందేలు నిర్వహిస్తున్నారని ఆ సెక్టర్‌ ఎస్‌ఐ పైఅధికారులకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఆ ఎస్‌ఐను అక్కడి నుంచి బయటకు వచ్చేయమని ఓ అధికారి చెప్పినట్టు సమాచారం. ఆ అధికారి ఎవరన్న దానిపై సీపీ ఆరా తీశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకున్నాక ఇబ్రహీంపట్నం సిబ్బందిని సీపీ కార్యాలయానికి పిలిపించారు. మరోసారి ఇలాంటి వ్యవహారాలు కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు తెలిసింది.

Updated Date - Jun 10 , 2025 | 01:03 AM