Share News

సమష్టిగా సమరం

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:53 AM

స్థానిక సమరంలో సమష్టి వ్యూహానికి కూటమి నేతలు శ్రీకారం చుట్టారు. బలాబలాల ఆధారంగా పోటీచేయాలని నిర్ణయించారు. ఈలోపే నియోజకవర్గాల పరిధిలో సమస్యలు పరిష్కరించాలని, నిధులు రాబట్టాలని, సరికొత్త అభివృద్ధి చేసి చూపించాలని ప్రణాళిక వేసుకున్నారు. నోరుపారేసుకునే వైసీపీ నేతలకు ధీటైన సమాధానం చెప్పాలని, వారు చేసిన తప్పులను ప్రజలకు చూపించాలని నిర్ణయించడంతో పాటు కూటమి నేతలంతా కలిసికట్టుగా అడుగులు వేయాలని విజయవాడలో శనివారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు.

సమష్టిగా సమరం
సమావేశంలో పాల్గొన్న కూటమి ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు

స్థానిక ఎన్నికలే టార్గెట్‌గా కూటమి నేతల సమావేశం

బలాబలాల ఆధారంగా పోటీ చేద్దామని నిర్ణయం

నియోజకవర్గాల అపరిష్కృత అంశాలపై దృష్టి

గ్రేటర్‌ విజయవాడపై సుదీర్ఘ సమయం చర్చ

సీఎం సానుకూలంగా ఉన్నారన్న ఎంపీ కేశినేని చిన్ని

వైసీపీ విమర్శలకు ధీటైన సమాధానం ఇవ్వాలని పిలుపు

హాజరైన ఎమ్మెల్యేలు, మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు

కలిసికట్టుగా చంద్రబాబును కలవాలని నిర్ణయం

ఇకపై ప్రతినెలా కూటమి నాయకుల సమావేశం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల కూటమి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల ఆంతరంగిక సమావేశం శనివారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. టీడీపీ నుంచి ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణరావుతో పాటు ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, బొండా ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్‌, శ్రీరాం తాతయ్య, కాగిత కృష్ణప్రసాద్‌, మండలి బుద్ధప్రసాద్‌, వర్ల కుమార్‌రాజా, బోడె ప్రసాద్‌ పాల్గొన్నారు. జనసేన తరఫున ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, బీజేపీ తరఫున ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ విచ్చేశారు. చంద్రబాబుతో మాట్లాడాకే తాను సమావేశానికి వస్తానని కొలికపూడి సమాచారం పంపారు. స్థానిక సంస్థలే ప్రధాన అజెండాగా చర్చ సాగింది. స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో, కూటమి నేతలు, ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా ఉండాల్సిన అంశాలు, వ్యూహాలపై చర్చించుకున్నారు. సమన్వయంతో బరిలోకి దిగుదామని నిర్ణయించారు. షెడ్యూల్‌ విడుదలయ్యే నాటికే ఎవరెక్కడ పోటీ చేయాలన్న దానిపై నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు. నియోజకవర్గాలవారీగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అభివృద్ధి పనులు పూర్తిచేసే అంశాలపైనా చర్చించారు. నియోజకవర్గాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేలంతా ఏకరువు పెట్టారు. నియోజకవర్గాల్లోని పనులు, వాటికి కావాల్సిన నిధులకు సంబంధించి తగిన ప్రతిపాదనలు రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు.

గ్రేటర్‌ విజయవాడకు సై

గ్రేటర్‌ విజయవాడ అంశంపై ఆసక్తికర చర్చ నడిచింది. నగరాన్ని గ్రేటర్‌ చేస్తామని గతంలో అధికారంలో ఉన్న పలు సందర్భాల్లో హామీ ఇచ్చామని, ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి గ్రేటర్‌ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని అందరూ నిర్ణయించారు. ఎంపీ కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ గ్రేటర్‌ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని, ఆయన సుముఖంగా ఉన్నారని చెప్పారు. అందరం కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఈ అంశాన్ని ప్రస్తావిద్దామని సూచించారు.

పేర్ని, జోగి వ్యాఖ్యలకు ధీటుగా స్పందిద్దాం..

వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేశ్‌, ఇతర నేతలు రెచ్చిపోతున్నారని, వారికి తగిన విధంగా సమాధానం చెప్పాలని సమావేశంలో నిర్ణయించారు. వైసీపీ నాయకులు ఎవరిని తిట్టినా, ఆరోపించినా కూటమి నాయకులు సంయుక్తంగా స్పందించాలని సూచించారు. బందరులో పేర్ని నాని స్పీడు పెంచాడని, మంత్రి కొల్లు రవీంద్ర ఇంకా తగిన కౌంటర్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రాజెక్టులపైనా చర్చ

ఉమ్మడి కృష్ణాజిల్లాలో చేపట్టాల్సిన పలు ప్రాజెక్టులపైనా సమావేశంలో చర్చించారు. చోడవరం దగ్గర చెక్‌డ్యామ్‌ను కట్టాలన్న అభిప్రాయాన్ని గన్నవరం, పెనమలూరు ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, బోడె ప్రసాద్‌ తెలియజేశారు. బుడమేరుకు శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. సాగునీటి సమస్యలను పరిష్కరించాలని పెడన ఎమ్మెల్యే కాగిత సూచించారు. పార్టీ పదవుల నియామకాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలను ప్రాధాన్యతగా తీసుకోవాలనే అంశాన్ని యార్లగడ్డ ప్రస్తావించారు.

జిల్లాల విభజన.. మార్పులు, చేర్పులపై..

ఉమ్మడి జిల్లాను రెండుగా విభజించిన నేపథ్యంలో ఎదురవుతున్న చిక్కుముడులపైనా చర్చ జరిగింది. గన్నవరం, పెనమలూరును ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలని, కైకలూరు, ముదినేపల్లిని కృష్ణాజిల్లాలో కలపాలని ఎమ్మెల్యేలు కోరారు. జిల్లా పేరు మార్పు విషయంలో చర్చ జరగ్గా, భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చర్చించుకున్న అన్ని అంశాలను సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించాలని అందరూ నిర్ణయించారు. అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు నిధులు రాబట్టే అంశాలపైనా మాట్లాడాలని ప్రతిపాదించారు. ఇకపై ప్రతినెలా కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశం కావాలని నిర్ణయించారు.

Updated Date - Oct 26 , 2025 | 12:53 AM