Share News

తారాతీరం

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:58 AM

దసరా ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించే ‘విజయవాడ ఉత్సవ్‌’లో తారలు తళుక్కుమననున్నారు. ఈ ఉత్సవ్‌లో అగ్ర కథానాయకుల మూవీ ఈవెంట్స్‌ జరగనుండటం విశేషం. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమా పాటల లాంచ్‌ ఈ ఈవెంట్‌లో జరగనుంది.

తారాతీరం

విజయవాడ ఉత్సవ్‌లో సినీ సందడి

పున్నమిఘాట్‌లో ప్రత్యేక కార్యక్రమాలకు ప్రణాళిక

ఈనెల 22 నుంచి అక్టోబరు 2 వరకు మెగా ఈవెంట్స్‌

చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ సినిమా ఫంక్షన్లు

ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులతో మ్యూజిక్‌ మజా

మిస్‌ విజయవాడ, మారథాన్‌, కృష్ణానదిలో పడవ పోటీలు

ప్రకాశం బ్యారేజీపై క్రాకర్స్‌ ఫైరింగ్‌, సోషల్‌ మీడియా అవార్డ్స్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దసరా ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించే ‘విజయవాడ ఉత్సవ్‌’లో తారలు తళుక్కుమననున్నారు. ఈ ఉత్సవ్‌లో అగ్ర కథానాయకుల మూవీ ఈవెంట్స్‌ జరగనుండటం విశేషం. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమా పాటల లాంచ్‌ ఈ ఈవెంట్‌లో జరగనుంది. అలాగే, యువరత్న బాలకృష్ణ నటిస్తున్న అఖండ-2 సాంగ్‌ లాంచ్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘ఓజీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా దసరా ఉత్సవ్‌లో ప్రధాన ఆకర్షణ కానుంది. నటుడు సిద్దూ నటించిన ‘తెలుసు కదా’ మూవీ టీమ్‌ ఈ ఉత్సవ్‌ను సందర్శించనుంది. వీటితో పాటు ఆహా నిర్వహిస్తున్న ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించటానికి సంగీత దర్శకుడు తమన్‌, గాయకుడు కార్తీక్‌ రానున్నారు. అలాగే, గాయనీ గాయకులు శంకర్‌ మహదేవన్‌, ఆర్పీ పట్నాయక్‌, సునీత, గీతామాధురి, రాహుల్‌ సిప్లిగంజ్‌, రోల్‌ రిడా, సమీరా భరద్వాజ్‌, చిన్మయి, కృష్ణ, రమ్య బెహరా, దామిని, హారిక, రోహిత సందడి చేయనున్నారు. ర్యాప్‌ మ్యూజిక్‌ కోసం కాప్రికో మ్యూజిక్‌ బ్యాండ్‌ రానుంది. వాటర్‌ అండ్‌ కేరళ డ్రమ్స్‌ మ్యూజిక్‌ ట్రూప్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

పున్నమిఘాట్‌లో కార్యక్రమాలు

పున్నమిఘాట్‌, గొల్లపూడి, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో ‘విజయవాడ ఉత్సవ్‌’ కార్యక్రమాలు జరగనున్నాయి. పున్నమిఘాట్‌లో దేవీ పెండాల్‌, డ్రోన్‌ షో, దాండియా అరీనా, హస్తకళల స్టాల్‌, సెల్ఫీ బూత ఏర్పాటు చేస్తారు. రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. వాటర్‌ స్పోర్ట్స్‌లో భాగంగా పడవల పోటీలు, ప్రకాశం బ్యారేజీ దగ్గర బాణాసంచా పేలుళ్లు, గీతామాధురి లైవ్‌బ్యాండ్‌, సందీప్‌ నారాయణ్‌ కార్యక్రమాలు ఉంటాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో 11 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌గా క్లాసికల్‌ డ్యాన్సులు, నాటకాలు, బుర్రకథలు, ప్రముఖుల ప్రవచనాలు, లోకల్‌ టాలెంట్‌ క్లాసికల్‌ డ్యాన్సులు, లోకల్‌ టాలెంట్‌ కల్చరల్‌ కార్యక్రమాలు, యంగ్‌ కిడ్‌ డ్రమ్స్‌ వంటివి నిర్వహిస్తారు.

ఆకట్టుకునే ఈవెంట్స్‌ ఎన్నో..

నగరంలోని కాలేజీ యువ తులకు ‘మిస్‌ విజయవాడ’ పోటీలు జరగనున్నాయి. ‘విజయవాడ ఐడల్‌’ పేరుతో సంగీత కార్యక్రమాలు, ‘విజయవాడ ప్రీమియర్‌ లీగ్‌’ పేరుతో క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తారు. విజయవాడ మారథాన్‌, మెగా యోగా, హస్తకళాఖండాల పోటీలు జరుగుతాయి. ఇవికాకుండా అగ్ని అవార్డులు, సోషల్‌ మీడియా అవార్డులు ప్రత్యేకం.

ఉత్సవ్‌ లోగో సిద్ధం

విజయవాడ ఉత్సవ్‌ లోగో ఖరారైంది. నిర్వాహక కమిటీ శుక్రవారం దీనిని విడుదల చేసింది. ఈ ఈవెంట్‌లో ఏమేం ఉంటాయన్న దానిపై రెండు రోజుల్లో భారీగా సన్నాహక ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ‘వన్‌ సిటీ.. వన్‌ సెలబ్రేషన్‌’ అనే క్యాప్షన్‌తో దుర్గమ్మ బంగారు గోపురం, ప్రకాశం బ్యారేజీ చిత్రాలతో లోగోను తీర్చిదిద్దారు.

Updated Date - Sep 06 , 2025 | 12:58 AM