Share News

వైసీపీ బాటలోనే కూటమి పాలన

ABN , Publish Date - May 06 , 2025 | 12:48 AM

ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపడంలో కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం దారిలోనే పయనిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు అన్నారు.

వైసీపీ బాటలోనే కూటమి పాలన
లెనిన్‌ సెంటర్‌లో సంతకాలు సేకరిస్తున్న సీపీఎం నాయకులు

గవర్నర్‌పేట, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపడంలో కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం దారిలోనే పయనిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు అన్నారు. విద్యుత్‌ దోపిడీకి వ్యతిరేకంగా సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం లెనిన్‌ సెంటర్‌లో సంతకాల సేకరణ జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ అదానీతో చేసుకున్న సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాన్ని రద్దు చేయకపోగా కూటమి ప్రజలపై మరింత భారం మోపే యాక్సిస్‌ ఒప్పందానికి ఆమోదం తెలపడం ప్రమాదకరమన్నారు. విద్యుత్‌ భారాలు, స్మార్ట్‌ మీటర్లు, అవినీతి ఒప్పందాలకు వ్యతిరేకంగా సీపీఎం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తోందన్నారు. విజయవాడ విద్యుత్‌ సౌథ వద్ద బుధవారం నిరసన, లక్షలాది సంతకాల సేకరణ చేస్తామని తెలిపారు. మూడు రోజులుగా విజయవాడలో లక్షలాది సంతకాలు సేకరణ జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో నేతలు దోనేపూడి కాశీనాథ్‌, కె.దుర్గారావు, వై.సుబ్బారావు, లక్ష్మణ, కొండ, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

63వ డివిజన్‌లో..

పాయకాపురం : ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీని తుంగలో తొక్కి అధికారంలోకి రాగానే పేదలపై విద్యుత భారాలు మోపుతోందని సీపీఎం జిల్లా కమిటి సభ్యుడు కె.దుర్గారావు విమర్శించారు. 63వ డివిజన్‌ రాజీవ్‌నగర్‌లో సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. 7న నగరంలోని విద్యుత సౌథ వద్ద జరగనున్న ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాంబాబు, సాంబిరెడ్డి, అమ్ములు, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:48 AM